వాత్సల్య జలధి జిల్లెళ్లమూడి అమ్మ

పరిమిత ప్రేమ మానవత్వం, అపరిమిత మమకారం మాధవత్వం- అని అందరికీ అర్థమయ్యేలా సరళంగా వివరించిన దయామయి జిల్లెళ్లమూడి అమ్మ.

Published : 28 Mar 2024 00:05 IST

రిమిత ప్రేమ మానవత్వం, అపరిమిత మమకారం మాధవత్వం- అని అందరికీ అర్థమయ్యేలా సరళంగా వివరించిన దయామయి జిల్లెళ్లమూడి అమ్మ. ఆ అవ్యాజ వాత్సల్య జలధి 1923 మార్చి 28న జన్మించింది. అంటే వందేళ్లు పూర్తయ్యాయి. నేను నా కుటుంబం, నా ఊరు బాగుంటే చాలు అనుకుంటే అది మానవత్వమే. మన పరిధి విస్తరించి ‘లోకాస్సమస్తా సుఖినో భవంతు’ అని కోరుకుంటే అది మాధవత్వం. మానవులను మాధవులుగా తీర్చిదిద్దడమే అమ్మ ఆశ, ఆశయం.

చండీయాగం, రుద్రయాగంలా.. మాతృయాగం చేయమని తన భక్తులకు చెప్పేవారు జిల్లెళ్లమూడి అమ్మ. రోగులకు ఔషధసేవ, అన్నార్తులకు భోజనసేవ, వృద్ధులు, నిరాశ్రయులకు వస్త్రసేవ ఇలా త్రివిధ సేవ చేయడమే మాతృయాగం. దయకు నిదర్శనంగా అమ్మ నెలకొల్పిన ‘అందరిల్లు’లో ఎలాంటి తారతమ్యాలూ లేకుండా ఎవరు, ఏ సమయంలో ఎక్కడి నుంచి వచ్చినా అన్నంపెట్టి, ఆదరిస్తారు. ‘తినకపోతే మీరు చిక్కిపోతారు, పెట్టకపోతే నేను చిక్కిపోతాను’ అనేదామె.  ‘డ్రెస్సు, అడ్రెస్సు కాదు.. ఇక్కడ భోజనం చేయడానికి ఆకలే అర్హత’, ‘నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా తినిపించు’ అనేవారు.

అమ్మ మాటల్లోని అంతస్సారాన్ని గ్రహించి ఆచరించాలి. త్యాగం, కరుణ, సేవ త్రిగుణాత్మకమైన ఆమెని ఆరాధించడమంటే సకల జీవుల పట్లా ఆదరణ చూపడమే. ఇదే అమ్మ అవతార పరమార్థం. దుష్టులను శిక్షించడం కాదు, దుష్టత్వాన్ని నశింపచేయాలి అనేవారు. అమ్మ పాంచభౌతిక శరీరం  విశ్వ తేజస్సులో లీనమైనప్పటికి ఆ ఆలోచనలు సజీవంగా ఉండిపోతాయి. ఆమె మాటలను అనుసరించి, ఆచరించడమే మన కర్తవ్యం.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని