సత్యాగ్రహమూ సాధనే!

గాంధీజీ సబర్మతీ ఆశ్రమం ప్రారంభించిన తొలినాళ్లవి. ఒకరోజు అత్యంత ఆత్మీయుడైన వ్యాపారి ఓ నిరుపేద ఉపాధ్యాయ కుటుంబాన్ని అక్కడ చేర్చుకోమంటూ లేఖ రాశాడు.

Published : 09 Mar 2023 00:18 IST

గాంధీజీ సబర్మతీ ఆశ్రమం ప్రారంభించిన తొలినాళ్లవి. ఒకరోజు అత్యంత ఆత్మీయుడైన వ్యాపారి ఓ నిరుపేద ఉపాధ్యాయ కుటుంబాన్ని అక్కడ చేర్చుకోమంటూ లేఖ రాశాడు. భార్య, చంటిబిడ్డతో పేదరికం అనుభవిస్తున్నా డని, బోధనా పాటవం ఉన్నవాడని వివరించాడు. నాటి వర్గ వివక్షపరంగా అతడు అంత్యజుడైనా గాంధీజీ సబర్మతికి స్వాగతించారు. కానీ ఆశ్రమానికి ఆర్థిక సాయం చేస్తున్న కొందరు వ్యతిరేకించి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టసాగారు. వాళ్లని కనీసం బావిలోంచి నీళ్లు కూడా తోడుకోనివ్వలేదు. ఆర్థికసాయం ఆపేయడమే కాకుండా ఆశ్రమాన్ని మూయించేస్తామని హెచ్చరించారు. గాంధీజీ ప్రతిస్పందించలేదు, ప్రతిఘటించలేదు. కానీ వారి ఆగడాలకు నిరసనగా మౌనదీక్ష, ఉపవాసం చేశారు. అలాగే ఆశ్రమాన్ని ఒక మురికివాడ దగ్గరకు మార్చాలని, కాయకష్టం చేసి అవసరమైన సొమ్మును సంపాదించాలని నిర్ణయించుకున్నారు. మహాత్ముడి మౌన నిరసనకు ప్రత్యర్థులు హడలిపోయారు. మనసు మార్చుకుని దిగి వచ్చారు. క్రియాశీలక తిరుగుబాటు కన్నా సాత్త్విక ప్రతిఘటనే శక్తిమంతమైందన్న వాస్తవం మరోసారి నిరూపితమైంది. అదే ‘సత్యాగ్రహం’గా ఎన్నో సాత్త్విక ఉద్యమాలకు ఊపిరిపోసింది. నిజంగా దీనికి మించిన ఆయుధం మరొకటి లేదు. అసలు ‘ఆగ్రహం’ అంటే సంస్కృతంలో ‘కోపం’ కన్నా ముందు నిగ్రహం, పట్టుదల, దయ, అంగీకారం అనే అర్థాలున్నాయి. అందుకే బౌద్ధగురువు దలైలామా ‘గాంధీజీ సత్యాగ్రహ సూత్రాన్ని ప్రగాఢంగా నమ్ముతాను. అది కూడా ఆధ్యాత్మిక సాధనే’ అన్నారు.

ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని