నైవేద్యాన్ని నిరాకరించిన దేవుడు

ఒక విష్ణు భక్తుడు నిరంతరం నారాయణ జపంలో మునిగి తేలుతుంటాడు. ఆ తాదాత్మ్య స్థితికి ఆనందించి.. అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు స్వామి.

Published : 29 Feb 2024 00:13 IST

క విష్ణు భక్తుడు నిరంతరం నారాయణ జపంలో మునిగి తేలుతుంటాడు. ఆ తాదాత్మ్య స్థితికి ఆనందించి.. అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు స్వామి. భగవానుడి రాకను ఊహించని భక్తుడు ఆశ్చర్యపోయి, ఆయనకు ఏం సమర్పించాలా అని చుట్టూ చూశాడు. ఒకే ఒక్క అరటిపండు కనిపించగా పరవశించాడు. చిత్రంగా పండును పడేసి, తొక్కను భగవంతుడి నోటికి అందించాడు. స్వామి పరమానందంగా తిని, క్షణంలో మాయమయ్యాడు. కొంతసేపటికి తెలివిలోకి వచ్చిన భక్తుడు తన తికమక పనికి చింతించాడు. మరోసారి నారాయణుడు ప్రత్యక్షమైతే ఇచ్చేందుకు వందల పండ్లు తెచ్చి, స్వామి కోసం సిద్ధం చేసుకున్నాడు. అతడి భక్తి చూసి, స్వామి ఇంకోసారి దర్శనమిచ్చాడు. ఈసారి భక్తుడు జాగ్రత్తగా తొక్కను పడేసి, అరటి పండును మాత్రమే నోటికి అందించాడు. స్వామి వెంటనే ఉమ్మేయగా, భక్తుడు విస్తుపోయాడు. ‘ఇంతకుముందు నువ్వు పారవశ్యంలో ఉన్నావు గనుక.. తొక్కే అందించినా ఎంతో రుచిగా ఉండి, తినేశాను. కానీ ఇప్పుడు పండు నుంచి తొక్కను వేరుచేసే సాధనలో ఉన్నావే గానీ భక్తి లేదు. వేగంగా తొక్క తీసి, జాగ్రత్తగా అందించగలను అనే అతిశయం వల్ల.. ఇందులో రుచి లేదు. భక్తుడు ఏది ఇస్తున్నాడని కాదు, ఏ భావనతో ఇస్తున్నాడని చూస్తుంటాను. భక్తితో నివేదించింది నీళ్లే అయినా అమృత సమానం. నేను కోరేది ఆడంబరాన్ని కాదు, అచంచల భక్తిని’ అనేసి అంతర్థానమయ్యాడు.

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని