నేలతల్లీ నమోస్తుతే!

సర్వమానవాళికే కాదు, సకల జీవరాశులకూ తల్లి భూదేవి. సమస్తాన్నీ మోసేది, సహించేది భూమి. అందుకే భూమిని ‘సర్వంసహా’ అన్నారు

Published : 18 Apr 2024 01:08 IST

ఏప్రిల్‌ 22 ధాత్రీ దినోత్సవం

 సర్వమానవాళికే కాదు, సకల జీవరాశులకూ తల్లి భూదేవి. సమస్తాన్నీ మోసేది, సహించేది భూమి. అందుకే భూమిని ‘సర్వంసహా’ అన్నారు. నవనిధులను, సప్తధాతువులను, సమస్త ఔషధాలను, లోహాలు, ధనరాశులు.. అన్నిటినీ తనలో ఇముడ్చుకుని - వసుంధర పేరుతో అలరారుతోంది భూమి. పర్వతాలు, నదులు, అడవులు.. సమస్త ప్రకృతినీ ధరించి ‘విశ్వంభర’గా వినుతికెక్కింది.

 భూదేవి శ్రీమహాలక్ష్మి అంశ- అనేది పురాణోక్తి. పాడిపంటలు, పశుసంపద, ఆహారం, అదృష్టం, సంతానం, సంతోషం.. అన్నీ ప్రసాదించి మనల్ని అనుగ్రహిస్తోంది ధరణి. ప్రాణులు ఎగిరినా, నడిచినా, తొక్కినా సహిస్తోంది. కూర్చున్నా, పడుకున్నా ఆదరిస్తుంది. ఎండ, వాన, అగ్ని, నీరు, గాలి- అన్నిటినీ ఇస్తోంది, అన్ని విధాలా రక్షణ కలిగిస్తోంది. అంతేనా.. తల్లి కదా! మల, మూత్ర, వమన, నిష్ఠీవనం (వాంతి, ఉమ్మివేయడం) ఇలా దుర్భర అంశాలను కూడా ఛీత్కరించక భరిస్తోంది. అన్నిటినీ సహించి లాలించి ఒడి చేర్చుకుంటోంది. చివరకు దహన, ఖనన సమయంలో తన సంతతిని తనలోనే ఐక్యం చేసుకుంటోంది.

పంచభూతాల్లో ఒకటి భూమి. ఆ ఐదూ ప్రకృతి శక్తులు. అవి అనుగ్రహిస్తేనే ప్రాణికోటికి ఆహారం, నీరు లభిస్తాయి. శ్వాస ఆడుతుంది. ప్రాణం నిలుస్తుంది. ఆరోగ్యం చేకూరుతుంది. వీటిలో నాలుగింటిని ఆకాశదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు అంటూ పురుష శక్తులుగా ఆరాధిస్తూ.. పుడమిని మాత్రం భూదేవిగా కొలుస్తున్నాం. అంటే భూమి శక్తిస్వరూపిణి, మాతృమూర్తి.

ఉదయాన్నే నేలమీద కాలు మోపినప్పుడు- భూమాతను ప్రార్థించి, కృపను పొందడం భక్తిపూర్వక సంప్రదాయం. పంచభూతాల్లో ఒకటైన భూమి మాతృదేవిగా నిరంతరం ఆరాధనలు అందుకుంటోంది. శ్రీమన్నారాయణుని యోగనిద్రా సమయంలో భూదేవి ఆ దేవదేవుని అంటిపెట్టుకునే ఉంటుందని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. శ్రీదేవి, భూదేవి విష్ణుమూర్తి వక్షస్థలంలో దేవేరులుగా నిరంతరం కొలువై నిలిచారు. విష్ణుమూర్తిని సైతం ‘శ్రీ భూ సమేత శ్రీమన్నారాయణా’ అంటూ ఆరాధిస్తాం.

విష్ణువును ప్రార్థించిన ధరణి

పురాణాల్లో భూదేవి మహిమలు, త్యాగాలు, లీలలు అనేకం దర్శనమిస్తాయి. కృతయుగంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడు లోకాలను అల్లకల్లోలం చేశాడు. భూమిని చుట్టగా చుట్టి సముద్రంలోకి విసిరేశాడు. ఆ రాక్షసచర్యను భరించలేక భూదేవి మహావిష్ణువును ప్రార్థించగా.. ఆయన వరాహరూపం దాల్చాడు. హిరణ్యాక్షుని సంహరించి, భూదేవిని తన ముట్టె మీద నిలిపి ఉద్ధరించాడని పద్మపురాణం చెబుతోంది. అందుకే ఆ స్వామిని భూవరాహస్వామిగా కొలుస్తారు. తిరుమల దివ్య క్షేత్రంలో భూవరాహస్వామి ఆలయం ఉంది. శ్రీనివాసుని కంటే ముందుగానే ఈ స్వామిని దర్శించాలని శ్రీవేంకటేశుని నిర్దేశం. నిజానికి ఇద్దరూ ఒకరేగా! అయినా నియమం నియమమే.

భూమాతను రక్షించిన కశ్యపుడు

పరశురాముడు దుష్టులైన క్షత్రియులను సంహరించాడు. అశ్వ మేధ యాగం చేశాడు. తాను సంపాదించిన యావద్భూమినీ కశ్యప ప్రజాపతికి దానమిచ్చాడు. కశ్యపుడు ఆ భూమిని తన ఊరువులపై (తొడలపై) నిలిపాడు. అలా భూమికి ఉర్వి అనే పేరొచ్చింది. కశ్యపుని పుత్రిగా కాశ్యపి అనే పేరు కూడా స్థిరపడింది. పరశురాముడు క్షత్రియ నాశనం చేస్తున్న సమయంలో కొందరు అడవుల్లో, ఇంకొందరు కొండల్లో దాక్కున్నారు. వాళ్లంతా ధార్మికులు. అంతా తెలిసిన భూమాత- క్షత్రియ వంశోద్ధారణ  కోసం, వారి మనుగడ కోసం, వారి ఉన్నతి కోసం, ధర్మబద్ధమైన రాజ్యపాలన కోసం... కశ్యపుడి ద్వారా వారిని రక్షించింది.

వీరంతా భూ సంతతే..

భూదేవికి విష్ణువు వలన కలిగిన కుమారుడు కుజుడు లేదా అంగారకుడు. భూమికి పుత్రుడు కనుక భౌముడనే పేరూ ఉంది. ఇతడు పంచముఖుడు, అగ్నిసమానుడు. నవగ్రహ దేవతల్లో ఒకడు. మంగళవారానికి అధిపతి. ‘ధరణీ గర్భ సంభూతం’- అంటూ మొదలవుతుంది కుజ స్తోత్రం. కుమార స్వామి కూడా భూ పుత్రుడే. కావడానికి పార్వతీ పరమేశ్వరుల సంతతే అయినప్పటికీ, భూదేవి కొంతకాలం శివుడి తేజస్సును భరించగా పుట్టిన బాలుడు కనుక భూపుత్రునిగా ప్రఖ్యాతి చెందాడు. శ్రీమహాలక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని జనకుడికి అందించిన తల్లి భూదేవి. సీతమ్మవారు అవతార పరిసమాప్తి చేస్తూ.. తల్లి అయిన భూమినే చేరింది. అక్కడి నుంచే శ్రీలక్ష్మిగా వైకుంఠం చేరుకుంది.

సత్యభామగా అవతరించింది..

ద్వాపరయుగంలో విజృంభించిన నరకాసురుడు- భూదేవికి, వరాహస్వామికి పుట్టినవాడు. లోకమాతకు జన్మించినా లోక కంటకుడయ్యాడు. విశేషించి 16 వేల మంది స్త్రీలను బంధించడం భూమాత సహించలేకపోయింది. పుత్రుడే అయినా భరించలేకపోయింది. స్త్రీలను నిర్బంధించినందుకు క్షమించలేకపోయింది. సత్యభామగా అవతరించింది. శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రియపత్ని అయ్యింది. లోకద్రోహి అయిన సుతుని సంహరించడానికి సహకరించింది. నరకుని కడతేర్చినందుకు తల్లిగా సంతసించింది. తన ధర్మాన్ని పాటించి విశ్వ శ్రేయస్సును చేకూర్చిన లోకజనని భూమాత. కలియుగంలో గోదాదేవిగా అవతరించి శ్రీరంగనాయకుని వివాహమాడి, వైష్ణవ సంప్రదాయంలోని ఆళ్వారుల్లో ఒకే ఒక స్త్రీమూర్తిగా నిలిచింది. పాశురాలను రచించి, భక్తులకు అందించింది.

భూదానం మహా గొప్పది!

క్షమాగుణానికి, సహన సంపత్తికి పెట్టింది పేరు భూమాత. అందుకే ప్రతి స్త్రీ- క్షమాగుణంలో ధరిత్రిగా ఉండాలని మనువు నిర్దేశం. మహాభారతంలో భూదేవి ఎన్నెన్నో మంచి మాటలను బోధించింది. ఆ సారం మొత్తం భూగీతగా ప్రఖ్యాతి చెందింది. ఈ గీతలో భూదాన మహిమ మహోన్నతంగా వర్ణితమైంది. భూదానం వలన సకల పాపాలూ నశించి, ఇహ పర సౌఖ్యం ప్రాప్తిస్తుంది. నవరత్నాలు, బంగారం మొదలైనవన్నీ భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి కనుక భూదానం చేస్తే సమస్త సంపదలనూ దానం చేసినట్లే. భూదానంతో అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది

డాక్టర్‌ పులిగడ్డ లలితవాణి


ధరణీదేవి అనుమతి పొందాలి..

జగన్మాత, ప్రకృతి మాత అయిన భూదేవికి కనుక ఆగ్రహం కలిగిస్తే- కంపించిపోతుంది. అలాంటి సమయంలోనే భూకంపాలు సంభవిస్తాయి. ఏ కట్టడం ప్రారంభించాలన్నా- ముందుగా భూమిపూజ చేసి, ఆ తల్లి అనుగ్రహాన్నీ, అనుమతినీ పొందుతారు. పారలు, గునపాలతో నేలకు ఒత్తిడి కలిగించాల్సి వస్తుంది కనుక ముందుగా ఆ తల్లిని పూజించి, క్షమను పొందుతారు. మంత్రపూరిత అస్త్రాల్లో భౌమ్యాస్త్రం (భూమిబాణం) కూడా ప్రసిద్ధమైంది. అది ప్రకృతి శక్తితో కూడిన మహాస్త్రం. అర్జునాదులు ఈ అస్త్ర ప్రయోగంలో నిపుణులు. ఈ విద్యతో భూమి లోపలికి ప్రవేశించగలుగుతారు.


అవనికి ఆలయాలు

ఒడిశాలో భూదేవికి ‘రజో మహోత్సవం’ పేరుతో 3 రోజుల పాటు ఉత్సవం చేస్తారు. ఈ 3 రోజులూ భూమిని దున్నడం, తవ్వడం లాంటివి చేయరు. భూమికి ఏ మాత్రం కష్టం కలగకుండా జాగ్రత్తపడతారు. తమిళనాడు, ఒంగోలు, కర్ణాటక, తిరుమల, హైదరాబాదుల్లో భూదేవి ఆలయాలున్నాయి. అక్కడ ఆయా సందర్భాల్లో పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని