ఒత్తిడికి చెక్‌ పెట్టేద్దాం!

ఉదయం లేచింది మొదలు విద్యార్థులకు ఎన్ని పనులో చెప్పలేం. కాలేజీకి వెళ్లాలి. క్లాసులకు హాజరై.. పాఠాలను శ్రద్ధగా వినాలి.  అవసరమైతే ట్యూషన్లకు వెళ్లాలి.

Updated : 30 Aug 2023 02:22 IST

ఉదయం లేచింది మొదలు విద్యార్థులకు ఎన్ని పనులో చెప్పలేం. కాలేజీకి వెళ్లాలి. క్లాసులకు హాజరై.. పాఠాలను శ్రద్ధగా వినాలి.  అవసరమైతే ట్యూషన్లకు వెళ్లాలి. ఆ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవడానికి కూడా     కుదరదు. రాయాల్సిన.. చదవాల్సిన.. పాఠాలెన్నో సిద్ధంగా ఉంటాయి. ఇలా క్షణం  తీరికలేని పనులతో సతమతమవుతూ ఒత్తిడికి గురయ్యేవారిలో మీరూ ఉన్నారా?

చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు సక్రమంగా చేస్తూవుండాలి. ‘తర్వాత చేయొచ్చులే’ అనుకుంటూ వాయిదా వేస్తూపోతే అవి కొంతకాలానికి పెనుభారంగా తయారై ఒత్తిడిని పెంచుతాయి.  

  • ఒత్తిడి కొంతవరకూ ఫర్వాలేదుగానీ.. మితిమీరితే మాత్రం అనారోగ్య సమస్యలెన్నో చుట్టుముడతాయి. కంటి నిండా నిద్ర ఉండదు. సమయానికి ఏమీ తినాలనిపించదు. తలనొప్పీ, చిరాకు బాధిస్తాయి. అంతేకాదు- దీనివల్ల సహ విద్యార్థులు, స్నేహితులు, కుటుంబసభ్యులతో సంబంధాలూ దెబ్బతింటాయి.
  • బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు స్నేహితులు సరదాకు ఏమైనా అన్నా.. వెంటనే అపార్థం చేసుకుని ప్రతికూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఈ కారణంతో ఆ తర్వాత గొడవలూ జరిగే ప్రమాదం ఉంటుంది.
  • పదేపదే ఆలోచనలు

  • ఒకచోట కూర్చుని.. చేయాల్సిన పనుల గురించి పదేపదే ఆలోచించడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. దీనికి బదులుగా ఆరుబయట నిదానంగా నడుస్తూ ఆలోచించడం వల్ల ఒత్తిడి కాస్త తగ్గుతుంది.
  • చేయాల్సిన పనులు చాలా ఉండటం వల్ల.. అవి పూర్తిచేయగలమో లేదోననే అనుమానంతో చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. నిజానికి అన్ని పనులనూ ఒకేసారి చేయలేరు కదా. కాబట్టి ‘అత్యవసరంగా చేయాల్సినవి’, ‘తర్వాత చేయదగినవి’, ‘ఇతరులకు అప్పగించగలిగినవి’ అంటూ విభజించుకోవాలి. ఇలా ప్రాథమ్యాలను గుర్తించి, వాటిని పరిష్కరించటం మొదలుపెడితే సాఫీగా పనులన్నీ పూర్తిచేయగలుగుతారు.
  •  ఒకే సమస్య గురించి పదేపదే ఆలోచించడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. అలాకాకుండా పరిష్కార మార్గాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి.
  • ప్లాన్‌-బి ఉందా?

  • గిరిగీసుకుని ఒక పరిధికి లోబడి మాత్రమే ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని దాటి బయటకు వచ్చి విస్తృతంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. ఉదాహరణకు మీ దగ్గర ప్లాన్‌-ఎ మాత్రమే ఉంటే కాస్త ఆందోళనగా ఉంటుంది. ప్లాన్‌-ఎ విఫలమైతే ఏంచేయాలని ఒకసారి ఆలోచించి.. ప్లాన్‌-బిని సిద్ధం చేసుకోవాలి. అప్పుడు ఒత్తిడి కాస్త తగ్గుతుంది. దీనర్థం మరో ప్లాన్‌ సిద్ధంగా ఉందని నిర్లక్ష్యంగా ఉండమని కాదు. వీలైనంత వరకూ ముందుగా పని పూర్తిచేయడానికే ప్రయత్నించాలి. అది విఫలమైనప్పుడు మాత్రమే ప్లాన్‌-బికి రావాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు