Ambedkar Open University: తెలుగులో పీజీ.. తక్కువ ఫీజు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో దూరవిద్యకు దగ్గరి దారి.. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం. అభ్యసన కేంద్రాలు అందుబాటులో ఉండటం, ఎక్కువ సంఖ్యలో కోర్సులు, తక్కువ ఫీజులు, తెలుగు మీడియంలోనూ పీజీ కోర్సులు అందించడం.. తదితర కారణాలతో ఈ సంస్థలో ఎక్కువమంది విద్యార్థులు, ఔత్సాహికులు చేరుతున్నారు.

Updated : 04 Sep 2023 08:44 IST

సార్వత్రిక విద్యకు.. అంబేడ్కర్‌ వర్సిటీ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో దూరవిద్యకు దగ్గరి దారి.. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం. అభ్యసన కేంద్రాలు అందుబాటులో ఉండటం, ఎక్కువ సంఖ్యలో కోర్సులు, తక్కువ ఫీజులు, తెలుగు మీడియంలోనూ పీజీ కోర్సులు అందించడం.. తదితర కారణాలతో ఈ సంస్థలో ఎక్కువమంది విద్యార్థులు, ఔత్సాహికులు చేరుతున్నారు. యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను బీఆర్‌ఏఓయూ అందిస్తోంది. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆ వివరాలు..

ఇవీ కోర్సులు యూజీలో..

బీఏ, బీఎస్సీలను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది. బీకాం కోర్సు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో అందుబాటులో ఉంది. కోర్సుల వ్యవధి మూడేళ్లు. యూజీ కోర్సులకు ట్యూషన్‌ ఫీజు మొదటి ఏడాది రూ.2700, తర్వాత రెండేళ్లు ఏడాదికి రూ.2500 చొప్పున చెల్లించాలి. అలాగే సైన్స్‌ కోర్సుల్లో చేరినవారు ల్యాబ్‌ ఫీజు అదనంగా చెల్లించాలి. యూజీ కోర్సులను ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) విధానంలో నిర్వహిస్తున్నారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు చొప్పున ఉంటాయి.

విభాగాలవారీ సబ్జెక్టుల వివరాలు...

కళలు (ఆర్ట్స్‌): తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం.
సోషల్‌ సైన్సెస్‌ (సామాజిక శాస్త్రాలు): అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతిశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం, ప్రభుత్వ పాలనశాస్త్రం, సమాజశాస్త్రం, జర్నలిజం.
విజ్ఞానశాస్త్రాలు (సైన్స్‌): వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, భూగర్భశాస్త్రం.
వాణిజ్యశాస్త్రం: కామర్స్‌.
అర్హత: యూజీ కోర్సులకు ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్‌/ ఐటీఐ కోర్సులు చదివినవారూ అర్హులే. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ పూర్తిచేసుకున్న వారికీ అవకాశం ఉంది.

పీజీలో..

ఎంఏ: ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, ఉర్దూ. వీటిలో ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ కోర్సులను తెలుగు మాధ్యమంలోనే అందిస్తున్నారు. స్టడీ మెటీరియల్‌ కూడా తెలుగులోనే ఉంటుంది. పరీక్షలు తెలుగు/ఇంగ్లిష్‌లో రాసుకోవచ్చు. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ ఆంగ్ల మాధ్యమంలోనే లభిస్తుంది. లాంగ్వేజీ కోర్సులు సంబంధిత భాషలో ఉంటాయి. కోర్సుల ఫీజు మొదటి ఏడాదికి రూ.5300. రెండో ఏడాదికి రూ.5000. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌కు మొదటి ఏడాది రూ.7800. రెండో సంవత్సరానికి రూ.7500. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు.
అర్హత: ఏదైనా యూజీ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.  
ఎమ్మెస్సీ: మ్యాథ్స్‌, అప్లైడ్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, సైకాలజీ. వ్యవధి రెండేళ్లు. ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. కెమిస్ట్రీకి మొదటి సంవత్సరం రూ.18,300. రెండో ఏట రూ.18,000. మ్యాథ్స్‌కి రెండేళ్లూ వరుసగా రూ.7800, 7500. మిగిలినవాటికి మొదటి ఏడాదికి రూ.15,300. రెండో సంవత్సరానికి రూ.15,000 ఫీజు చెల్లించాలి.
అర్హత: సంబంధిత సబ్జెక్టులను బ్యాచిలర్‌ డిగ్రీలో చదివుండాలి. సైకాలజీకి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీలో సైన్స్‌ గ్రూపులవారు ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సులో చేరవచ్చు.
ఎంబీఏ: రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఏపీ లేదా తెలంగాణ ఐసెట్‌-2023లో అర్హత సాధించాలి. డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45 శాతం చాలు. కోర్సు ఫీజు మొదటి ఏడాదికి రూ.15,300. రెండో సంవత్సరానికి రూ.15,000.
ఎంఎల్‌ఐఎస్సీ: 40 శాతం మార్కులతో బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. ట్యూషన్‌ ఫీజు రూ.10,300.
బీఎల్‌ఐఎస్సీ: గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45 శాతం. కోర్సు వ్యవధి ఏడాది. ఫీజు రూ.5300.
ఎంకాం: బీకాం, బీబీఏ, బీబీఎం, బీఏ (కామర్స్‌) వీటిలో ఏదైనా కోర్సు చదివినవారు చేరవచ్చు. ఫీజు మొదటి సంవత్సరం రూ.7800, రెండో ఏడాది రూ.7500.
డిప్లొమా: సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు, హ్యూమన్‌ రైట్స్‌, కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ టూరిజం, విమెన్‌ స్టడీస్‌, . ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది.
అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌కు మాత్రం డిగ్రీ లేదా పీజీలో సైకాలజీ
చదివుండాలి.
సర్టిఫికెట్‌: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌, ఎన్జీవోస్‌ మేనేజ్‌మెంట్‌, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌. కోర్సుల వ్యవధి ఆరు నెలలు. కోర్సును బట్టి వీటిని పదోతరగతి, ఇంటర్‌, ఎలాంటి విద్యార్హతలు లేకుండా అందిస్తున్నారు.
అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 5.
వెబ్‌సైట్‌: https://www.braouonline.in/

కాకతీయ వర్సిటీలో...

కాకతీయ విశ్వవిద్యాలయం (వరంగల్‌) యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

యూజీ

బీకాం(జనరల్‌/కంప్యూటర్స్‌), బీబీఏ, బీఎల్‌ఐఎస్సీ, బీఎస్సీ(మ్యాథ్స్‌/స్టాటిస్టిక్స్‌/కంప్యూటర్స్‌)

పీజీ

ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హెచ్‌ఆర్‌ఎం, రూరల్‌ డెవలప్‌మెంట్‌, సోషియాలజీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ.

ఎమ్మెస్సీ

బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, జువాలజీ.

డిప్లొమా(ఏడాది)

బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మార్కెటింగ్‌, టాలీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సు.

ఓరియెంటేషన్‌ (3 నెలలు)

మిమిక్రీ, ఓకల్‌ మ్యూజిక్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మ్యూజిక్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌.
అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 11

వెబ్‌సైట్‌: http://www.sdlceku.co.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని