ప్రాణం ఉన్నంతవరకే..

అనేక ఆస్తులు కూడబెట్టిన ఒక ధనికుడు మరణించాడు. అతడి పార్థివ శరీరాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు.

Published : 28 Mar 2024 00:04 IST

నేక ఆస్తులు కూడబెట్టిన ఒక ధనికుడు మరణించాడు. అతడి పార్థివ శరీరాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఇంతలో వర్షం మొదలైంది. వానలో తడిస్తే చెప్పులు పాడైపోతాయనుకున్నాడు రథసారథి. బాట పక్కనున్న ఇంట్లోకి వెళ్లి.. తన చెప్పులు ఒక మూల పెట్టుకుని యాత్ర ముగియగానే తీసుకెళ్తానన్నాడు. ఇంటి యజమాని అందుకు అంగీకరించాడు. సారథి బయటకు వచ్చేసరికి వర్షం కుంభవృష్టిగా మారింది. ధనికుడి బంధువు ఆ ఇంటికే వెళ్లి.. వర్షం తగ్గేవరకూ శవాన్ని ఉండనివ్వమంటే యజమాని ససేమిరా కుదరదన్నాడు. బంధువు కోపగించి ‘సారథి చెప్పులను అనుమతించావు.. ఇంత గొప్ప వ్యక్తి శవాన్ని కాదంటావా? ఇదేం న్యాయం?’ అన్నాడు. దానికతడు ‘అయ్యా! చనిపోయాక రాజు, పేద అనే తేడా లేదు. ఎంతటి వారిదైనా శవాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు మాత్రం అనుమతిస్తారు?!’ అన్నాడు. ఆ మాట అక్షరసత్యం కనుక.. అతడు ఇంకేం మాట్లాడలేదు. శంకరాచార్యులవారు-

యావత్‌ పవనో నివసతి దేహే
తావత్‌పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్‌ కాయే

అన్నారు. దేహంలో ప్రాణం ఉన్నంత వరకే అయినవారు క్షేమం గురించి అడుగుతారు. ప్రాణం పోయాక.. ఆ శవాన్ని చూసి అతడి భార్య కూడా భయపడుతుందని భావం.

లక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని