ఉద్యోగానికి 5 మెట్లు!

ఉద్యోగం వెతుక్కోవడం అంత సులభమైన పనేం కాదు. కొందరికి క్యాంపస్‌లలోనే వచ్చేస్తాయి కానీ... చాలా మంది తమ సొంత ప్రయత్నంపైనే ఆధారపడాల్సి వస్తుంది.

Updated : 30 May 2023 06:45 IST

ఉద్యోగం వెతుక్కోవడం అంత సులభమైన పనేం కాదు. కొందరికి క్యాంపస్‌లలోనే వచ్చేస్తాయి కానీ... చాలా మంది తమ సొంత ప్రయత్నంపైనే ఆధారపడాల్సి వస్తుంది.

ఇలా వెతుక్కునే క్రమంలో ఎన్నో ఒడుదొడుకులు, మరెన్నో ఇబ్బందులు, అనుభవలేమితో తెలిసీ తెలియక చేసే తప్పులు.  అయితే ఇవన్నీ లేకుండా సులభంగా ఉద్యోగ ప్రయత్న దశను దాటగలిగితే..?   తెలివిగా ప్రణాళిక వేసుకునేలా ఎవరైనా గైడ్‌ చేస్తే...!

ఆ సూచనలు మీకూ కావాలా.. ఆలస్యం ఎందుకు చదివేయండి!

కొత్త డాక్టర్‌ కంటే పాత పేషెంట్‌ నయమంటారు. ఎందుకంటే అనుభవం మీద ఇచ్చే సూచనలు బాగా పనిచేస్తాయి కాబట్టి. ఇలాగే తన ఉద్యోగ ప్రయత్న అనుభవాలను గుదిగుచ్చి తన లాంటి వారి కోసం చక్కని సూచనలు ఇస్తోంది లక్నోకు చెందిన దీక్షా పాండే అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. తను పాటించిన విధానాలతో మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఇన్ఫోసిస్‌... వంటి ఎన్నో దిగ్గజ కంపెనీల్లో ఇంటర్వ్యూలు ఎదుర్కొనే అవకాశం దక్కించుకుంది. అంతేకాదు... గూగుల్‌లో తన డ్రీమ్‌ జాబ్‌ సాధించింది! ఆ వివరాలు నలుగురికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో తన లింక్డిన్‌ ప్రొఫైల్‌ పోస్టులో పంచుకుంది. ఇందులో చాలా విలువైన విషయాలు ఉండటంతో ఈ పోస్టు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అందులో ఉన్న వివరాలేంటో పరిశీలిస్తే...


1. దీక్ష మొట్టమొదట చేసిన పని... దాదాపు 100కు పైగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల కెరియర్‌ పేజెస్‌ను సబ్‌స్రైబ్‌ చేయడం. తనకు ఆసక్తి ఉన్న సంస్థల గురించి ఆన్‌లైన్‌లో వెతకడం, వాటి అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించడం, ప్రతిచోటా కెరియర్‌ పేజెస్‌ను సబ్‌స్క్రైబ్‌ చేయడం ద్వారా... వాటిల్లో ఏవైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే దీక్షకు మెయిల్‌లో సమాచారం వచ్చేది. అవి తన ప్రొఫైల్‌కు సరిపోయేవైతే తను కూడా తక్షణం దరఖాస్తు చేసేది. నిజానికి ప్రతిసారీ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూస్తూ వెతుక్కోవడం కష్టం. అందులో మంచి అవకాశాలు, నమ్మదగినవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇలా సంస్థల నుంచి నేరుగా సమాచారం వచ్చేలా చేసుకోవడం వల్ల అవకాశాలు తమంతట తామే వచ్చేవి. అలా వందలకొద్దీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అవకాశం దక్కింది.


2. రెండో దశలో వివిధ సంస్థలు నిర్వహించే హైరింగ్‌ కంటెస్ట్‌లలో పాల్గొంది. హ్యాకర్‌ ఎర్త్‌, డీ2సీ వంటి కంపెలు తరచూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఇటువంటివే హ్యాకథాన్స్‌, షార్ట్‌ టర్మ్‌ కోడింగ్‌ ఈవెంట్స్‌ వంటివి కూడా జరిగినప్పుడు కచ్చితంగా పాల్గొనేలా జాగ్రత్తపడింది. దీనివల్ల ఏ కంపెనీలు ఈవెంట్లు నిర్వహిస్తున్నాయో వాటి నుంచి అనంతరం నేరుగా ఇంటర్వ్యూ కాల్స్‌ వచ్చేవి.


3. దీక్ష.. మైక్రోసాఫ్ట్‌ సంస్థ నిర్వహించిన ‘ఫిక్సథాన్‌’ కార్యక్రమంలో పాల్గొని ఆ కంపెనీ ఇంటర్వ్యూ కాల్‌ సాధించింది. ఇలాగే ఇతర కంపెనీల హెచ్‌ఆర్‌ విభాగాలకు కూడా కాంటాక్ట్‌లోకి వెళ్లగలింది. ఇటువంటి కార్యక్రమాల వల్ల పరిచయాలు పెరగడం మాత్రమే కాదు... ఇతరులతో పోటీ పడటంతో మనమే స్థాయిలో ఉన్నామో, ఇంకా ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చో తెలుస్తుంది. ప్రస్తుత కాలంలో జాబ్‌ మార్కెట్‌లో కాంటాక్ట్స్‌ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా!


4. ఏ ఇంటర్వ్యూకు రెజ్యూమె పంపినా సరే.. కచ్చితంగా ఆ జాబ్‌ ప్రొఫైల్‌కు తగినట్టుగా మార్పులు, చేర్పులు చేసేది. తన రెజ్యూమెలో ఆ ఉద్యోగానికి బాగా నప్పుతాయి అనుకునే అంశాలను హైలైట్‌ చేయడం, కీవర్డ్స్‌ అదనంగా జోడించడం, వ్యతిరేకంగా ఉన్నాయనుకునే అంశాలను కుదిరితే పరిహరించడం, లేదంటే వాటిని తక్కువ ప్రాధాన్యంతో చూపించడం... ఇలా ప్రతి దరఖాస్తుకూ చేసేది. చాలా మంది అభ్యర్థులు ఒక్కటే రెజ్యూమెను పెట్టుకుని అన్నింటికీ దాన్నే పంపుతూ ఉంటారు. ఆరునెలలకో, ఏడాదికో గానీ అప్‌డేట్‌ కూడా చేయరు. అలా కాకుండా దాన్ని నిరంతరం తాజాగా ఉంచేందుకు ప్రయత్నించడం మెచ్చిన ఉద్యోగాన్ని పొందే చక్కని ప్రయత్నం.


5. చివరగా పాటించాల్సిన నియమం.. అందులోనూ ముఖ్యమైనది.. రిజెక్షన్‌ను తట్టుకోవడం. దీక్ష ఇన్ని కంపెనీలకు దరఖాస్తులు పంపేటప్పుడు చాలా సంస్థలు అసలు సమాధానం ఇచ్చేవే కావట. కొన్ని ఇచ్చినా సారీ చెప్పేసేవట. అలా వైఫల్యాలు ఎదురైనా కుంగిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో పదునైన ప్రయత్నాలు చేస్తే.. ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయంటోందీ అమ్మాయి.

చూశారుగా.. మరి మీరు కూడా ఈ సూచనలు పాటించి నచ్చిన జాబ్‌ కొట్టేయండి!

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని