వివాహ యోగం కలిగించే వీరేశ్వరస్వామి

గౌతమీ నదీతీరాన విరాజిల్లుతోంది డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలోని మురముళ్ల.

Published : 09 May 2024 00:16 IST

గౌతమీ నదీతీరాన విరాజిల్లుతోంది డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలోని మురముళ్ల. ఈ సుప్రసిద్ధ శైవక్షేత్రంలో స్వామి శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ క్షేత్రంలో ప్రతినిత్యం సంప్రదాయబద్ధంగా కల్యాణం నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వామివారికి కల్యాణం జరిపిస్తే వివాహయోగం, సంతాన భాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం.

దక్ష ప్రజాపతి తాను తలపెట్టిన యజ్ఞానికి కుమార్తె దాక్షాయణి, అల్లుడు శివుణ్ణి ఆహ్వానించలేదు. పుట్టింటిపై మమకారంతో పిలుపు లేకున్నా వెళ్లి.. అవమానానికి గురై, ఆత్మాహుతికి పాల్పడింది దాక్షాయణి. ఆగ్రహించిన శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి, దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. దక్షుడు పశ్చాత్తాపం చెందడంతో.. ఆయనకు మేక తల అతికించి యజ్ఞం పూర్తి చేయించాడు. కానీ వీరభద్రుడు శాంతించలేదు. త్రిమూర్తులంతా దేవతలతో కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థించడంతో తన షోడష కళలతో, భద్రకాళీ అవతారంతో మురముళ్ల సమీపంలోని నదీతీరంలో మునిగి అందమైన కన్యగా వీరభద్రుడికి కనిపించడంతో శాంతించాడు. వెంటనే దేవతలు, మునులు వారిద్దరికీ గాంధర్వ పద్ధతిలో వివాహం చేశారు. అప్పటి నుంచి స్వామి వారి కల్యాణం ఆనవాయితీ అయ్యింది. ఈ వేడుకకు నారద మహర్షితో సహా అగస్త్య, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమ, భార్గవ, వ్యాస, భరద్వాజ, మారీచ, కశ్యప, మార్కండేయాదులు విచ్చేస్తారన్నది పురాణ వచనం. మహర్షులందరూ గౌతమీ నదీతీరాన ఆశ్రమాలు ఏర్పరచుకున్న మునిమండలి ప్రాంతమే కాలక్రమేణా మురముళ్లగా మారిందని పెద్దలు చెబుతారు. ఎందరెందరో భక్తులు వచ్చి స్వామివారికి కల్యాణం జరిపిస్తుంటారు. అలా కల్యాణం చేయించాలనుకున్న భక్తుల వివరాలను మూడు నెలల ముందుగానే నమోదు చేసుకుంటారు. ఈ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలున్నాయి. ఇక్కడికి ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. కాకినాడ నుంచి 36, అమలాపురం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉందీ పుణ్యక్షేత్రం.

పెద్దిరెడ్డిగారి పవన్‌కుమార్‌ రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని