మేలు మరవని మహాగుణం

సాత్వికతకు ప్రతీక కృతజ్ఞత. అది వ్యక్తిగత ఉన్నతికి, పారమార్థిక పురోగతికీ తోడ్పడుతుంది. కృతజ్ఞతతో మెలగడం ధీరోదాత్త లక్షణం.

Published : 02 Feb 2023 00:30 IST

సాత్వికతకు ప్రతీక కృతజ్ఞత. అది వ్యక్తిగత ఉన్నతికి, పారమార్థిక పురోగతికీ తోడ్పడుతుంది. కృతజ్ఞతతో మెలగడం ధీరోదాత్త లక్షణం. ఇది లౌకికంగానూ, పారలౌకికంగానూ మహోన్నతులను చేస్తుంది. విశ్వసనీయత, కృతజ్ఞత దైవీగుణాలకు ప్రతీకలు.

సీతాన్వేషణలో సహాయార్థం రామలక్ష్మణులు వానర వీరుడైన సుగ్రీవుణ్ణి కలిశారు. అప్పటికే సుగ్రీవుడు సోదరుడు వాలి చేతిలో దెబ్బలు తిని రుష్యమూక పర్వతంపై తలదాచు కుంటున్నాడు. తన రాజ్యాన్నే కాకుండా భార్యను కూడా స్వాధీనం చేసుకున్న వాలిని సంహరిస్తే, తాను సాయంచేస్తానని మాటిచ్చాడు. రఘురాముడు అందుకు అంగీకరించాడు. ఆ ధైర్యంతో సుగ్రీవుడు, వాలిని యుద్ధానికి రమ్మని రెచ్చగొట్టాడు. వాలిసుగ్రీవుల పోరాటంలో సీతానాథుడు చెట్టుచాటు నుంచి ప్రయోగించిన శక్తివంతమైన బాణానికి వాలి నేలకూలాడు. ‘రాజ్యాభిషిక్తుడవై వర్షాకాలం ముగిశాక, ఇచ్చిన మాట ప్రకారం సీతాన్వేషణ ప్రారంభించు’ అని సుగ్రీవుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు. కానీ రుతువులు మారినా సుగ్రీవుడు రాజ భోగాల్లో మునిగాడు. జానకి జాడ తెలుసుకోమని ఎందరు గుర్తుచేసినా వినకుండా కృతజ్ఞత మరచి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వానరరాజు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ప్రవర్తిస్తున్నాడని తెలిసి సీతాపతి ఆగ్రహించి...

కృతార్థాహ్యకృతార్థానాం మిత్రాణాం న భవంతి యే

తాన్‌ మృతానపి క్రవ్యాదాః కృతఘ్నాన్‌ నోపభుంజతే

..మిత్రుల సాయంతో తమ పని పూర్తిచేసుకొని, తిరిగి మేలు చేయనివారు కృతఘ్నులు. అలాంటివారు చనిపోతే వారి కళేబరాలను క్రూరమృగాలు కూడా ముట్టవు- అని హెచ్చరిస్తూ లక్ష్మణుడిని సుగ్రీవుడి వద్దకు పంపాడు.
ధార్మిక జీవనంలో ఉండాల్సిన గొప్ప సుగుణం కృతజ్ఞత. చేసిన మేలును మరువక అవకాశం వచ్చినప్పుడు అంతకు పదింతలు మేలు చేయమన్నారు పెద్దలు. ప్రియంగా పిడికెడు అటుకులు పెట్టినందుకు శ్రీకృష్ణుడు మిత్రుడు సుదాముడికి పసిడిమేడలు ప్రదానం చేశాడు. అందుకే పూర్ణపురుషుడయ్యాడు. ప్రేమతో చిటికెడు ఇసుక మోసి వారధి నిర్మాణంలో సాయపడినందుకు ఉడుత వెన్ను నిమిరి చిరకీర్తిని ప్రసాదించి శ్రీరామచంద్రుడు పురుషోత్తముడయ్యాడు. కానీ కొందరు ఎంతటి సాయం చేసినా క్షణాల్లో మరచిపోతున్నారు. కొద్దిపాటి కష్టం కలిగినా కత్తులు నూరుతున్నారు.


మేలు... కీడు...

దురదృష్టవశాత్తూ తోటివారు చేసిన కొండంత సాయం కన్నా, గోరంత కీడునే గుర్తుపెట్టుకుంటాం మనం. అందుకే ఆధ్యాత్మిక తరగతులకు హాజరైన శిష్యులతో కృతజ్ఞతకు సంబంధించి ఓ జెన్‌గురువు ఆసక్తికర కథ చెప్పారిలా..
ర్యోకన్‌, నానిన్‌ అనే ఇద్దరు మిత్రులు ఎడారిలో వెళ్తున్నారు. సరదాగా ప్రారంభమైన వారి సంభాషణ వివాదానికి దారితీసింది. ర్యోకన్‌ కాసేపటికి నానిన్‌ చెంప చెళ్లు మనిపించాడు. అయినా ఇద్దరూ కలిసే నడుస్తున్నారు. కొంతదూరం వెళ్లాక ‘ర్యోకన్‌ నాపై చేయి చేసుకున్నాడు’ అని ఇసుకమీద రాశాడు. ఇంతలో ఇసుక తుపాను రేగి, నానిన్‌ ఇసుకలో కూరుకుపోతున్నాడు. ర్యోకన్‌ పైకి లాగి రక్షించాడు. ఈసారి నానిన్‌ ఒక రాయి మీద ర్యోకన్‌ తన ప్రాణాన్ని రక్షించాడంటూ శిలాక్షరాలు చెక్కాడు. ర్యోకన్‌ ఆశ్చర్యపోయి ‘నేను కొట్టిన సంగతి ఇసుకపై రాశావు, రక్షించిన విషయాన్ని రాతిపై చెక్కావేంటి?’ అనడిగాడు. అతడు నవ్వి ‘చేసిన అపకారాన్ని వెంటనే మర్చిపోవాలి, సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి’ అన్నాడు.

భారతంలో ఎందరో వీరుల్ని చూస్తాం. అందులో కర్ణుడు మరీ ప్రత్యేకం. దానగుణానికే కాదు కృతజ్ఞతకూ నిలువెత్తు నిదర్శనం. శ్రీకృష్ణుడు తనను పాండవుల వైపుకు రమ్మన్నప్పుడు, కర్ణుడు తనకన్నా దుర్యోధనుడు తనపై పెట్టుకున్న నమ్మకం గురించి ఎక్కువ ఆలోచించాడు. తాను ముందుండి సైన్యాన్ని నడిపిస్తానన్న విశ్వాసంతోనే రారాజు యుద్ధప్రణాళికలు రచించాడని గుర్తుచేసు కున్నాడు. ఎన్ని ప్రలోభాలుపెట్టినా ప్రత్యర్థుల పక్షంలో చేరలేదు. ‘విదితం మే హృషీకేశ యతో ధర్మస్తతో జయః’ అనుకున్నాడు. ధర్మపరులైన పాండవులే గెలుస్తారు అంటూనే తాను మాత్రం దుర్యోధనుణ్ణి వీడే ప్రసక్తే లేదన్నాడు. అందుకే కృష్ణుడంతటివాడు రాధేయుడి కృతజ్ఞతాభావానికి కదిలిపోయాడు.


ప్రకృతికీ...పరమాత్మకూ!

కృతజ్ఞత అనేది తోటి మనుషుల పట్లే కాదు ప్రకృతి, పరమాత్మల విషయంలోనూ కనబరచాలి. అవి అన్నిటి కంటే ఘనమైన రుణాలు. పరమాత్మ అనుగ్రహంతో మానవజన్మను పొంది, ప్రకృతి పోషణతో పుష్టిగా ఎదిగి కృతఘ్నతతో రుణగ్రస్తులుగా మిగిలిపోతే మనిషి జన్మ నిరర్థకమవుతుంది. ‘ఏ పాపం నుంచైనా బయటపడవచ్చేమో కానీ, కృతఘ్నత నుంచి బయటపడటం అసాధ్యం’ అని ఒకసారి, ‘మబ్బు నీళ్లు తాగి మరల ఈయని వేళ కడలి గర్భమెంత కలత చెందు..’ అని మరోసారి అన్నారు తమిళయోగి తిరువళ్లువర్‌.


కృతజ్ఞులు.. కృతఘ్నులు..

భగవంతుడు మనం అడగకుండానే ఎన్నో సౌఖ్యాలు సమకూర్చాడు. మరెన్నో సంతోషాలు ప్రసాదించాడు. ఊపిరి ఉన్నన్నాళ్లూ ఆ అంతర్యామిని ఆరాధించినా ఆయన రుణం తీరదు. కానీ లౌకిక లంపటాల్లో పడి లోకేశ్వరుణ్ణీ, ఆయన చేసిన మేలునీ మర్చిపోతున్నాం. ప్రాపంచిక జీవనమే పరమార్థంగా బతికేస్తున్నాం. అందుకే..

మో సమ్‌ కౌన్‌ కుటిల్‌ ఖల్‌ కామీ?
జిన్‌ తన్‌ దియో తాహి సిసరాయో ఐసో నమక్‌ హరామీ..

అన్నాడు భక్త సూరదాస్‌. ‘నా వంటి కుటిలుడు ఇంకెవరైనా ఉంటారా? తనువునిచ్చిన ప్రభువు పట్ల కృతజ్ఞత మరిచి కృతఘ్నుణ్ణయ్యాను’ అంటూ పశ్చాత్తాపం చెందాడు.

చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని