చదివిస్తారు.. కొలువిస్తారు!

రక్షణ దళాల్లో అవకాశం రావటమంటే ఉజ్వల భవితకు పునాది వేసుకున్నట్టే! టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీవారికి ఆ అవకాశాలు వచ్చాయిప్పుడు. తాజా ప్రకటనల ద్వారా ఎంపికైనవారిలో ఇంటర్‌ విద్యార్థులను ఉచితంగా చదివించి, కొలువు ఇస్తారు. పది పూర్తిచేసుకున్నవారినీ, పట్టభద్రులనూ నేరుగా ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ కోర్సులూ, పోస్టులకూ ఎంపికైనవారు చిన్న వయసులోనే మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు....

Updated : 18 Nov 2019 00:38 IST

ఆర్మీ, నేవీల్లో అద్భుత అవకాశాలు

రక్షణ దళాల్లో అవకాశం రావటమంటే ఉజ్వల భవితకు పునాది వేసుకున్నట్టే! టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీవారికి ఆ అవకాశాలు వచ్చాయిప్పుడు. తాజా ప్రకటనల ద్వారా ఎంపికైనవారిలో ఇంటర్‌ విద్యార్థులను ఉచితంగా చదివించి, కొలువు ఇస్తారు. పది పూర్తిచేసుకున్నవారినీ, పట్టభద్రులనూ నేరుగా ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ కోర్సులూ, పోస్టులకూ ఎంపికైనవారు చిన్న వయసులోనే మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

పదితో చెఫ్‌, స్టివార్డ్‌, హైజీనిస్ట్‌

ఛెఫ్‌, స్టివార్డ్‌, హైజీనిస్ట్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ నేవీ ప్రకటన విడుదలచేసింది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉంటే చాలు, దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. మొత్తం 400 పోస్టులు భర్తీ చేస్తారు.

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి. సైన్సు, మ్యాథమేటిక్స్‌ ఒక విభాగంలో; జనరల్‌ నాలెడ్జ్‌ మరో విభాగంలో అడుగుతారు. మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. అభ్యర్థులు రెండు సెక్షన్లలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. సిలబస్‌, మాదిరి ప్రశ్నపత్రం ఇండియన్‌ నేవీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిని పూర్తిచేసుకున్నవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ విజయవంతమైతే రాత పరీక్షలో చూపిన మెరిట్‌ ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు.

శిక్షణ..విధులు.. ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు 2020 నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కతోపాటు నేవీ శిక్షణ కేంద్రాల్లో వృత్తి సంబంధిత శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో ప్రతి నెల రూ.14600 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. చెెఫ్‌గా ఎంపికైనవారు విధుల్లో భాగంగా ఆహారాన్ని వండాలి. ఆహార పదార్థాల స్టోర్‌ నిర్వహణ బాధ్యతను చూసుకోవాలి. స్టివార్డ్‌గా విధులు నిర్వహించేవారు వడ్డన బాధ్యతలు తీసుకుంటారు. భోజన తయారీలోనూ వీరు పాలుపంచుకుంటారు. అలాగే వెయిటర్‌గానూ వ్యవహరించాలి. హైజీనిస్ట్‌గా ఎంపికైనవారు గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. విధుల్లో చేరిన మొదటి నెల నుంచి రూ. 21,700 మూలవేతనం చెల్లిస్తారు. ప్రతి నెలా రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ) అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులుంటాయి. వీటన్నింటితో నెలకు రూ. 35,000కు పైగా వేతనం రూపంలో లభిస్తుంది. భవిష్యత్తులో వీరు మాస్టర్‌ చీఫ్‌ పెటీ ఆఫీసర్‌ - 1 హోదా వరకు చేరుకోవచ్చు. 15 ఏళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. ఈ వ్యవధిలో వివిధ ప్రొఫెషనల్‌ కోర్సులను పూర్తిచేస్తారు. సర్వీస్‌ నుంచి వైదొలిగే సమయానికి డిగ్రీతో సమాన హోదా ఉన్న సర్టిఫికెట్‌ అందుకుంటారు. పదవీ విరమణ అనంతరం జీవితాంతం పింఛను లభిస్తుంది.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత
వయసు: అక్టోబరు 1, 2000 - సెప్టెంబరు 30, 2003 మధ్య జన్మించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: నవంబరు 23 నుంచి 28 వరకు స్వీకరిస్తారు.
www.joinindiannavy.gov.in

బీటెక్‌ తోపాటు ఉద్యోగం

ఎంపికైతే చాలు.. ఉచితంగా బీటెక్‌ చదువుకోవచ్చు. ఆ వెంటనే సబ్‌ లెఫ్టినెంట్‌ ఉద్యోగంలో చేరిపోవచ్చు. పుస్తకాలు, యూనిఫారం, వసతి, భోజనం అన్నీ పైసా చెల్లించకుండానే లభిస్తాయి. జేఎన్‌యూ, న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ పట్టా చేతికందిస్తుంది. మొదటి నెల నుంచే లక్ష రూపాయలు వేతనంగా అందుతుంది. ఈ అవకాశం భారతీయ నౌకాదళం 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీం తో లభిస్తుంది.

జేఈఈ-2019 మెయిన్‌ ర్యాంకు ద్వారా దరఖాస్తులను షార్ట్‌ లిస్టు చేస్తారు. వీరిని సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) బెంగళూరు, భోపాల్‌, కోయంబతూర్‌, విశాఖపట్నాల్లో ఏదోఒక చోట ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం 5 రోజుల పాటు ఇవి రెండు దశల్లో కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలో భాగంగా ఇంటలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పెర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు చేపడతారు. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. వీటిలోనూ నెగ్గితే వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు.

ఎంపికైతే.. ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జులై 2020 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ అప్లైడ్‌ ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌(ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌) లేదా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఎల‌్రక్టికల్‌ బ్రాంచ్‌) కోర్సుల్లోకి తీసుకుంటారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి బీటెక్‌ పట్టా అందుతుంది. అలాగే నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌ ఉద్యోగం సొంతమవుతుంది. 

విద్యార్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌ -2019లో అర్హత సాధించినవారై ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.

వయసు: జనవరి 2, 2001 - జులై 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు
దరఖాస్తులు: నవంబరు 29 నుంచి డిసెంబరు 19 వరకు నమోదు చేసుకోవచ్చు.
https://www.joinindiannavy.gov.in

ఆర్మీలో బీఎస్సీ నర్సింగ్‌

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌లోని వివిధ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులోకి ప్రకటన వెలువడింది. ఈ కోర్సుకు ఎంపికైనవారు ఉచితంగా నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చదువుకోవచ్చు. ఈ సమయంలో వసతి, భోజనం అంతా ఉచితమే. కోర్సు అనంతరం మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో లెఫ్టినెంట్‌ హోదాతో విధులు నిర్వర్తించవచ్చు.

బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి రూ.56,100 మూలవేతనం అందుతుంది. అన్నీ కలుపుకుని మొదటి నెల నుంచే రూ.లక్ష వరకు వేతనంగా పొందవచ్చు. మూడేళ్ల సర్వీస్‌తో కెప్టెన్‌ హోదా సొంతం చేసుకోవచ్చు. ఎనిమిదేళ్ల అనుభవంతో మేజర్‌ స్థాయికి చేరుకోవచ్చు.

దేశవ్యాప్తంగా 6 చోట్ల పుణె, బెంగళూరు, కోల్‌కతా, లక్‌నవూ, న్యూదిల్లీ, అశ్విని (ముంబయి)ల్లోని డిఫెన్స్‌ సంస్థల్లో బీఎస్సీ కోర్సు అందిస్తున్నారు. వీటిలో మొత్తం 220 సీట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో 90 నిమిషాల వ్యవధితో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌ ఇంగ్లిష్‌, బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో ప్రతిభ చూపినవారికి ఇంటర్వ్యూలు ఉంటాయి. పరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. పరీక్షలు ఏప్రిల్‌లో, ఇంటర్వ్యూలు మేలో నిర్వహిస్తారు.

అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌లో మొదటి ప్రయత్నంలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. ఈ కోర్సు మహిళలకు మాత్రమే.
వయసు: అక్టోబరు 1, 1995 - సెప్టెంబరు 30, 2003 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు కనీసం 152 సెం.మీ. ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 2
వెబ్‌సైట్‌: http://joinindianarmy.nic.in

నేవీలో 144 ఆఫీసర్‌ పోస్టులు

ఇండియన్‌ నేవీ ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌, టెక్నికల్‌ బ్రాంచ్‌, ఎడ్యుకేషన్‌ బ్రాంచిల్లో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. వీటిని ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్టు (ఐనెట్‌) ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు నేవీలోని వివిధ విభాగాల్లో లెవెల్‌-10 ఆఫీసర్‌ హోదాతో విధులు నిర్వర్తించవచ్చు.

పరీక్ష ఇలా: రెండు గంటల వ్యవధితో నిర్వహించే ఈ పరీక్షలో వంద మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. వీటిని ఇంగ్లిష్‌, రీజనింగ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, మ్యాథమెటికల్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాల నుంచి అడుగుతారు. ఒక్కో సెక్షన్‌ నుంచి వంద మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించినవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ఉంటాయి. అందులోనూ ప్రతిభ చూపినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. ఎంపికైనవారిని ఆయా కేంద్రాల్లో నేవల్‌ ఓరియంటేషన్‌ శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. వీరికి సబ్‌ లెఫ్టినెంట్‌ హోదా కేటాయిస్తారు. మొదటి నెల నుంచే రూ.56,100 మూలవేతనం అందుకోవచ్చు. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని రూ.లక్షకు పైగా వేతనం లభిస్తుంది. పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు ఏప్రిల్‌లో ఉంటాయి. శిక్షణ జనవరి 2021 నుంచి
మొదలవుతుంది.

అర్హత: ఆయా పోస్టును బట్టి బీటెక్‌, బీఎస్సీ, బీకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: నవంబరు 29 నుంచి డిసెంబరు 19 వరకు స్వీకరిస్తారు.
www.joinindiannavy.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని