నలుగురితోనూ త్వరగా కలవలేకపోతున్నారా?

కోరుకున్న ప్రముఖ కాలేజీలోనే సీటు వచ్చింది. వెంటనే హాస్టల్లో  చేరి తరగతులకు హాజరవుతున్నారు కూడా. అంతే బాగానే ఉందిగానీ.. అక్కడే ఓ సమస్య.

Published : 18 Sep 2023 00:48 IST

కోరుకున్న ప్రముఖ కాలేజీలోనే సీటు వచ్చింది. వెంటనే హాస్టల్లో  చేరి తరగతులకు హాజరవుతున్నారు కూడా. అంతే బాగానే ఉందిగానీ.. అక్కడే ఓ సమస్య. అంతా కొత్తకొత్తగా.. అయోమయంగా ఉండటం, నలుగురితోనూ కలవలేక.. అలాగని ఒంటరిగానూ ఉండలేక సతమతమవడం...  ఇది కొంతమంది విద్యార్థుల సమస్యే! ఈ ఇబ్బంది నుంచి త్వరగా బయటపడాలంటే ....

తరులతో అసలు కలవలేకపోతున్నాం. పాఠాల విషయంలో సందేహాలున్నా.. అర్థం కాలేదని అడగటానికి మొహమాటం. మా సమస్యలూ, అసౌకర్యాలను పైకి చెప్పుకోవడానికీ సంకోచం..- ఇలా కొందరు విద్యార్థులు తమ గురించి తాము సానుభూతితో ఆలోచిస్తూ ఆ పరిధిలోనే ఉండిపోతుంటారు.

  • ‘చిన్నప్పటి నుంచీ నేనింతే. ఎవరితోనూ కలవలేను. మారడం నా వల్ల కాదు’ అనుకుంటూ ఉంటే ఎప్పటికీ మారలేరు. పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని ప్రయత్నించడం సబబు.  
  • కొత్తచోట ఇమడటం ఎవరికైనా కష్టమే. కొత్త వాతావరణం ఆందోళన కలిగించడమూ మామూలు విషయమే. దీన్నే భూతద్దంలో చూస్తూ కూర్చోకూడదు. ఆ సమస్య నుంచి బయటపడటానికి మీ వంతుగా నిజాయతీగా ప్రయత్నించాలి.
  • ఇప్పటివరకూ కుటుంబ సభ్యుల మధ్యే పెరిగారు. మీ పనులన్నింటికీ అమ్మానాన్నల మీదే ఆధారపడ్డారు. ఉన్నత చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అలా కుదరదు కదా? మీకు కావలసిన వస్తువులను మీరే సమకూర్చుకోవాలి. మీ పనులను మీరే స్వయంగా చేసుకోవాలి. ఇవన్నీ ఒక్క రోజులోనే వచ్చేయవు. నెమ్మదిగా అలవాటు అవుతాయి.
  • సీనియర్లకు ఎదురెళ్లి వెంటనే గలగలా మాట్లాడే నేర్పు మీకు లేకపోవచ్చు. కానీ చుట్టుపక్కల వాతావరణాన్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి. సహవిద్యార్థులు సీనియర్లతో ఎలా మాట్లాడుతున్నారో చూడాలి. పక్కవాళ్లు సీనియర్లకు హాయ్‌ చెప్పినప్పుడు.. మీరూ వెంటనే హాయ్‌ చెప్పలేకపోవచ్చు. కానీ కనీసం పలకరింపుగా చిన్నగా నవ్వొచ్చు. ఆ తర్వాత కొన్ని రోజులకు వారితో నెమ్మదిగా మాట్లాడగలుగుతారు.
  • నలుగురిలోనూ కలవలేరు కాబట్టి.. మీ గురించి అందరూ సానుకూలంగానే ఆలోచిస్తారని అనుకోవద్దు. ‘వాళ్ల స్వభావం అంతే. నాకిది కావాలని చొరవగా అడగలేరు..’ అని ఎవరూ సానుభూతిని చూపించరు సరి కదా.. ‘వాళ్లకు పొగరెక్కువ. ఎవరితోనూ కలవరు..’ అని ప్రతికూలంగా అనుకునే ప్రమాదమూ లేకపోలేదు. పైగా అలా అపార్థం చేసుకునే అవకాశాన్ని మీరే ఇచ్చినట్టూ అవుతుంది.

బలాలను మర్చిపోకూడదు

నిజానికి కొన్ని బలహీనతలూ, కొన్ని బలాలూ అందరికీ ఉంటాయి. సమస్యేమిటంటే.. కొందరు బలహీనతల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ.. బలాల గురించి మర్చిపోతుంటారు.

  • వెంటనే చొరవగా ఇతరులతో కలవలేని విద్యార్థులు కూడా చాలా సందర్భాల్లో ఎదుటివారికంటే మెరుగ్గానూ ఆలోచించగలుగుతారు. ఆ ఆలోచనలకు చక్కటి అక్షరరూపమూ కల్పించగలుగుతారు. కాబట్టి ఇలాంటి ‘అంతర్ముఖ’ స్వభావం ఉన్నవారు తమ ఆలోచనలు, అభిప్రాయాలను రాయడానికి ప్రయత్నించాలి.
  • వేదిక మీద ప్రసంగించాల్సిన అవసరం వచ్చిందనుకుందాం. కొందరు వెంటనే గలగలా మాట్లాడేస్తారు. కానీ అలా చేయలేనంతమాత్రాన నష్టపోయినట్టు కాదు. ఇలాంటి విద్యార్థులు కాస్త సమయం తీసుకుని తమ ఆలోచనలను కాగితం మీద పెట్టి... ఆ అంశాల గురించి మాట్లాడితే సరిపోతుంది.
  • ఒక అంశం మీద వెంటనే తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోవచ్చు. కానీ దాని మీద కాస్త ఆలోచిస్తే చక్కగా మాట్లాడే వీలుంటుంది. వెంటనే మాట్లాడారా లేదా అనేదానికంటే.. ఎంత అర్థవంతంగా మాట్లాడేరనేదీ ముఖ్యమే. వీరిలో ఓ సుగుణం ఏమిటంటే.. వీళ్లు ఊరికే కాలయాపనకు మాట్లాడరు. ఎంతోకొంత విషయ పరిజ్ఞానం ఉంటేగానీ ఇతరులతో తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇష్టపడరు.  
  • నలుగురి ముందూ మాట్లాడలేకపోవడాన్ని బలహీనతగా భావించి.. దాని గురించే ఎక్కువగా మధనపడకూడదు. బలాల మీద దృష్టి కేంద్రీకరించి వాటిని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని