సకల విద్యా దాత్రి సరస్వతి

శాంతికి చిహ్నమైన ధవళ వస్త్రాలు ధరించి ప్రసన్నవదనంతో దర్శనమిస్తుంది. వీణ, పుస్తకం, పద్మం, అక్షమాలలను చేపట్టి సర్వ విద్యలనూ ప్రసాదిస్తుంది వాగ్దేవి.

Updated : 26 Jan 2023 03:13 IST

శాంతికి చిహ్నమైన ధవళ వస్త్రాలు ధరించి ప్రసన్నవదనంతో దర్శనమిస్తుంది. వీణ, పుస్తకం, పద్మం, అక్షమాలలను చేపట్టి సర్వ విద్యలనూ ప్రసాదిస్తుంది వాగ్దేవి.

మస్త విద్యలతో, సకల కళలతో అశేష విజ్ఞానదాత్రి సరస్వతి అవతరించిన పుణ్యదినమే వసంతపంచమి. బ్రహ్మ చేతిలో రూపుదిద్దుకున్న ఈ అమ్మ, సృష్టికార్యంలో చేయూతగా నిలిచేందుకు ఆయన చేయందుకుంది. బ్రహ్మ పత్నిగా జనుల నాలుక కొన మీద స్థానాన్ని స్థిరపరచుకుంది.

సర్వచైతన్య రూపాం తాం ఆద్యం విద్యాం

చ ధీమహి బుద్ధిం యోనః ప్రచోదయాత్‌

అంటూ వ్యాసుడు అమ్మకు ఆదీ అంతాలు లేవంటూ స్తుతించాడు. మూలప్రకృతికి వ్యక్తరూపాలైన గణేశ, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి రూపాల్లో ఒకరిగా సరస్వతిని దర్శించాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు సాక్షాత్తూ బ్రహ్మ, సరస్వతిని పూజించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు.
‘అంబితమే నదీతమే దేవితమే సరస్వతి’ అంటోంది రుగ్వేదం. ‘సరో నిరం, జ్ఞానం వా తద్వత్‌ రసో వా తస్య సరస్వతీ’ అన్నారు. రసవంతం, సారవంతం అయిన పుష్కల ప్రవాహధార అనేది సారాంశం. అది జలమైనా, కళ అయినా, సాహిత్యమైనా వ్యక్తి స్వభావాన్ని, సామర్థ్యాన్ని స్వీయతను శుద్ధిచేసే, చేయగలిగే అపురూప ఆధ్యాత్మిక భావనే సరస్వతిగా భావించవచ్చు. మరో కోణంలో కాంతినిచ్చేది సరస్వతి. ‘కుందేందు తుషార హార ధవళం’తో పోల్చినా, ‘శారదనీరదేందు ఘనసార పటీర మరాళం’తో సరిపోల్చినా,

సురాస్సురైసేవిత పాదపంకజా

కరేవిరాజత్కమనీయ పుస్తకా

విరించిపత్నీ కమలాసన స్థితా

సరస్వతీ నృత్యతు వాచి మే సదా

అంటూ వర్ణించినా ఆ అమ్మకే చెల్లింది. సాత్విక గుణ స్వభావి వాగ్దేవి. ఆయుధం చేపట్టని అహింసామూర్తి సరస్వతి. ఆ స్వచ్ఛతకు చిహ్నమే తెలుపు. మాయలో చిక్కుకుపోయిన మన అంతర్‌ దృష్టికి ప్రచోదనం కలిగించే జ్ఞానకాంతి భారతి.

కళల కాణాచి

దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిని భైరక్షమాలాందధానా హస్తేనైకేన పద్మం.. అన్నారు- వీణాపాణి నాలుగు చేతుల్లో ధరించే వీణ, పుస్తకం, అక్షమాల, పద్మం సైతం మనకు జ్ఞానబోధ చేయగలవు. సరస్వతి వీణ పేరు కచ్ఛపి. అది సృజనాత్మకత, కళలు, భావాలు, భావోద్వేగాలకు ప్రతీక. పుస్తకాలు నాలుగు వేదాలకు సంకేతం. అవి సార్వత్రిక, దైవిక, శాశ్వత, అనువర్తనీయ జ్ఞానాలను సూచిస్తూ అడుగడుగునా మార్గనిర్దేశం చేస్తాయి. అక్షమాల లేదా స్ఫటికమాల ధ్యానాన్ని సూచిస్తుంది. స్వీయ అంతర్దర్శనానికి దారితీసి తద్వారా విచక్షణ కలిగిస్తుంది. అమ్మ చేతిలోని పద్మం దైవత్వాన్ని సూచిస్తుంది. సమస్త విద్యలూ ప్రాప్తింపచేస్తుంది.

సరస్వతీ నమస్తుభ్యం

అమ్మ హంసవాహిని. స్వభావరీత్యా హంస నీటిని వేరుచేసి స్వచ్ఛమైన పాలను గ్రహిస్తుంది. అలాగే బుద్ధిమంతులు చుట్టూ ఉన్న విషయాల్లోంచి మంచిని మాత్రమే గ్రహించాలి. పవిత్ర మాఘ మాసంలో శుద్ధపంచమిన అమ్మ అవతరించిందని వేదోక్తి. అందుకే ఆ రోజు తెలుపు లేదా పసుపు దుస్తులు ధరించి పూజపీఠంపై పుస్తకాలనుంచాలి. వాటిని అమ్మగా భావించి జ్ఞానప్రాప్తికై షోడశోపచార పూజ చేయాలి. తెల్లటి పూలు, శ్రీగంధంతో అర్చించి క్షీరాన్నం, రేగుపళ్లు, చెరుకురసాలను నివేదించాలి.

మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే వాగ్దేవి. అందుకే అమ్మ సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తారు. బెంగాల్లో సరస్వతీ పూజను ఘనంగా నిర్వహిస్తారు. మండపంలో నెలకొల్పిన మూర్తిని నాలుగు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. రాబోయే వసంత రుతువుకు సూచికగా యువజనం మదనోత్సవాన్ని నిర్వహిస్తారు.

పార్నంది అపర్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని