క్షీరారామం.. శివపార్వతుల కల్యాణం

శివక్షేత్రమైన క్షీరారామ లింగేశ్వరస్వామికి నిలయం పాలకొల్లు. పంచారామాల్లో క్షీరారామానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ప్రాధాన్యముంది. సోమారామం, దాక్షారామం, కుమారారామం, అమరారామం.. ఈ నాలుగూ ఇక్కడికి దరిదాపుల్లోనే ఉన్నాయి.

Published : 18 Apr 2024 01:02 IST

ఏప్రిల్‌ 18 పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవం

శివక్షేత్రమైన క్షీరారామ లింగేశ్వరస్వామికి నిలయం పాలకొల్లు. పంచారామాల్లో క్షీరారామానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ప్రాధాన్యముంది. సోమారామం, దాక్షారామం, కుమారారామం, అమరారామం.. ఈ నాలుగూ ఇక్కడికి దరిదాపుల్లోనే ఉన్నాయి. పాలకొల్లు అనే పేరు రావడానికి ఇక్కడి ఆలయంలో పాల రంగులో ఉన్న లింగమే కారణమంటారు. పచ్చని పంటపొలాలు, కొబ్బరి, చెరుకు తోటలు పాలకొల్లు ప్రాకృతిక వైభవాన్ని చాటుతున్నాయి. చుట్టూ గోదావరి కాలువలతో అందమైన ద్వీపంలా కనువిందు కలిగిస్తుంది. గోదావరి దక్షిణగంగగా ప్రసిద్ధమైంది. శివుని జటాజూటం నుంచి దిగివచ్చిన నదీప్రవాహమే గోదావరి. గౌతమ మహర్షి గోహత్యా పాపం తొలగించడానికి శివుణ్ణి ఆశ్రయించాడు. అతడి వెంటపడి గౌతమి అయ్యింది. గోహత్యా స్థలాన్ని పునీతం చేసి గోదావరి అయ్యింది. నర్సాపురంలో సంగమమై అంతర్వేదిలో ఈ గోదావరి అంతర్లీనం అవుతుంది. 72 నల్లరాతి స్తంభాలు, సమున్నత ప్రాకారాలతో, 120 అడుగుల ఎత్తు, 9 అంతస్థులతో ఈ ఆలయంలో చాళుక్య శిల్పకళా సౌందర్యం ఉట్టిపడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో సర్వదేవతా సమాహారం నాటి మతసామరస్యానికి సంకేతం. చైత్రశుద్ధ దశమినాడు పాలకొల్లు క్షీరారామ లింగేశ్వర స్వామి కల్యాణోత్సవం ఎప్పటిలా ఘనంగా నిర్వహిస్తున్నారు. పంచారామాలు శివుడికి ప్రీతికరమైన నివాస స్థానాలు. ఒక్కరోజు క్షీరారామంలో ఉంటే ఏడాదిపాటు కాశీలో ఉన్నంత పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం.     

- ఉప్పు రాఘవేంద్రరావు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు