అంధ పరంపర

ఒకసారి కంచి పరమాచార్య అనుకరణ గురించి మాట్లాడుతూ ‘మీకో కథ చెబుతాను. సంపూర్ణ చంద్ర గ్రహణ సమయంలో ఒక సాధువు నదీస్నానం చేసేందుకు వచ్చాడు. జనం ఎక్కువగా ఉన్నందున.. ‘నా చేతిలోని రాగి కమండలం ఒడ్డున ఉంచితే ఎవరైనా పట్టుకుపోవచ్చు.

Published : 21 Mar 2024 00:03 IST

కసారి కంచి పరమాచార్య అనుకరణ గురించి మాట్లాడుతూ ‘మీకో కథ చెబుతాను. సంపూర్ణ చంద్ర గ్రహణ సమయంలో ఒక సాధువు నదీస్నానం చేసేందుకు వచ్చాడు. జనం ఎక్కువగా ఉన్నందున.. ‘నా చేతిలోని రాగి కమండలం ఒడ్డున ఉంచితే ఎవరైనా పట్టుకుపోవచ్చు. పోనీ చేతిలోనే ఉంచుకుని నీళ్లలోకి దిగితే ప్రవాహ వేగానికి కొట్టుకుపోవచ్చు’ అనుకుని, జనరద్దీ లేని చోటుకు వెళ్లి.. ఇసుక తవ్వి, కమండలాన్ని గోతిలో ఉంచాడు. గుర్తు కోసం ఇసుకను లింగాకృతిలో కుప్పగా అమర్చి, ఇక పదిలం అనుకున్నాడు. తిరిగి ఇవతలికి వచ్చి స్నానం చేశాడు. సాధువు ఇసుకతో లింగాకృతి చేయడం గమనించిన ఓ వ్యక్తి గ్రహణం రోజున సాధువు సైకత లింగాన్ని చేశారంటే అదెంతో పుణ్యప్రదం అన్నమాట- అనుకున్నాడు. అతడు కూడా మరో ఇసుక లింగం చేసి వెళ్లాడు. అది చూసి అంధ పరంపరగా ఇంకొకరు, మరొకరు సైకత లింగాలను చేశారు. స్నానం ముగించి వచ్చిన సాధువుకు అసంఖ్యాకంగా ఇసుక లింగాలు కనిపించి ఆశ్చర్యపోయాడు. లోకులు చాలా సందర్భాల్లో ఎదుటివారు ఎందుకు చేశారనే విచక్షణ లేకుండా అనాలోచితంగా అనుకరిస్తుంటారు. మనం ఎవరు? ఈ లోకానికి ఎందుకొచ్చాం? ఏం చేయాలి? జీవిత పరమార్థం ఏమిటి- అనే విషయాల పట్ల ధ్యాస ఉండాలి. అంతే గానీ ఆచారం, విశ్వాసం పేరుతో అనాలోచితంగా దేన్నీ అనుకరించకూడదు. ఏది యుక్తం, ఏది అయుక్తం అనే విచక్షణతో చేయాలి’ అంటూ వివరించారు.

డా.జయదేవ్‌ చల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని