కలసి మెలసి..సానుకూలంగా !

భావోద్వేగాలను అర్థం చేసుకుని, వాటిని నియంత్రించగలుగుతున్నారా? అంతే కాదు, ఇతరుల భావోద్వేగాలకు తగిన విధంగా స్పందిస్తున్నారా? 

Updated : 09 Nov 2023 03:00 IST

భావోద్వేగాలను అర్థం చేసుకుని, వాటిని నియంత్రించగలుగుతున్నారా? అంతే కాదు, ఇతరుల భావోద్వేగాలకు తగిన విధంగా స్పందిస్తున్నారా?  సామాజికంగా ఎదురయ్యే అవాంతరాలను సమర్థంగా ఎదుర్కొంటున్నారా? ఇవన్నీ..విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులకూ ఎంతో అవసరం. కీలకమైన ఈ  నైపుణ్యాన్ని ‘భావోద్వేగ ప్రజ్ఞ’ అని వ్యవహరిస్తారు. దీన్నెలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందామా?

మీ గురించి మీకు ఉండే సంపూర్ణ అవగాహన.. భావోద్వేగ ప్రజ్ఞకు పునాది లాంటిది. అది ఉన్నప్పుడే ఇతరుల గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. ఈ స్వీయ అవగాహనలోనే వ్యక్తిగత నియంత్రణ, ప్రేరణ, సహానుభూతి, సామాజిక నైపుణ్యాలూ ఇమిడి ఉంటాయి.  

  • స్వీయ నియంత్రణ అనేది ఈ నైపుణ్యానికి ఎంతో అవసరం. బలాలను గుర్తించడం, మూడ్‌ను అదుపులో ఉంచుకోవడం, హఠాత్తుగా సహనం కోల్పోకుండా ఉండటం.. ఇవన్నీ స్వీయ నియంత్రణలోకే వస్తాయి.
  •  ఇతరుల భావోద్వేగాలను అర్థంచేసుకోవడానికి సహానుభూతి ఎంతో అవసరం. ఎదుటివారి స్థానంలో మీరున్నట్టుగా ఊహించుకుని ఆలోచిస్తే వారి సాధక బాధకాలన్నీ అర్థమవుతాయి. ఎదుటివాళ్లు చెప్పేదాన్ని ఆసక్తిగా వినడం, అర్థం చేసుకోవడం, సందేహమొస్తే ప్రశ్నించి తెలుసుకోవడం వల్ల సహ విద్యార్థులతో సఖ్యతగా మెలగగలుగుతారు.
  •  అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తంచేయగలగాలి. ఒక్కోసారి అనుకోని పరిస్థితులు ఎదురుకావచ్చు.. కొత్త వ్యక్తులతోనూ కలిసి పనిచేయాల్సి రావచ్చు. ఇలాంటప్పుడూ నెగ్గుకు రావాలంటే.. భావవ్యక్తీకరణ నేర్పు ఎంతో అవసరం.
  •  మీ గురించి మీకు అవగాహన ఉంటుంది. అయినప్పుటికీ కొన్ని సందర్భాల్లో ఎదుటివారి ఫీడ్‌బ్యాక్‌ కూడా అవసరం అవుతుంది. మీరు చదివే విధానం, పరీక్షల ప్రణాళిక, సాధన.. లాంటి విషయాల్లో ఇతరుల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవచ్చు. అవసరమైతే వారి సూచనలు, సలహాలకు అనుగుణంగా తగిన మార్పులూ, చేర్పులూ చేసుకోవచ్చు.
  •  మీపై ఎవరైనా విమర్శ చేశారనుకోండి. మీరేం చేస్తారు? సాధారణంగా చాలామంది విద్యార్థులు విమర్శలకు ప్రతికూలంగానే స్పందిస్తారు. వాటిని భూతద్దంలో పెద్దవి చేసి చూస్తూ ఇతరులతో గొడవ పడుతుంటారు. అలాకాకుండా వచ్చిన విమర్శల్లోని వాస్తవాలను గ్రహించాలి. అవసరమైతే మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
  • కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సంశయించకూడదు. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవసరమైతే.. ట్రైనింగ్‌, మెంటర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లకూ హాజరవుతుండాలి.

ఈ నైపుణ్యం ఉంటే...

  •  ఈ సామర్థ్యం ఉన్న విద్యార్థులు.. సహవిద్యార్థులు, అధ్యాపకులతో మర్యాదగా ప్రవర్తిస్తారు. ఉద్యోగులైతే సహోద్యోగులతో కలిసిమెలిసి ఉంటారు. అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా పనిచేయగలుగుతారు. పని వాతావరణాన్ని సానుకూలంగా మలచగలుగుతారు. బృంద సభ్యుల మధ్య నమ్మకం, మర్యాదతో కూడిన వాతావరణం ఉంటుంది.
  •  ఎంత బాగా చదివినప్పటికీ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురైతే ఫలితం ఉండదు. ఒత్తిడిని జయించగలిగితేనే పరీక్షలు బాగా రాసి.. కోరుకున్న ఫలితాలనూ సాధించగలుగుతారు. ఉద్యోగులైతే ఒత్తిడిని నియంత్రించుకుని..  పనిలో సానుకూల ఫలితాలనూ పొందగలుగుతారు. పని ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణమూ ఉంటుంది. సాంకేతిక మార్పులకు అనుగుణంగా సానుకూల వైఖరితో తమ సామర్థ్యానికి మెరుగులు దిద్దుకుంటారు.
  •  విద్యార్థులైనా, ఉద్యోగులైనా తక్షణ భావోద్వేగాల ప్రభావంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలనే అందుకోవాల్సి వస్తుంది. భావోద్వేగ నైపుణ్యం ఉన్నవాళ్లు వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని