సారం గ్రహించి..సాధన చేయాలి!

వైద్యవిద్యలో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)- 2020 ప్రకటన ఇటీవల విడుదలైంది. సీటు తెచ్చుకోవాలంటే నీట్‌ ర్యాంకు ముఖ్యం కాబట్టి దాని సన్నద్ధతపై ఇప్పటినుంచే శ్రద్ధ అవసరం. ప్రతి చాప్టర్‌కూ షార్ట్‌ నోట్సు, చాప్టర్‌ చదవగానే ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల సాధన, పునశ్చరణ లాంటి మెలకువలు పాటిస్తేనే మెరుగైన ర్యాంకుకు పునాది పడుతుంది.ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు తయారవుతూనే ఈ ప్రవేశపరీక్షకూ సమర్థంగా సిద్ధం కావాల్సివుంటుంది. నీట్‌ ప్రిపరేషన్‌కు ఏయే మెలకువలు  పాటించాలో నిపుణుల సూచనలివిగో!  

Published : 16 Dec 2019 01:27 IST

నీట్‌-2020

వైద్యవిద్యలో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)- 2020 ప్రకటన ఇటీవల విడుదలైంది. సీటు తెచ్చుకోవాలంటే నీట్‌ ర్యాంకు ముఖ్యం కాబట్టి దాని సన్నద్ధతపై ఇప్పటినుంచే శ్రద్ధ అవసరం. ప్రతి చాప్టర్‌కూ షార్ట్‌ నోట్సు, చాప్టర్‌ చదవగానే ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల సాధన, పునశ్చరణ లాంటి మెలకువలు పాటిస్తేనే మెరుగైన ర్యాంకుకు పునాది పడుతుంది.ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు తయారవుతూనే ఈ ప్రవేశపరీక్షకూ సమర్థంగా సిద్ధం కావాల్సివుంటుంది. నీట్‌ ప్రిపరేషన్‌కు ఏయే మెలకువలు  పాటించాలో నిపుణుల సూచనలివిగో!  
దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో, కేంద్రీయ వైద్య విద్యాసంస్థల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ‘నీట్‌’ను నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం వరకూ ఎయిమ్స్‌, జిప్‌మర్‌ వంటి సంస్థల్లో ప్రవేశానికి ఆయా సంస్థలు వేటికవే ప్రత్యేక పరీక్షలను నిర్వహించేవి. కానీ కేంద్రప్రభుత్వ నిర్ణయం కారణంగా ఈ ఏడాది నీట్‌ ర్యాంకు ద్వారా మాత్రమే అభ్యర్థులు ప్రవేశార్హత పొందుతారు. దేశంలోని విభిన్న కళాశాలల్లో వైద్య, దంత వైద్య, యునానీ, ఆయుర్వేద, సిద్ధ, హోమియోపతి కోర్సుల్లో సీటు పొందాలంటే నీట్‌లో ర్యాంకు మాత్రమే ప్రామాణికం కానుంది. విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలనుకునే వారూ నీట్‌ ద్వారా అర్హత సాధించడం తప్పనిసరి!
దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపాలి. తప్పుగా నింపినా, పొరపాటు జరిగినా దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అభ్యర్థి సంతకం దరఖాస్తు నుంచి ప్రవేశం పొందేవరకూ ఒకే రకంగా ఉంటే మంచిది. దరఖాస్తులో అవసరమైన వివరాలను నింపేటప్పుడు తగిన కోడ్‌ ఉపయోగించాలి. చరవాణి సంఖ్య, మెయిల్‌ ఐడీ సరైనవైవుండాలి. ఫీజు కూడా ఆన్‌లైన్‌ద్వారా చెల్లించాలి. వివరాలకు
www.nta.ac.in/www.ntaneet.nic.in లను చూడవచ్చు.
ప్రశ్నపత్రం తీరు
బయాలజీ (బోటనీ, జువాలజీ), ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి మొత్తం 180 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీల నుంచి 45 చొప్పున ప్రశ్నలుంటాయి. బోటనీ, జువాలజీల నుంచి విడివిడిగా కచ్చితంగా 45 ప్రశ్నలు ఇవ్వకపోవచ్చు. గతంలోనూ సమాన విభజనతో ఇవ్వలేదు.
ప్రతి తప్పు సమాధానానికీ -1 మార్కు కోత ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని దాదాపు 11 భాషల్లో ఇవ్వబోతున్నారు. ఇంగ్లిష్‌ మీడియం వారు మినహా మిగిలినవారు ఆంగ్లంతోపాటు స్థానిక భాషలోనూ ప్రశ్నపత్రాన్ని ఉపయోగించుకోవచ్చు.

బయటి మెటీరియల్‌, గైడ్లు వద్దు
ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ప్రకటించిన సిలబస్‌ పరిధిలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవడం మంచిది. వాటితోపాటు తెలుగు అకాడమీ ప్రచురించిన ఇంటర్మీడియట్‌ పుస్తకాలనూ చదివితే చాలా మంచిది. ఎయిమ్స్‌, జిప్‌మర్‌ గత సంవత్సరాల ప్రశ్నపత్రాలనూ సాధన చేయాలి.
నీట్‌ గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ఒకటి లేదా రెండు ప్రశ్నల్ని సిలబస్‌ పరిధి దాటి అడిగినట్లు అర్థమవుతుంది. కానీ దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు సిలబస్‌ పరిధి దాటి అదనపు విషయాలను మరీ ఎక్కువగా అధ్యయనం చెయ్యడమూ అంత ఉపయోగకరం కాదు. నీట్‌ సిలబస్‌ పరిధిలోనే దానికి దగ్గర్లో ఉన్న కాన్సెప్టులు, సమాచారాన్ని తెలుసుకొని ఉంటే మంచిదే. మార్కెట్‌లో లభ్యమవుతున్న మెటీరియల్‌, గైడ్ల కన్నా ఎన్‌సీఈఆర్‌టీ, అకాడమీ పుస్తకాలపై పూర్తి అవగాహన పెంచుకుంటే మంచిది.


బయాలజీ

నీట్‌ ప్రశ్నపత్రంలో సగం మార్కులు ఈ విభాగం నుంచే ఉంటాయి. * పరీక్షలో మొదట ఆరంభించాల్సిన సబ్జెక్టు నిస్సందేహంగా బయాలజీనే. * ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలావరకు నేరుగా సమాధానాన్ని గుర్తించడానికి వీలుగా ఉండేవే. కాబట్టి ప్రాథమిక భావనలపై పూర్తి అవగాహన ఉంటే చాలా మంచిది. * ఎన్‌సీఈఆర్‌టీ, తెలుగు అకాడమీ పుస్తకాలను పూర్తిగా చదివితే బయాలజిలో 360 మార్కులకు 330 నుంచి 340 వరకు తెచ్చుకోవడం తేలికే.* బయాలజీలో ముఖ్యంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అధ్యాయాలు- ఫిజియాలజీ ఆఫ్‌ ప్లాంట్స్‌ అండ్‌ యానిమల్స్‌, మార్ఫాలజీ, జెనెటిక్స్‌, సెల్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, డైవర్సిటీ ఆఫ్‌ లివింగ్‌ ఆర్గానిజమ్‌, ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌. * బొమ్మలను ఆధారంగా చేసుకుని 4 లేదా 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని బొమ్మలనూ, చిత్రాలనూ అభ్యర్థులు గుర్తుంచుకోవడం కాకుండా స్వయంగా గీసుకుని వాటిలో విడిభాగాలను గుర్తిస్తూ అభ్యాసం చేయడం మంచిది. * బోటనీలో మొక్కల వర్గీకరణ అధ్యాయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. సిలబస్‌పరంగా ఈ విభాగంలో కొంత సందిగ్ధతకు అవకాశం ఉంది. కనుక తగినంత సరైన సమాచారాన్ని తెలుసుకొని ఉండటం మంచిది. ఇందుకోసం  అధ్యాపకుల సహకారాన్ని తీసుకోవాలి. * మొక్కలకు సంబంధించిన అనేక అంశాలను మార్ఫాలజీ అధ్యాయంలో చూడవచ్చు. కానీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలలో కొన్నిచోట్ల తగిన వివరణ లేదు. మార్ఫాలజీ చదివిన తర్వాత రీప్రొడక్షన్‌ ఇన్‌ ఆంజియోస్పర్మ్‌స్‌ అండ్‌ ప్లాంట్స్‌ చదివితే చాలా ఉపయోగకరం. * సెల్‌ బయాలజీ సిలబస్‌ విషయంలో బోటనీ, జువాలజీల్లో స్వల్ప అంతరాలున్నా ఇబ్బంది లేదు. ఈ అధ్యాయాన్ని జెనెటిక్స్‌ చదవడం ఉపయోగకరం. ఆపై ప్లాంట్‌ ఫిజియాలజీ చదవడం మంచిది. ఇందులో వాటర్‌ రిలేషన్స్‌, మినరల్‌ న్యూట్రిషన్స్‌తోపాటు ఎంజైమ్‌ సంబంధిత అంశాల్లో పరిజ్ఞాన పరంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

*బయోటెక్నాలజీ, అప్లైడ్‌ బయాలజీల్లో టిష్యూ కల్చర్‌, జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ అంశాలను గుర్తుంచుకోవాలి.* హ్యూమన్‌ ఫిజియాలజీ అత్యంత కీలకమైన అధ్యాయం. దీని నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకూ అడగవచ్చు. నీ యానిమల్‌ కింగ్‌డమ్‌ అధ్యాయం నుంచి ప్రతి విభాగానికి సంబంధించిన విశిష్ట, ప్రత్యేక లక్షణాలను జాగ్రత్తగా చదవాలి.
*ఎకాలజి అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అధ్యాయం నుంచి బయోడైవర్సిటీ, పొల్యూషన్‌, ఓజోన్‌ డిప్లిషన్‌ ప్రశ్నల్ని అడగే వీలుంది.

*సన్నద్ధత సమయంలోనే ముఖ్యమైన అంశాలను, పేర్లను పుస్తకంలోనే అండర్‌లైన్‌ చేసి ఉంచుకోవాలి. దీనివల్ల రెండోసారి చదివేటప్పుడు సమయం ఆదా అవుతుంది.


ఫిజిక్స్‌

సాధారణంగా బయాలజీ విద్యార్థులు ఫిజిక్స్‌ని కష్టమైన సబ్జెక్టుగా భావిస్తారు.ఈ అపోహను తొలగించుకుని విద్యార్థులు కంగారు పడకుండా సన్నద్ధం కావాలి.* గత ప్రశ్నపత్రాల తీరును గమనిస్తే అటామిక్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌, సెమీ కండక్టర్స్‌, కమ్యూనికేషన్స్‌ విభాగాలకు ప్రాధాన్యం ఎక్కువ*గ్రావిటేషన్‌, ఎలక్ట్రోస్టాటిక్స్‌, మాగ్నటిజం వంటి అధ్యాయాల్లోని విభిన్న అంశాలు, ఫార్ములాలు సారూప్యతతో ఉంటాయి. ఈ 3 అధ్యాయాలను విడివిడిగా చదివినా, వాటిలో సారూప్యతలున్న విషయాలను గమనిస్తే ప్రిపరేషన్‌ సమయం ఆదా అవుతుంది.* కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రో మాగ్నటిజం లాంటి అధ్యాయాల్లో వలయాల ఆధారిత లెక్కలు జాగ్రత్తగా ప్రాక్టీస్‌ చేయాలి. కెపాసిటర్స్‌,  రెసిస్టెన్స్‌ వలయాల్లో సంతులిత వీట్‌స్టన్‌ బ్రిడ్జి ఉందేమో గమనించాలి.*మొత్తంగా గమనిస్తే మెకానిక్స్‌, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్‌, ఆప్టిక్స్‌, ఎలక్ట్రిసిటీ, మోడర్న్‌ ఫిజిక్స్‌ ముఖ్యమైన విభాగాలు. మెకానిక్స్‌ సంబంధిత లెక్కలు సాధన చేసేటప్పుడు కన్సర్వేషన్‌ ఆఫ్‌ మొమెంటమ్‌, ఎనర్జీలతోపాటు టార్క్‌, మొమెంట్‌ ఆఫ్‌ ఇనర్షియా ఫార్ములాలకు ప్రాధాన్యమివ్వాలి.*బయాలజీ, కెమిస్ట్రీల మాదిరిగానే ఫిజిక్స్‌కూ ఎక్కువ సమయం కేటాయిస్తూ ఎక్కువ సార్లు చదవడం వలన ఉపయోగం ఉండదు. అన్నిసార్లు చదవడానికి బదులు సాధనకు ప్రాధాన్యమిస్తేనే రాణించగలుగుతారు.
 


కెమిస్ట్రీ

ఫిజికల్‌ కెమిస్ట్రీలో ప్రాథమిక భావనలను దృష్టిలో ఉంచుకుని లెక్కలు ఇచ్చే అవకాశం ఎక్కువ. తగిన ఫార్ములాలు ఉపయోగిస్తూ ప్రాక్టీస్‌ చేయాలి. ముఖ్యంగా సొల్యూషన్స్‌, కెమికల్‌ ఈక్విలిబ్రియం, కైనెటిక్స్‌, స్టేట్స్‌ ఆఫ్‌ మేటర్‌, థర్మోడైనమిక్స్‌ వంటి అధ్యాయాలపై ప్రధానంగా దృష్టి ఉంచాలి. నీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ముఖ్యమైన అంశాలు- నేమ్‌డ్‌ రియాక్షన్స్‌, ఐసోమెరిజం, రియాక్షన్‌ మెకానిజమ్స్‌. వీటితోపాటు మిగిలిన అంశాలనూ విస్మరించొద్దు. నీ ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ నుంచి థియరీ ప్రశ్నలు అడిగే అవకాశం అధికం. ముఖ్యంగా విభిన్న గ్రూపులకు సంబంధించిన వివరాన్నింటినీ నోట్సులా రాసుకుని చదువుకోవాలి. వీలైతే ఆ వివరాలను పట్టికల రూపంలో పొందుపర్చాలి. విభిన్న ధర్మాలను, లక్షణాలను వీలైనన్నిసార్లు పునశ్చరణ చేసుకోవాలి. నీ భౌతిక, రసాయనిక ధర్మాలు, తయారీ విధానాలను గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు- అన్ని గ్రూపులకు సంబంధించిన హాలైడులు, ఆక్సైడులు, కార్బొనేట్ల గురించి అధ్యయనం చేయాలి. నీ కెమిస్ట్రీ ఇన్‌ ఎవరిడే లైఫ్‌, బయో మాలిక్యూల్స్‌, పాలిమర్స్‌, సర్ఫేస్‌ కెమిస్ట్రీ వంటి అధ్యాయాలకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఇచ్చిన సమాచారం సరిపోతుంది. నీ కెమిస్ట్రీలో ఇచ్చే 45 ప్రశ్నలన్నీ పాఠ్యపుస్తకాల నుంచే ఇవ్వకపోవచ్చు. రెండు, మూడు ప్రశ్నలు ప్రయోగాలకు సంబంధించినవీ ఉండవచ్చు. ప్రయోగ దీపికలనూ చదవాలి. నీ కెమిస్ట్రీలో 90% ప్రశ్నల్ని సులభతరంగానే అడిగే అవకాశాలున్నాయి. అంటే రెండు, మూడు ప్రశ్నలు మాత్రమే కొంచెం కష్టంగా ఉండవచ్చు.
 


ముఖ్య తేదీలు
నీట్‌ పరీక్ష తేదీ: 2020 మే 3.
దరఖాస్తులకు
చివరితేదీ: 2019 డిసెంబరు 31
దరఖాస్తుల్లో తప్పుల
సవరణ: 2020 జనవరి 15 నుంచి 31 వరకు.


ముఖ్యమైన మెలకువలు
1. సిలబస్‌ పట్ల పూర్తి అవగాహనతో ప్రతి సబ్జెక్టులోని వివిధ అధ్యాయాల్లోని విభిన్న అంశాలను గమనించి చదవాలి.
2. ఏ సబ్జెక్టులోనైనా చాప్టర్‌ చదవడం పూర్తయిన వెంటనే దానిలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల్ని సాధన చెయ్యాలి.
దానిలో ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించలేకపోయామో గుర్తించి వాటిని నోట్‌ చేసుకోవాలి.
సన్నద్ధత సమయంలో, తుదిపరీక్షలోనూ లాటరీ పద్ధతిలో, ఊహించి సమాధానాలను గుర్తించడం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
ప్రతి సబ్జెక్టులో అవకాశాన్ని బట్టి పట్టికలు, బొమ్మలు, షార్ట్‌కట్‌ పద్ధతులను ఉపయోగిస్తూ ముఖ్యమైన ఫార్ములాలు, సమాచారాన్ని వీలైనన్నిసార్లు పునశ్చరణ చేసుకోవాలి.
సమయపాలన కీలకం.మూడు సబ్జెక్టులను ప్రణాళికతో పూర్తి చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్టులో క్లిష్టతరమైన అధ్యాయాన్ని చదివితే మరో సబ్జెక్టులో కొంచెం తేలిక అధ్యాయం ఎంచుకుంటే మేలు.
3 .ప్రతి సబ్జెక్ట్టులో బలహీనంగా ఉన్న అంశాలూ, విభాగాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
సబ్జెక్టును చదువుతున్నప్పుడే దానిలో ప్రతి చాప్టర్‌కూ షార్ట్‌ నోట్సు తయారు చేసుకొని, దాన్ని పునశ్చరణకు ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే సమయం ఆదా అవుతుంది. ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.4  1

కొండముది రవీంద్రకుమార్‌


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని