మనసు తెలిసి... కలిసి మెలిసి!

ఎదుటివారితో సత్సంబంధాలు కొనసాగించాలన్నా, మర్యాదకరమైన ప్రవర్తనతో ఎదుటివారిని ఆకట్టుకోవాలన్నా భావోద్వేగ ప్రజ్ఞ ఎంతో అవసరం! దీన్ని పెంపొందించుకుంటే కెరియర్లో అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది!  ..

Published : 08 Sep 2021 12:41 IST

ఎదుటివారితో సత్సంబంధాలు కొనసాగించాలన్నా, మర్యాదకరమైన ప్రవర్తనతో ఎదుటివారిని ఆకట్టుకోవాలన్నా భావోద్వేగ ప్రజ్ఞ ఎంతో అవసరం! దీన్ని పెంపొందించుకుంటే కెరియర్లో అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది!  స్ఫూర్తి డిగ్రీ చదువుతోంది. పరిస్థితులను చక్కగా అంచనా వేస్తుంది. తన భావాలను ఎదుటివారికి అర్థమయ్యేలా వ్యక్తం చేస్తుంది. కోపావేశాలను అదుపులో ఉంచుకోవడమే కాకుండా ఎప్పుడూ సానుకూలంగా స్పందిస్తుంటుంది. సహవిద్యారులు, స్నేహితులతో చక్కని సంబంధాలను   కొనసాగిస్తుంది. స్ఫూర్తి తీరును పరిశీలిస్తే.. ఆమెకు భావోద్వేగ ప్రజ్ఞ (ఎమోషనల్‌ ఇంటలిజెన్సీ) ఉన్నట్టు అర్థమవుతుంది. కొన్ని మెలకువలు పాటిస్తే ఎవరైనా దీన్ని సొంతం చేసుకోవచ్చు.

నేరుగా చూస్తూ: ఎదుటివారితో నేరుగా చూస్తూ మాట్లాడకుండా కొంతమంది అటూఇటూ చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల అపార్థం చేసుకోవడానికే ఎక్కువగా అవకాశముంటుంది. మనుషిని చూడకుండా మాటలను మాత్రమే వినడం వల్ల భావాలను సంపూర్ణంగా అర్థం చేసుకోకపోవచ్చు. అలాకాకుండా నేరుగా చూస్తూ మాట్లాడటం వల్ల ఎదుటివారి భావోద్వేగాలు అంచనా వేసే వీలుంటుంది.

పరిశీలన: తోటి విద్యార్థులను నిశితంగా పరిశీలించడం ద్వారా ఈ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. మాటల్లో చెప్పలేని విషయాలు శరీర భాషను అర్థం చేసుకోవడం ద్వారా గ్రహించవచ్చు. ఉదాహరణకు మీ స్నేహితులు తల కిందకు పెట్టుకుని కుర్చీలో కూర్చుని ఉండొచ్చు. లేదా ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇలాంటి భంగిమలను పరిశీలించడం ద్వారానూ వారి ఆలోచనా తీరును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.

గమనించాలి: సమయం చిక్కినప్పుడు ఎదుటివారి భావోద్వేగాలను ఆసక్తిగా గమనించవచ్చు. ఒక్కోసారి మాటలు వినిపించకుండా దూరంగా కొన్ని దృశ్యాలు మాత్రమే కనిపించవచ్చు. వాటిని బట్టి వాళ్లు సంతోషంగా ఉన్నారా.. ఆందోళన పడుతున్నారా.. అనేది తెలుసుకోవచ్చు. వివిధ సంఘటనలను ఇలా ఆసక్తిగా గమనిస్తూ భావోద్వేగ ప్రజ్ఞను అలవరుచుకోవచ్చు.

స్వరస్థాయిని బట్టి: సంతోషంగా ఉన్నప్పుడు మాట్లాడే పద్ధతికీ, బాధగా ఉన్నప్పుడు మాట్లాడే విధానానికీ చాలా తేడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎదుటివారి మాటలను వినడం ద్వారా వీటిని గమనించవచ్చు. సాధారణంగా ఎదుటివారు మాటలను జాగ్రత్తగా విని సమాధానం చెబుతుంటాం కదా.. నిజానికి ఆయా మాటల ద్వారా వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికీ¨ ప్రయత్నించాలి. హావభావాలు, శరీర కదలికలు, మాట్లాడే విధానం ద్వారా వారి భావో ద్వేగాలను సులువుగా తెలుసుకోవచ్చు.

సహానుభూతిని ప్రదర్శించాలి: తోటి విద్యార్థులను ఆటపట్టించడం, విమర్శించడం కాకుండా వారి ఇబ్బందులను సహానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎదుటివారి స్థానంలో తామే ఉంటే అప్పుడు తమ ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. వివిధ అంశాల పట్ల తాము స్పందించినట్టుగానే తోటి విద్యార్థులూ స్పందిస్తారనే విషయాన్ని గుర్తుంచుకుంటే.. ఇతరుల భావోద్వేగాలు సులువుగా అర్థమవుతాయి.

ఉద్యోగులైతే..
బృంద సభ్యుల్లో ఒకరిగా ఉన్నా... వ్యక్తిగతంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నా.. ఉద్యోగులకు భావోద్వేగ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఉంటే తమ ప్రవర్తనను భావోద్వేగాలు నియంత్రించకుండా కాపాడుకోవచ్చు. వ్యక్తిగత, సామాజిక అవగాహనతో దీన్ని పెంపొందించుకోవచ్చు.

సహోద్యోగుల సాధకబాధలను అర్థం చేసుకోవడానికి సహానుభూతి కావాల్సిందే. భావోద్వేగ ప్రజ్ఞతో దీన్ని సులువుగా అలవరుచుకోవచ్చు.
సవాళ్లనూ, విమర్శలను కొత్త విషయాలను నేర్చుకోవడానికి వచ్చిన అవకాశంగా భావించాలి. విమర్శలు వినగానే కొంతమంది ఉద్యోగులు ప్రతికూలంగా స్పందిస్తూ బాధపడుతుంటారు. భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకునే సామర్థ్యమే ఉంటే.. ‘ఏ విషయం నన్ను ఎక్కువగా బాధిస్తోంది.. నేనెందుకు ప్రతికూలంగా స్పందిస్తున్నాను..’ అని వివిధ రకాలుగా ఆలోచించగలుగుతారు.
భావోద్వేగ ప్రజ్ఞతో ఉద్యోగుల మధ్య సత్సంబంధాలూ నెలకొంటాయి. నాయకులకు ఈ ప్రజ్ఞ ఉంటే.. ‘బృంద సభ్యుల అవసరాలను సరిగా గుర్తిస్తున్నానా, సమర్థంగా పనిచేసినవారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నానా...’ అని వివిధ రకాలుగా ఆలోచించి వారి అభివృద్ధికి కృషిచేయగలుగుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని