కూతురు మరణించినా చలించలేదు!

శ్రీరామకృష్ణ పరమహంస గృహస్థభక్తుడు మహేంద్రనాథ్‌ గుప్త. ఆ గురువరేణ్యుల ప్రబోధాల్ని ‘కథామృతం’గా రచించిన ధన్యుడాయన.

Published : 18 Apr 2024 00:24 IST

శ్రీరామకృష్ణ పరమహంస గృహస్థభక్తుడు మహేంద్రనాథ్‌ గుప్త. ఆ గురువరేణ్యుల ప్రబోధాల్ని ‘కథామృతం’గా రచించిన ధన్యుడాయన. ఆయన్ని ‘మాస్టర్‌ మహాశయ్‌’ అని ప్రేమగా పిలిచేవారంతా. ఒకసారి స్వామి ఆత్మానంద అనే సాధువు వాళ్లింటికి వెళ్లారు. స్వామీజీని చూసిన మహేంద్రనాథ్‌ ఎంతో ఆనందంతో మేడపైకి తీసుకెళ్లారు. అపార భక్తిని, గౌరవాన్ని ప్రదర్శించారు. ఇద్దరూ ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకోసాగారు. ఇంతలో కొందరు వ్యక్తులు హడావుడిగా తిరగటం కనిపించింది. అది చూసిన సాధువు- ‘ఏమిటి విషయం?’ అనడిగారు. మహేంద్ర నాథ్‌- ‘మీరు ఆతిథ్యం స్వీకరించాక చెబుతాను’ అంటూ బదులిచ్చారు. ఇంతలో స్త్రీల రోదనలు వినిపించాయి. ఏదో విషాదం సంభవించిందని గ్రహించిన సన్యాసి- అసలు విషయం చెప్పమని మహేంద్రనాథ్‌ని మరోసారి అడిగారు.

అప్పుడు మాస్టర్‌ మహాశయ్‌ ‘ఉదయం నా కూతురు మరణించింది. ఇప్పుడు ఆమెకి అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది’ అంటూ వివరించారు. అంతటి విషాదంలో కూడా గుండె నిబ్బరాన్ని ప్రదర్శించిన మహేంద్రనాథ్‌ని చూసి సాధువు చలించిపోయారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ‘దుఃఖాలకు ఎంతమాత్రం దిగులు చెందనివాడు, సుఖాలు కలిగాయని సంతోషించనివాడు, అనురాగం, భయం, క్రోధం ఏదీ కూడా మితిమీరకుండా నిబ్బరంగా ఉండేవాడు అయిన మునిని స్థితప్రజ్ఞుడు అంటారు’ అన్న మాటలను గుర్తుచేసుకున్నారు. మాస్టర్‌ మహాశయుడు ఇంతటి స్థితప్రజ్ఞుడు కనుకనే.. శ్రీరామకృష్ణుల వారికి ఆంతరంగిక శిష్యుడయ్యారని మనసులోనే ప్రణమిల్లారు స్వామి ఆత్మానంద.    

 - ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని