Preparation: ‘మ్యాజిక్‌’ ప్రిపరేషన్‌ మీకు తెలుసా?

పరీక్షలు బాగా రాసి ఎక్కువ మార్కులు సంపాదించాలనే విద్యార్థులందరూ కోరుకుంటారు. సహవిద్యార్థుల కంటే తక్కువ మార్కులు వస్తే కాస్త అవమానంగానూ భావిస్తారు.

Updated : 12 Dec 2023 14:51 IST

Exams Preparation | పరీక్షలు బాగా రాసి ఎక్కువ మార్కులు సంపాదించాలనే విద్యార్థులందరూ కోరుకుంటారు. సహవిద్యార్థుల కంటే తక్కువ మార్కులు (Marks) వస్తే కాస్త అవమానంగానూ భావిస్తారు. అయితే ఎంత శ్రద్ధగా చదివినప్పటికీ కొన్ని ఆందోళనలూ, సమస్యలూ ఇబ్బందిపెడుతూనే ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం..

బ్జెక్టులు అన్నింటినీ ఒకే రకమైన ఆసక్తితో చదవలేరు కదా.. కొన్ని ఇష్టమైనవీ, మరికొన్ని కష్టమైనవీ ఉంటాయి. కానీ అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకోవడం ఎంతో అవసరం. ఈ విషయంలో విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ కూడా ఉంటుంది. దాంతో ఆందోళనకు గురవుతుంటారు. పరీక్షలు, మార్కుల గురించి పదేపదే ఆలోచించడం వల్ల ఒత్తిడి (Stress) మరింత పెరుగుతుందేగానీ తగ్గదు. అలాగే పరీక్షల్లో మంచి మార్కులు సాధింగలమో లేదోననే ప్రతికూల ఆలోచనలూ ఇబ్బంది పెట్టొచ్చు.

వీటిని అధిగమించడానికి... అసలు సమస్య ఏమిటనే దాన్ని గుర్తించి పరిష్కారం గురించి ఆలోచించాలి. దాని వల్ల కలిగే లాభనష్టాలను అంచనా వేయాలి. ఏమేం చేయొచ్చో ఆలోచించాలి. కార్యాచరణకు వీలైన ప్రణాళిక సిద్ధంచేసుకోవాలి. దాన్ని విధిగా పాటించాలి. ఆచరణలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటిని గుర్తించాలి. అవసరమైన మార్పులూ, చేర్పులను ఎప్పటికప్పుడు చేసుకోవాలి.

  • విజయ సాధనలో దృష్టికోణానికీ ఎంతో ప్రాముఖ్యముంటుంది. ప్రతికూల ఆలోచనలతో మనసు నిండిపోతే.. సన్నద్ధత సరిగా సాగదు. నిద్రలేమితోనూ ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ ఫలితాలను అందుకోలేరు. వీటివల్ల అప్పటివరకూ చేసిన ప్రయత్నాలు కూడా వృథా అవుతాయి. ఇలాంటి ఆలోచనలతో వాస్తవ పరిస్థితులు మరింత భయపెడతాయి.
  • చేయాల్సిన పనులను వాయిదా వేయడం వల్ల కూడా తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుబాటులో ఉన్న సమయాన్ని స్మార్ట్‌ఫోన్లూ, ట్యాబ్‌లలో వీడియో గేమ్‌లు ఆడటం, యూట్యూబ్‌లో వినోద కార్యక్రమాలు చూడటానికి వినియోగించడానికి వాడకూడదు. ఇలా చేస్తే చదవాల్సిన పాఠ్యాంశాలను వాయిదా వేయాల్సి వస్తుంది. అందుకే ముందుగా వాయిదా వేయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించాలి. బాగా అలసిపోవడం, వినోద కార్యక్రమాలు లేదా బద్ధకం.. వీటిలో దేనివల్ల వాయిదాలు వేస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి.
  • చదువు విషయంలో వాయిదాలు వేయడం అలవాటైతే.. వ్యక్తిగత అలవాట్లలోనూ ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఉదయాన్నే లేవడం, ఇతర విషయాల్లోనూ వాయిదా పద్ధతినే కొనసాగిస్తారు. ఈ దురలవాటు నుంచి బయటపడాలంటే చేయాల్సిన పనులతో జాబితా తయారుచేసుకోవాలి. ప్రాథమ్యాల ప్రకారం వాటిని పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. ప్రతి పనికీ నిర్ణీత సమయాన్ని కేటాయించాలి. ఈ క్రమంలో ఎన్నో అవరోధాలూ ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలి.  

మ్యాజిక్‌ చేద్దాం!

‘మ్యాజిక్‌’ (MAGIC) యాక్టివిటీలను అలవాటు చేసుకుంటే మనకు ఎదురయ్యే అవరోధాల నుంచి బయటపడొచ్చని చెపుతున్నారు నిపుణులు. ‘మ్యాజిక్‌’ అనే ఆంగ్ల పదంలో ఉన్న ఒక్కో అక్షరాన్ని చూస్తే..

ఎం- మైండ్‌ఫుల్‌ (Mindful): అంటే చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ, భావోద్వేగాలను అర్థంచేసుకుంటూ పనిచేయగలగాలి.  

ఎ- యాక్టివ్‌ (Active): నడక, వ్యాయామాలు లాంటివి అలవాటు చేసుకోవాలి. లేదా గతంలో ఇష్టమైన క్రీడనూ కొనసాగించవచ్చు. చురుగ్గా ఉండటమే ప్రధానం.

జి- జనరస్‌ (generous): ఇతరుల పట్ల ఉదారంగా వ్యవహరించడాన్ని అలవాటు చేసుకోవాలి. సహవిద్యార్థులు, స్నేహితులు, చుట్టుపక్కలవాళ్లూ... ఇలా ఎవరైనా కావొచ్చు. వాళ్లను అభిమానంగా పలకరించడం, ఫోన్‌ చేసి మాట్లాడటం లాంటివి చేయొచ్చు.

ఐ- ఇంటరెస్టెడ్‌ (interested): ఆసక్తితో ఉండటాన్ని సూచిస్తుంది. పుస్తకాలు చదువుతూ, ఏవైనా వీడియోలు చూస్తూ కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపించాలి.

సి- కనెక్టెడ్‌ (Connected): కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసిమెలిసి ఉండాలి. కొత్తవారితో మాట్లాడటానికీ చొరవ చూపించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని