నవ్యతకు నాంది భవితకు పునాది

అంతా కొత్తదనం.. ఎటూ చూసినా ప్రకృతి ఆనంద పరవశం. ఆరు రుతువులు, పన్నెండు మాసాల కాలానికి కళాపి చల్లి రమ్యంగా జీవనరేఖల రంగవల్లులద్ది.. ఇది ఇకపై మీ భవిత- అంటూ చెప్పకనే చెబుతూ చిరుగాలుల చిరునవ్వులతో తలుపు తట్టే పండుగే ఉగాది.

Published : 04 Apr 2024 00:21 IST

ఏప్రిల్‌ 9 క్రోధి నామ సంవత్సర ఉగాది

అంతా కొత్తదనం.. ఎటూ చూసినా ప్రకృతి ఆనంద పరవశం. ఆరు రుతువులు, పన్నెండు మాసాల కాలానికి కళాపి చల్లి రమ్యంగా జీవనరేఖల రంగవల్లులద్ది.. ఇది ఇకపై మీ భవిత- అంటూ చెప్పకనే చెబుతూ చిరుగాలుల చిరునవ్వులతో తలుపు తట్టే పండుగే ఉగాది.

రతరాలుగా జగమంతా సందడి చేస్తున్న పండుగ ఉగాది. ‘ఉగస్య ఆది ఉగాది’ అన్నారు. ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయువు అనే అర్థాలున్నాయి. ఆది అంటే మొదలు. నక్షత్రాలు, గ్రహాల గమనం ఆధారంగా జన్మ వివరాలు, రాశిఫలాలు తదితరాలను అంచనా వేసే రోజు అనే అర్థం ధ్వనిస్తుంది. అలాగే యుగం పదానికి రెండు, జంట అనే అర్థాలున్నాయి. ఉత్తరాయణ, దక్షిణాయనాలు రెండూ కలిసి సంవత్సరం (యుగం) అయ్యింది. ఆ యుగానికి ఆది కనుక యుగాది.. సంవత్సరాది అయ్యింది.

పేరులోనే పరవర్థం

ఉగాది పండుగ పేరులోనే సంప్రదాయ, శాస్త్ర, విజ్ఞాన రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. సంవత్సరాది పదం సంగతి సరే. మరి.. ‘ఉగాది’ అనే మాట ఎలా వచ్చిందని చూస్తే యుగమంటే కాలం. ఆ కాలానికి ఆది లేదా తొలి రోజు యుగాది. కన్నడిగులు ఇప్పటికీ ‘యుగాది’ అనే అంటారు. కానీ మన తెలుగు భాష సంప్రదాయాన్ని అనుసరించి యుగాదిని- ఉగాదిగా వ్యవహరిస్తూ ఆ పేరుతోనే పండుగ చేసుకుంటున్నాం.

పురాణాల మాట

చైత్ర శుక్ల పాడ్యమినాడే.. అంటే ఉగాది నాడే సృష్టి జరిగిందని పురాణాలు, ఇతిహాసాలు వివరిస్తున్నాయి. సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తుండగా వేదాలను దొంగిలించి తీసుకెళ్లి సముద్రంలో దాక్కున్నాడు. మత్స్యావతారాన్ని ధరించిన విష్ణువు- ఆ రాక్షసుణ్ణి వధించి, వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించాడు. ఆ శుభతరుణమే ఉగాది అని, ఈ కారణాన్ని పురస్కరించుకుని ఉగాది పర్వదినంగా వేడుక చేసుకునే ఆచారం వచ్చిందని పురాణాలు పేర్కొన్నాయి. చైత్ర శుక్లపాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభానికి ఉగాది సంకేతమంటారు. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్లపాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లాడు.

ఆనందాల ఉత్సాహం

శిశిరం ముగిసిన తర్వాత వసంతం ప్రారంభంలో వస్తుంది ఉగాది. అప్పుడు చెట్లు చిగురించి, ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహూకుహూ అంటూ రాగాలు తీస్తాయి. అప్పుడు ఆనందాల ఉద్యానవనంలా నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. చైత్ర ఆరంభమైన ఉగాది రోజున పొద్దున్నే లేచి ఇళ్లు, వాకిళ్లు శుభ్రపరచుకుంటారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలస్నానం, దైవపూజ అయ్యాక.. కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.

ఉగాది పచ్చడి

ఈ పండుగకు ప్రత్యేకమైంది ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఉగాది పచ్చడిలోని ఆరు రుచులతో సమన్వయించుకోవాలి, సంయమనంతో (ఇంద్రియనిగ్రహం) స్వీకరించి, జీవితాన్ని సాగించాలన్నదే ఇందులోని అంతరార్థం. మామిడికాయ, వేపపూలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, మిరియాలు తదితరాలతో ఉగాది పచ్చడి చేస్తారు. జీవితంలో మాధుర్యం ఎక్కువుండాలని అరటి, ద్రాక్ష, కమలాపండ్లు, కొబ్బరి తురుము కొంచెం ఎక్కువ మోతాదులో వేస్తారు. ప్రాంతీయ ఆచారాలను అనుసరించి ఒకటి రెండు పదార్థాల్లో మార్పు ఉండొచ్చు. కానీ ఉగాది పచ్చడి అంతరార్థం మాత్రం ఒకటే.

పంచాంగ శ్రవణం

తెలుగునాట ఉగాది రోజున పంచాంగ శ్రవణం తప్పనిసరిగా ఉంటుంది. సంవత్సరంలోని మంచిచెడులు, ఆదాయ వ్యయాలు, గ్రహణాలు, వర్షాలు,  గ్రహాల స్థితిగతులు, వాతావరణ పరిస్థితులు- ఇలా పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని తగిన జాగ్రత్తలను తీసుకుంటారు. స్థూలంగా ఆ సంవత్సరంలో తమ జీవిత క్రమం తెలుసుకుని, అందుకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఉగాది నాటి పంచాంగ శ్రవణం ఉపకరిస్తుంది.

పండుగ ఒకటే.. పేర్లు అనేకం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సంవత్సరాది పండుగను ఉగాది పేరున వ్యవహరిస్తారు. మహారాష్ట్రలో గుడిపాడ్వా అంటే, తమిళులు పుత్తాండు అంటారు. మలయాళీలు విషు అంటే, మరికొందరు వైశాఖీ లేదా బైసాఖీ అంటారు. పేరు ఏదైనా పండుగ చేసుకోవటంలో పెద్దగా తేడాలు కనిపించవు. అయితే వైశాఖీ అని పిలవడంలో ప్రత్యేక కారణం ఉంది. ఉగాదిని చైత్ర ఆరంభంలో కాక వేరేవేరే రుతువుల ప్రారంభ వేళ వేడుక చేసేవారని అవగతమవుతుంది. ఒకప్పుడు కార్తెలను బట్టి రుతు నిర్ణయం జరిగేది. ధనిష్ఠా కార్తితో ప్రారంభమైన శిశిర రుతువుతో- మాఘ పూర్ణిమ నుంచి సంవత్సరం ప్రారంభమయ్యేది. ఇది ఉత్తరాయణ ప్రవేశ కాలం. ఈ విషయాన్ని పరాశరుడు లాంటి మహనీయులు చెప్పినట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఏదేమైనా.. సంవత్సరాది పండుగ- ఉగాది పచ్చడితో జీవితసారాన్ని రంగరించి, పంచాంగంతో హుందాగా భవితను సూచిస్తుంది.

డా.యల్లాప్రగడ మల్లికార్జున రావు, గుంటూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని