రామ స్మరణం.. జన్మ సార్థకం

శ్రీరాముడు తల్లి గర్భంలో ఉన్న చివరి తొమ్మిది రోజులు.. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ ఉండే తొమ్మిది రోజులూ పరమ పవిత్రమైనవి. ఈ రోజులను వసంత నవరాత్రులని, గర్భ నవరాత్రులని పిలుస్తారు.

Published : 04 Apr 2024 00:20 IST

ఏప్రిల్‌ 9 వసంత నవరాత్రులు ప్రారంభం

శ్రీరాముడు తల్లి గర్భంలో ఉన్న చివరి తొమ్మిది రోజులు.. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ ఉండే తొమ్మిది రోజులూ పరమ పవిత్రమైనవి. ఈ రోజులను వసంత నవరాత్రులని, గర్భ నవరాత్రులని పిలుస్తారు. ఇవి ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్యపరంగా కూడా విశిష్టమైనవి. శ్రీమహావిష్ణువు మానవ రూపంలో జన్మించి, ఆదర్శ జీవనం గడిపాడు. సాధారణ ప్రజానీకం కూడా శ్రీరాముడి మార్గంలో పయనించి ఉన్నత జీవితాన్ని గడపాలనే సూచన చైత్ర నవరాత్రులు అందిస్తున్నాయి. ఈ తొమ్మిది రోజులు రామాయణాన్ని పారాయణం చేయడం సంప్రదాయం. రామ నామాన్ని పలికినంత మాత్రానే సకల పాపాలూ తొలగిపోతాయన్నాడు భక్త గోపన్న. వసంత నవరాత్రుల్లో దివ్య మంగళస్వరూపుడైన ఆ పురుషోత్తముని ధ్యానిస్తూ భక్తి భావనతో గడపటంవల్ల ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది.

శ్రీరాముడి జీవితానికీ, వసంత రుతువుకీ విడదీయలేని సంబంధం ఉంది. రామ జననం, సీతారామ కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం- అన్నిటికీ వసంత రుతువే సాక్ష్యం. అందువల్లే చైత్ర నవరాత్రులకు మరింత విశిష్టత చేకూరింది. కాలం రాముణ్ణి అనేక రకాలుగా పరీక్షలకు గురిచేసింది. వేదనలన్నింటినీ చిరునవ్వుతో భరించాడు రామచంద్రుడు. మనం కూడా కొత్త సంవత్సరంలోని తొలి తొమ్మిది రోజులూ ఆ మహిమాన్వితుణ్ణి స్మరిస్తూ గడిపి.. జన్మను సార్థకం చేసుకోవాలనేది వసంత నవరాత్రుల వెనుక అంతరార్థం.

ఉత్తర భారతంలోని రామాలయాల్లో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధిస్తూ వసంత నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులూ రామాయణంలోని సప్తకాండలను పారాయణ చేస్తారు. ‘శ్రీరామ రామ రామేతి.. రమే రామే మనోరమే..’ శ్లోకాన్ని అనుసరించి రామ నామాన్ని మూడుసార్లు పలికితే వెయ్యిసార్లు స్మరించినంత పుణ్యం చేకూరుతుంది.

లలితా సహస్రనామ పారాయణ : శ్రీరామచంద్రుడు, లలితా త్రిపురాంబికల మధ్య అభేదాన్ని సూచించింది దేవీ భాగవతం. ఆ కారణంతో వసంత నవరాత్రుల్లో లలితా సహస్రనామ పారాయణతో పాటు పూజాదికాలను నిర్వహించడం కూడా ఆచారమయ్యింది. సర్వదేవతలకూ ఆరాధ్య దైవం లలితాదేవి. ‘హరి బ్రహ్మేంద్ర సేవితా, సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవితా’ మొదలైన నామాలతో ఆ అమ్మను పూజిస్తే సమస్త దేవతలనూ సేవించిన పుణ్యఫలం దక్కుతుంది. ‘లలితాంబిక’ అనే ఒక్కటి తప్పించి తక్కిన నామాలన్నీ అమ్మవారి బిరుదులు కావడం లలితా సహస్రనామాల్లోని విశిష్టత. సాధారణ నామంతో కన్నా బిరుదు నామంతో పిలిచినప్పుడు ఎవరికైనా సంతోషం కదా! అలాంటి సంతోషాన్ని అమ్మవారికి కలిగేలా చేసి, భక్తిని చాటుకునేందుకు లలితా సహస్రనామాలను పారాయణం చేస్తారు. ఆ నామాలను స్మరిస్తున్నప్పుడు ఆ పేరు రావడానికి ఉన్న చరిత్ర మనోఫలకంపై మెదిలి అపరిమిత ఆనందం కలుగుతుంది.

వాంఛారహిత స్థితి : కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలతో జీవితాన్ని సాగించాలని అందరం వాంఛిస్తాం. అయితే కొన్ని వ్యర్థ కోరికలు మనల్ని సన్మార్గం నుంచి మరలిస్తాయి. పూర్వం శివపార్వతుల కల్యాణ సమయంలో స్వామి మూడో కంటి వేడికి మన్మథుడు భస్మమయ్యాడు. ఆ భస్మం నుంచి భండాసురుడనే రాక్షసుడు పుట్టగా.. లలితాదేవి అతణ్ణి సంహరించింది. ఆ రాక్షసుడు మనలో చెలరేగే అపరిమిత కోరికలకు ప్రతీక. మన హృదయంలో అనేక వాంఛలు పుట్టుకొచ్చి ఆధ్యాత్మిక ఉన్నతిని అందుకోనివ్వకుండా అడ్డుపడతాయి. లలితా సహస్రనామాలను పారాయణ చేయడం, అమ్మవారిని శాస్త్రోక్తంగా నవరాత్రుల్లో పూజించడం వల్ల వాంఛారహిత స్థితిని అందుకుంటారనేది అసలు రహస్యం.

సమస్త చరాచర జగత్తుకు మాతృ స్వరూపిణి అయిన లలితామాత త్రిమూర్తులకు ఎలా ఆధారంగా నిలుస్తుందో శంకరాచార్యులు ‘సౌందర్యలహరి’లో ఇలా తెలియజేశారు- బ్రహ్మదేవుడు లలితాదేవి పాదపద్మాల్లోని ఒక పరాగ రేణువుతో సకల చరాచరాలను సృజిస్తున్నాడు. సృష్టి రూపం ధరించిన ఆ రేణువును తన అనంత శిరస్సులతో ధరించి విష్ణువు స్థితి కారకుడు అవుతాడు. ఆ సృష్టినే యుగాంతంలో మహేశ్వరుడు అమ్మ అనుజ్ఞతో క్షణకాలంలో లయం చేసి విభూతిని దేహానికి భస్మంగా రాసుకుంటాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కర్తవ్య నిర్వహణకు తోడ్పడుతున్న అమ్మవారిని అర్చిస్తే గొప్ప ప్రతిఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఆ నమ్మకంతోనే వసంత నవరాత్రుల్లో లలితాదేవిని పూజించి జన్మ చరితార్థం చేసుకుంటున్నారు.

కాలపరంగా : పెద్దలు ఆచరించే అనేక ఆచారవ్యవహారాలు మనని ప్రకృతితో మమేకం చేస్తున్నాయి. చైత్రమాసారంభానికి పెరిగే ఎండలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఉగాది పచ్చడి మొదలు పానకం వడపప్పు లాంటి ప్రసాదాలతో ఈ కాలానికి దేహం కుదుటపడుతుంది. మానసికంగా, శారీరకంగా శక్తిని అందించే చైత్ర నవరాత్రులు పరమ పుణ్యప్రదమైనవి.

రామచంద్ర, కనగాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు