నాసాలో కొలువు కొట్టాడు!

అంతరిక్ష పరిశోధనలంటే అందరికీ సాధ్యం కాదు అనుకుంటారు.. కానీ స్థిరమైన లక్ష్యంతో ముందుకెళ్తే అత్యుత్తమ పరిశోధన సంస్థల్లోనూ అడుగుపెట్టవచ్చని నిరూపించాడీ కడప కుర్రాడు.

Published : 07 Aug 2023 00:24 IST

నాసాలో జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌ (జేపీఎల్‌)లో ‘స్టార్‌ షేడ్‌’ అనే ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. వివిధ నక్షత్రాలను పరిశీలించినప్పుడు వాటి కాంతి వల్ల అవి భూమ్మీద ఉన్న మన కంటికి నేరుగా కనిపించవు. అలాకాకుండా అవి కనిపించేలా చేసేందుకు శాటిలైట్స్‌ను అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టు ఇది. దీని ద్వారా విశ్వంలో మనకు తెలియని ఎన్నో విషయాలను కొత్తగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది


అంతరిక్ష పరిశోధనలంటే అందరికీ సాధ్యం కాదు అనుకుంటారు.. కానీ స్థిరమైన లక్ష్యంతో ముందుకెళ్తే అత్యుత్తమ పరిశోధన సంస్థల్లోనూ అడుగుపెట్టవచ్చని నిరూపించాడీ కడప కుర్రాడు. ఏకంగా అమెరికాలోని నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా)లో ఉద్యోగం సంపాదించాడు నర్రావుల హర్షవర్థన్‌రెడ్డి. మరి ఇదెలా సాధించాడో తన మాటల్లోనే..

మా నాన్న కడపలో చిన్న చిన్న ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు. అమ్మ కూడా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని. పదోతరగతి వరకూ అక్కడే చదువుకున్నాను. చిన్నప్పుడు అంతగా మంచి మార్కులు వచ్చేవి కాదు. కానీ హైస్కూల్‌కు వెళ్లాక ఒక పరీక్షలో చాలా బాగా మార్కులొచ్చాయి. అప్పుడు భలే సంతోషం కలిగింది. మంచి స్కోర్లు సాధిస్తే ఆ కిక్‌ ఎలా ఉంటుందో అప్పుడే తెలిసింది. ఇక అప్పటి నుంచి ఎప్పుడూ బాగా చదివేవాడిని. పదిలో 558 మార్కులు వచ్చాయి. ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. అమ్మ మరీ సంబరపడింది. తనకెప్పుడూ నేనూ, తమ్ముడూ పెద్దస్థాయిలో ఉండాలని కోరిక. అదే పట్టుదల నాలోనూ నింపింది. అప్పటివరకూ ఎప్పుడూ మా జిల్లా దాటకపోయినా ఐఐటీ ఎంట్రన్స్‌ కోచింగ్‌ హైదరాబాద్‌లో బాగుంటుందనే ఉద్దేశంతో ఇంటర్‌ కోసం అక్కడికి పంపించారు.

మార్కులే ధైర్యమిచ్చాయి

ఇంటర్మీడియట్‌ అమీన్‌పూర్‌ శ్రీచైతన్యలో చేరాను. జాయిన్‌ అయితే అయ్యాను కానీ చాలా బెంగగా ఉండేది. ఎప్పుడూ అమ్మానాన్నలకు అంత దూరంగా ఉండింది లేదు. అక్కడి పిల్లలంతా పెద్దపెద్ద స్కూళ్ల నుంచి చదువుకుని, మంచి బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చినవారు ఉండేవారు. వాళ్లలో కలవడానికి ఇబ్బంది పడేవాడిని. కానీ మళ్లీ నాకు వచ్చిన మార్కులే నాకు ధైర్యాన్నిచ్చేవి. అలా అక్కడ బాగా కుదురుకున్నా. ఇంటర్‌లో 967 మార్కులు వచ్చాయి. బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఐఐటీ గౌహతిలో చేరాను. అక్కడ కూడా అస్సలు తెలియని ప్రదేశం కావడం, భాష రాకపోవడంతో కొత్తలో కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ తర్వాత సర్దుకుని పూర్తిగా చదువుకోవడం మీద ఏకాగ్రత పెట్టాను. అక్కడ ఉన్నప్పుడే రిసెర్చ్‌ మీద ఆసక్తి కలిగింది. ప్రొఫెసర్లతో కలిసి వివిధ అంశాలపై పరిశోధన చేసేవాడిని. రెండేళ్లపాటు అక్కడే రిసెర్చ్‌ చేస్తూ ఉండిపోయా.
ఆ తర్వాత ఎంఐటీఏసీఎస్‌ (మైటాక్స్‌) అనే ప్రోగ్రామ్‌ ద్వారా మూడు నెలల సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ కోసం కెనడా వెళ్లే అవకాశం వచ్చింది. ఆ సమయంలో పీహెచ్‌డీ చేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఇంటర్న్‌షిప్‌ తర్వాత ఇండియా వచ్చి గుజరాత్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగంలో చేరా. అక్కడ నుంచే వివిధ యూనివర్సిటీలకు పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసేవాడిని. దాని తర్వాత ఐఐటీ హైదరాబాద్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోగా మరో ఏడాది పనిచేశాను. అక్కడి ప్రొఫెసర్లతో కలిసి కొన్ని రిసెర్చ్‌ పేపర్లు రాశాను. అప్పటికే నేను దరఖాస్తు చేసిన చాలా యూనివర్సిటీల నుంచి పీహెచ్‌డీ అడ్మిషన్‌ దొరికింది. వాటిలో నేను కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చేరాను. 2017 నుంచి అమెరికాలోనే ఉన్నా.

నాలుగ్గంటల ముఖాముఖీ

పీహెచ్‌డీ అవుతున్నప్పుడు అక్కడి ల్యాబ్స్‌లో పరిశోధనలు చేస్తూ ఉండేవాడిని. ఆ ల్యాబ్స్‌కి కావాల్సిన ఫండింగ్‌ అంతా ‘నాసా’ ఇచ్చేది. అలా అక్కడ పరిచయాలు ఏర్పడ్డాయి. నాసాలో ఇంజినీర్లు కావాలని ప్రకటన వెలువడినప్పుడు వారి ద్వారానే దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూలో ముందుగా మన సబ్జెక్టు, దాని వివరాలపై అరగంటపాటు ప్రెజెంటేషన్‌ ఇవ్వాలి. తర్వాత ఒకొక్క ఇంటర్వ్యూయర్‌తో గంటపాటు మొత్తం నాలుగు గంటలు ముఖాముఖీ సాగింది. రకరకాలుగా ప్రశ్నించారు. తర్వాత రెండునెలల్లో ఆఫర్‌ లెటర్‌ వచ్చింది. మూడు వారాల క్రితం ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతానికి ఏడాదికి లక్ష డాలర్ల ప్యాకేజీ నాది.

పరిశోధన వైపు రావాలి..

స్పేస్‌ రిసెర్చ్‌ అంటే అచ్చంగా అంతరిక్షం గురించే అనుకుంటారు. కానీ ఏ సంస్థకైనా అన్ని రకాలైన ఇంజినీర్లు కావాలి. మెకానికల్‌, ఐటీ.. ఇలా అన్ని విభాగాల ఇంజినీర్లు అవసరమవుతారు. ఏ విద్యార్థి అయినా ఏ స్థాయిలో ఆ స్థాయికి తగినట్టు కష్టపడాలి. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ మారిపోతోంది, కొత్త అవకాశాలు వస్తున్నాయి. వీటి గురించి అవగాహన పెంచుకోవాలి. విద్యార్థులు పరిశోధన వైపు రావాలి. ఇవి వ్యక్తిగతంగా కెరియర్‌కే కాదు, దేశానికీ మేలు చేస్తాయి. అభివృద్ధి బాటలో నడిపిస్తాయి.
ముఖ్యంగా గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా కెరియర్‌ను ప్లాన్‌ చేసుకోవాలి. చిన్నచిన్న ఉద్యోగాలతో సంతృప్తి చెందకూడదు. ఇప్పుడు దాదాపు అందరి దగ్గరా ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులో ఉంటోంది. దాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. చదువుకునే సమయంలో కొన్ని చోట్ల ఇబ్బందులు, ఎదురుదెబ్బలు తప్పవు. కానీ ఏకాగ్రత కోల్పోకుండా స్థిరంగా ఉండాలి. మన సమర్థతను రుజువు చేయడానికి వ్యవస్థ నిర్ణయించింది మార్కులనే. అందుకే వాటి విషయంలో రాజీ పడకూడదు. శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలి. వీలైనంతగా గేమ్స్‌, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో
పాలుపంచు కోవాలి.


సైన్స్‌ ప్రోగ్రామ్స్‌ గురించి తెలుసుకోవాలనుకునే విద్యార్థులు గూగుల్‌లో నా పూర్తి పేరు టైప్‌ చేస్తే నా లింక్డిన్‌ ప్రొఫైల్‌ వస్తుంది. కావాలంటే నన్ను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని