మోక్షసాధన మార్గాలు

మోక్షాన్ని సాధించడానికి భక్తిని మించిన సాధనం మరొకటి లేదు. ఆదిశంకరాచార్యులు నాలుగు రకాల మోక్షసాధన ఉపాయాలను సూచించారు.

Published : 29 Feb 2024 00:13 IST

మోక్షాన్ని సాధించడానికి భక్తిని మించిన సాధనం మరొకటి లేదు. ఆదిశంకరాచార్యులు నాలుగు రకాల మోక్షసాధన ఉపాయాలను సూచించారు. పరమేశ్వరుణ్ణి పూజించడం, స్తోత్రాలతో శివుడి సంకీర్తన చేయడం, శివభక్తులతో సాంగత్యం, వారితో మాట్లాడటం, శివుడి స్వరూపాన్ని నిరంతరం ధ్యానించడం- ఈ నాలుగు రకాల సాధనలతో మోక్షం లభిస్తుందని వివరించారాయన. మన పురాణాలు కూడా జన్మ జన్మలుగా చేసిన పుణ్యఫలాల కారణంగానే శివుడిపై భక్తి కలుగుతుందని చెబుతున్నాయి. కనుకనే శంకరాచార్యులు ‘శివానందలహరి’లో మహేశ్వరుణ్ణి ఉద్దేశించి- ‘స్వామీ! నువ్వు తీసుకున్నది గరళం. నీ ఆభరణాలు పాములు. నువ్వు ధరించేది చర్మం. నీ వాహనం ఎద్దు. ఇక నాకు ఇచ్చేందుకు నీ దగ్గర ఏముంది కనుక?! అందువల్ల నీ పాద పద్మాల మీద అచంచలమైన భక్తిని ప్రసాదించు.. అది చాలు’ అంటూ ప్రార్థించారు. భక్తితో సాధ్యం కానిది ఏదీ లేదనడానికి కన్నప్ప గాథ గొప్ప ఉదహరణ. అడవుల్లో తిరిగే వనచరుడు భక్తాగ్రేసరుడయ్యాడు. అచంచలమైన భక్తి కారణంగానే.. భక్తకన్నప్ప నోటితో నీళ్లు తెచ్చి.. శివలింగంపై ఉమ్మితే.. ఆ నీరు పరమేశ్వరుడికి దివ్యమైన అభిషేకమైంది. జీవులు గతజన్మలో చేసుకున్న పుణ్యఫలమే శివభక్తికి కారణమౌతుంది. అపార భక్తి వల్ల ఏదైనా సిద్ధిస్తుంది. మోక్షమూ ప్రాప్తిస్తుంది.

బాల కుమారి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు