‘డిజైన్‌’ చేసుకుంటారా మీ కెరియర్‌?

చెప్పులు, చెవిదిద్దులు, బ్యాగులు, బెల్టులు, గాజులు, గ్లాసులు, వివిధ పరికరాలు, ఫర్నిచర్‌, ఇంటీరియర్‌, వెబ్‌సైట్లు, గ్రాఫిక్స్‌, వీడియో గేమ్స్‌..

Published : 25 Sep 2023 00:18 IST

చెప్పులు, చెవిదిద్దులు, బ్యాగులు, బెల్టులు, గాజులు, గ్లాసులు, వివిధ పరికరాలు, ఫర్నిచర్‌, ఇంటీరియర్‌, వెబ్‌సైట్లు, గ్రాఫిక్స్‌, వీడియో గేమ్స్‌.. ఇలా ప్రతీదీ వైవిధ్యభరితంగా, చూస్తున్నకొద్దీ చూడాలనిపించేలా.. రూపొంది, మంత్రముగ్ధులను చేస్తుంటాయి. వీటి తళుకుల వెనుక డిజైనర్ల సృజన దాగి ఉంది. అందుకే వీరికి విశ్వవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. మేటి అవకాశాలతోపాటు ఆకర్షణీయ వేతనాలూ పొందుతున్నారు. మేటి డిజైనర్లను రూపొందించడానికి ప్రత్యేక సంస్థలూ వెలిశాయి. వాటిలో ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి!

హలకు ఆకట్టుకునే, అర్థవంతమైన రూపమివ్వగలిగే నైపుణ్యం ఉన్నవారు డిజైన్‌ కోర్సుల బాట పట్టవచ్చు. వీరికోసం జాతీయ ప్రాధాన్య సంస్థగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (అహ్మదాబాద్‌) ఏర్పాటైంది. దీనికి ఆంధ్రప్రదేశ్‌ (విజయవాడ), హర్యానా, మధ్యప్రదేశ్‌, అసోంలలో శాఖలూ ఉన్నాయి. వీటిలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులు అందిస్తున్నారు.

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజ్‌) కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. నిడ్‌, అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో.. యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌, ఎగ్జిబిషన్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, అసోం క్యాంపస్‌ల్లో.. ఇండస్ట్రియల్‌ డిజైన్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ అండ్‌ అపారెల్‌ డిజైన్‌ కోర్సులు అందిస్తున్నారు. పరీక్షలో ప్రతిభతో వీటిలో ప్రవేశం లభిస్తుంది.
  • మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల వ్యవధి రెండున్నరేళ్లు. వీటిని అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. యూజీలో ఉన్న కోర్సులన్నీ పీజీలో ఉన్నాయి. అదనంగా అపారెల్‌ డిజైన్‌, రిటైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్‌, డిజిటల్‌ గేమ్‌ డిజైన్‌, ఇన్ఫర్మేషన్‌ డిజైన్‌, ఇంటరాక్షన్‌ డిజైన్‌, లైఫ్‌స్టైల్‌ డిజైన్‌, యాక్సెసరీస్‌ డిజైన్‌, న్యూ మీడియా డిజైన్‌, ఫొటోగ్రఫీ డిజైన్‌, స్ట్రాటజిక్‌ డిజైన్‌ మేనేజ్‌మెంట్‌, టాయ్‌ అండ్‌ గేమ్‌ డిజైన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ ఆటోమొబైల్‌ డిజైన్‌, యూనివర్సల్‌ డిజైన్‌ కోర్సులు ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి పరీక్ష రాయాలి.

ప్రవేశ పరీక్ష ఇలా..

డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు(డీఏటీ)లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఉంటాయి. ప్రిలిమ్స్‌ వంద మార్కులకు నిర్వహిస్తారు. వ్యవధి 3 గంటలు. పెన్సిల్‌/పెన్నుతో సమాధానాలు రాయాలి. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులకు మెయిన్స్‌ నిర్వహిస్తారు. తుది నియామకాలు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో సాధించిన మార్కుల మెరిట్‌తో ఉంటాయి. మాదిరి ప్రశ్నపత్రాలు నిడ్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. పరీక్షపై అవగాహనకు ఇవి ఉపయోగపడతాయి.

ఉపాధి అవకాశాలు

ఈ సంస్థల్లో చదివినవారు ప్రాంగణ నియామకాల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. వర్ల్‌పూల్‌, విప్రో, టైటాన్‌, ఫిలిప్స్‌, టాటా, గోద్రెజ్‌, జేపీ మోర్గాన్‌, ఎల్‌జీ, మారుతీ సుజుకీ, మైక్రోసాఫ్ట్‌, మైండ్‌ట్రీ, ఒరాకిల్‌, రంగోలీ, రెడ్‌బస్‌, తనిష్క్‌, వెల్‌స్పన్‌, జొమాటో...ఇలా పలు సంస్థలు వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. చదువుకున్న స్పెషలైజేషన్‌ ప్రకారం సంబంధిత సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. పీజీ పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలతో, అత్యున్నత హోదాలు సొంతం చేసుకుంటున్నారు.

అర్హత ఎవరికి?

బ్యాచిలర్‌ కోర్సులకు ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. వయసు 20 ఏళ్లలోపు ఉండాలి. జులై 1, 2003 తర్వాత జన్మించాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు మూడేళ్లు; దివ్యాంగులకు ఐదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. ఇంటర్‌ తర్వాత నాలుగేళ్ల బీడిజైన్‌ లేదా అనుబంధ కోర్సులు చదివినవారు మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌కు అర్హులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: డిసెంబరు 1 మధ్యాహ్నం 4 వరకుస్వీకరిస్తారు.

పరీక్ష తేదీ: డిసెంబరు 24

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.

వెబ్‌సైట్‌: https://admissions.nid.edu/

కొన్ని మేటి సంస్థలు

ఐఐటీలు: ఐఐటీ బాంబే, దిల్లీ, గువాహటి, హైదరాబాద్‌, మరికొన్ని సంస్థల్లో డిజైన్‌ యూజీ, పీజీ కోర్సులు చదువుకోవచ్చు. ఇందుకోసం యూసీడ్‌, సీడ్‌ పరీక్షల్లో ప్రతిభ చూపాలి. ప్రకటన త్వరలో వెలువడుతుంది.

నిఫ్ట్‌లు: దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)లు డిజైన్‌ కోర్సులూ అందిస్తున్నాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో.. ఫ్యాషన్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, యాక్సెసరీ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌ వీటిలో చదువుకోవచ్చు. కొద్ది రోజుల్లో ప్రకటన వెలువడుతుంది.  

దేశవ్యాప్తంగా ఉన్న ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్లలో ఫుట్‌వేర్‌ ఒక్కటే కాకుండా పలు విభాగాల్లో డిజైన్‌ కోర్సులు అందిస్తున్నారు. ఎఫ్‌డీడీఐ నిర్వహించే పరీక్షతో ప్రవేశం
లభిస్తుంది. త్వరలో ప్రకటన వస్తుంది.

శ్రేష్ఠ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌, డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ; పెర్ల్‌ అకాడెమీ, సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, విట్‌, ఎస్‌ఆర్‌ఎం, రాంచీ, అమిటీ, దిల్లీ, గాల్గోటియా యూనివర్సిటీలు డిజైన్‌ కోర్సుల్లో పేరొందాయి. వీటిలో పలు సంస్థలు నిడ్‌/ యూసీడ్‌/ నిఫ్ట్‌/ఎఫ్‌డీడీఐ స్కోరుతో అవకాశం కల్పిస్తున్నాయి.

ఏయే స్పెషలైజేషన్లు?

ఇండస్ట్రియల్‌ డిజైన్‌: వీరు తయారీ సంస్థల్లో వస్తువు, ఉత్పత్తిని డిజైన్‌ చేస్తారు. ఫర్నిచర్‌, ఇంటీరియర్‌, ఇంజినీరింగ్‌ ప్రొడక్టులు, సిస్టమ్స్‌, కన్సూమర్‌ గూడ్స్‌, క్రాఫ్ట్‌ బేస్డ్‌ ప్రొడక్ట్స్‌ యాక్సెసరీస్‌, పర్సనల్‌ యూజర్‌ ప్రొడక్ట్స్‌ కిచెన్‌ టూల్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌, కొత్తతరం ఎల‌్రక్టానిక్స్‌, ఐటీ, తదితర సంస్థల్లో పనిచేయవచ్చు.    

టెక్స్‌టైల్‌ డిజైన్‌: జనాల అవసరాలు, అభిరుచులను పరిగణనలోకి తీసుకుని టెక్స్‌టైల్‌ డిజైనర్లు వస్త్రాలను రూపొందిస్తారు. సౌకర్యవంతం, ఆకర్షణీయంగా ఉండేలా వాటిని తీర్చిదిద్దుతారు. ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరాల్లో దుస్తులు ఒకటి. ఎక్కువమంది.. దుస్తుల ఎంపికలో వైవిధ్యం, నాణ్యత, మన్నికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరికి టెక్స్‌టైల్‌ పరిశ్రమలు, రెడీమేడ్‌ దుస్తుల కంపెనీలు, రిటైల్‌ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.

గ్రాఫిక్‌ డిజైన్‌: ప్రపంచం గ్రాఫిక్‌ మయమవుతోంది. అన్ని రంగాల్లోనూ ఈ గ్రాఫిక్స్‌ ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారు గ్రాఫిక్‌ డిజైనర్లగా, బ్రాండ్‌ ఐడెంటిటీ డెవలపర్‌, లోగో డిజైనర్‌, విజువల్‌ ఇమేజ్‌ డెవలపర్‌, మల్టీమీడియా డెవలపర్‌, పబ్లికేషన్‌ డిజైనర్‌గా పనిచేయవచ్చు. బహుళజాతి కంపెనీలు, అడ్వర్టైజింగ్‌, ఆన్‌లైన్‌ మీడియా, టీవీ,  వినోద పరిశ్రమల్లో వీరు ఉద్యోగాలు పొందవచ్చు.

ఫ్యాషన్‌ డిజైన్‌: ఈ కోర్సులు చదివినవారికి దుస్తులు తయారుచేసే కంపెనీల్లో మేటి అవకాశాలు లభిస్తాయి. అవుట్‌లెట్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. కొంత అనుభవంతో డిజైన్‌ కన్సల్టెంట్‌, స్టైలిస్ట్‌, కస్టమర్‌ డిజైనర్‌, ఫ్యాషన్‌ ఫోర్‌కాస్టర్‌, ఇలస్ట్రేటర్‌, ఆంత్రప్రెన్యూర్‌, అకడమీషియన్‌, ఫ్యాషన్‌ మర్చండైజర్‌, బయ్యర్‌గా కొనసాగవచ్చు. 

కమ్యూనికేషన్‌ డిజైన్‌: యానిమేషన్‌ అండ్‌ ఫిల్మ్‌ డిజైన్‌, ఎగ్జిబిషన్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌ ఇందులో భాగం. వాణిజ్య ప్రకటనలు, ఆన్‌లైన్‌ మీడియా, వినోద పరిశ్రమల్లో అవకాశాలు లభిస్తాయి.

లెదర్‌ డిజైన్‌: పాదరక్షలు, బెల్టులు, బ్యాగులకు.. విశ్వవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఈ విభాగాల్లో దేశీయ, బహుళజాతి సంస్థలెన్నో ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. సోఫాలతోపాటు పలు వస్తువుల తయారీలో లెదర్‌ వినియోగం పెరిగింది. జంతువుల తోలుతో వీరు ఆకర్షణీయ ఆకృతులు డిజైన్‌ చేస్తారు. 

ప్రొడక్ట్‌ డిజైన్‌: పరిశ్రమలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు రూపొందిస్తారు. ఎక్కువ మన్నికగా, మరింత తేలికగా, తక్కువ స్థలంలో ఇమిడేలా, ఆకర్షణీయంగా ఉండేలా, నిర్వహణ భారం లేకుండా, కొద్ది మొత్తంతోనే తయారయ్యేలా ఉత్పత్తులను ప్రొడక్ట్‌ డిజైనర్లు తయారుచేస్తారు. వీరికి వస్తు తయారీకి చెందిన అన్ని పరిశ్రమల్లోనూ అవకాశాలుంటాయి.

డిజైన్‌ విభాగంలో స్పెషలైజేషన్‌ ఏదైనప్పటికీ.. అవకాశాలకు ఢోకా లేదు. సృజన, ఊహ, చిత్రిక నైపుణ్యాలు ఉన్నవారు బాగా రాణించగలరు. మేటి విద్యాలయాల్లో చదువు పూర్తిచేసుకున్నవారిని బహుళజాతి, దేశీయ సంస్థలు ప్రాంగణ నియామకాల్లో పెద్ద మొత్తంలో వేతనంతో అవకాశం కల్పిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని