AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణా ఫస్ట్‌.. విజయనగరం లాస్ట్‌

AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాల్లో కృష్ణా మొదటి స్థానంలో ఉండగా.. విజయనగరం జిల్లా చివరిస్థానంలో నిలిచింది.

Updated : 26 Apr 2023 20:12 IST

  మొదటి సంవత్సరం ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 
    ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం క్లిక్‌ చేయండి    

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాల(AP Inter Results)ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ(Vijayawada)లో విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల(Intermediate Exams)కు సంబంధించిన ఫలితాలను ప్రకటించారు. ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించినట్టు తెలిపారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 4,33,275 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందులో 2,66,326 (61శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. పాసైన వారిలో బాలికలు 65 శాతం, బాలురు 58శాతం ఉన్నట్టు చెప్పారు. 

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,79,750 మంది విద్యార్థులు హాజరు కాగా, 2,72,001 మంది(72శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు75శాతం, బాలురు 58 మంది ఉన్నట్టు వెల్లడించారు.  ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో 75శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా 70శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, 68 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో  83శాతం ఉత్తీర్ణతతో కృష్ణా మొదటి స్థానంలో నిలవగా, 78శాతం ఉత్తీర్ణతతో గుంటూరు రెండో స్థానం, 77శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి తృతీయ స్థానంలో నిలిచాయని మంత్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లా విజయనగరం ఫలితాల్లో చివరి స్థానంలో ఉంది.

మే 6వరకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అవకాశం..

ఇంటర్‌ ఫలితాల(Inter Results)కు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని మంత్రి సూచించారు. ఏప్రిల్‌ 27 నుంచి మే 6వరకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించిందని చెప్పారు. పరీక్ష ఫెయిల్‌ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ కోసం మే 24 నుంచి జూన్‌1 వరకు వరకు రెండు విడతల్లో  పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు త్వరలో విడుదల చేస్తుందన్నారు. ఫలితాల్లో విజయనగరం జిల్లా వెనుకబడటంపై మంత్రి బొత్స స్పందించారు. లోపాలను గుర్తించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు