విజయానికి ఇవే ప్రధానం!

జేఈఈ మెయిన్‌ - 2024 మొదటి సెషన్‌ను జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీల మధ్య నిర్వహించనున్నారు. జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారి సౌలభ్యం కోసం విద్యా సంవత్సరం మొదటిలోనే ప్రవేశ పరీక్షల సిలబస్‌ను ప్రకటిస్తుంటారు. కానీ పరీక్షకు కేవలం రెండు నెలల ముందే జేఈఈ-మెయిన్‌ 2024 సిలబస్‌ను వెల్లడించారు. అయితే సిలబస్‌ను కొంతమేరకు తగ్గించడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం.

Updated : 22 Nov 2023 17:37 IST
జేఈఈ-మెయిన్‌-2024 సన్నద్ధత
జేఈఈ మెయిన్‌ - 2024 మొదటి సెషన్‌ను జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీల మధ్య నిర్వహించనున్నారు. జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారి సౌలభ్యం కోసం విద్యా సంవత్సరం మొదటిలోనే ప్రవేశ పరీక్షల సిలబస్‌ను ప్రకటిస్తుంటారు. కానీ పరీక్షకు కేవలం రెండు నెలల ముందే జేఈఈ-మెయిన్‌ 2024 సిలబస్‌ను వెల్లడించారు. అయితే సిలబస్‌ను కొంతమేరకు తగ్గించడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం. ఈ సందర్భంగా జేఈఈ మెయిన్‌లో ఆశించిన ర్యాంకు తెచ్చుకోవాలంటే ఎలాంటి కృషి చేయాలి? తెలుసుకుందాం!  
సిలబస్‌కు అనుగుణంగానే ప్రశ్నపత్రాలు రూపొందించి నిర్వహిస్తే ఫలితం ఉంటుంది. లేకపోతే మారిన కొత్త సిలబస్‌ వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే..జేఈఈ మెయిన్‌ను ఈ సంవత్సరం రెండు సెషన్స్‌లో సెషన్‌కు 5 రోజులు, రోజుకు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. అంటే ఈ పరీక్షకు సుమారు 20కి పైన విభిన్న ప్రశ్నపత్రాలు అందజేస్తూ.. మారిన సిలబస్‌కు అనుగుణంగా నిర్వహించడం.. కత్తి మీద సాము లాంటిదే!
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లతో పోల్చుకుంటే  కెమిస్ట్రీ నుంచి కాస్త ఎక్కువగానే అధ్యాయాలను తొలగించారు. ఇది విద్యార్థులకు చాలా ఉపశమనమే. ఇదే మాదిరిగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా కెమిస్ట్రీలో సిలబస్‌ తగ్గిస్తే చాలా భారం తగ్గుతుంది. ఇంతవరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 సిలబస్‌ గురించి ఎటువంటి విషయం తెలియకపోవడంతో కాస్త అయోమయ స్థితి ఏర్పడింది. గత సంవత్సరం వరకూ జేఈఈ-మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌లు రెండూ ఒకటే కావడంతో విద్యార్థులు ఎలాంటి గందరగోళం లేకుండా ప్రిపేర్‌ అయ్యారు. దీనిపై కూడా త్వరలోనే స్పష్టత వస్తుందని భావిద్దాం.
‘పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం’ అని మహాత్మాగాంధీ చెప్పినట్టు జాతీయ స్థాయి పరీక్షల్లో మినహాయింపుల్లేకుండా సన్నద్ధం కావాలి. జేఈఈ సిలబస్‌లో జరిగిన మార్పులకు తగ్గట్టుగా చదివే పంథాను మార్చుకోవాలి. నిర్మాణాత్మక ప్రణాళిక, సమర్థ వ్యూహాలతో జేఈఈ-మెయిన్‌లో విజయావకాశాలను పెంచుకోవచ్చు.

పరీక్ష సరళిని అర్థం చేసుకోండిజేఈఈ-మెయిన్‌

2023 మాదిరిగానే జేఈఈ మెయిన్‌-2024ను నిర్వహిస్తున్నారు. ప్రశ్నల సంఖ్య, వాటి మార్కులు, రుణాత్మక మార్కులు, ఛాయిస్‌ వంటివన్నీ జేఈఈ-మెయిన్‌-2023 మాదిరిగానే ఉంటాయి. అంటే.. ప్రతి సబ్జెక్టులోని రెండో సెక్షన్‌లో వచ్చే న్యూమరికల్‌/ఇంటిజర్‌ టైప్‌ తరహా ప్రశ్నలకు మాత్రమే ఛాయిస్‌ ఉంది. మొదటి సెక్షన్‌లోని స్ట్రెయిట్‌ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఛాయిస్‌ లేదు.

స్టడీ మెటీరియల్‌

2019 నుంచి 2023 వరకు 95 శాతం ప్రశ్నలు కెమిస్ట్రీలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే ఇస్తున్నారు. అలాగే ఫిజిక్స్‌లో కూడా సుమారు 75 శాతం ప్రశ్నలు యథాతథంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే ఇస్తున్నారు. మ్యాథ్స్‌ అయినా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అయినా ఎన్‌సీఈఆర్‌టీలోని అంశాలపైనే ఉంటాయి. కానీ ఎక్కువ సమస్యల సాధన నిమిత్తం మీరు తీసుకునే కోచింగ్‌ సంస్థల స్టడీ మెటీరియల్‌నే అనుసరించవచ్చు.

పట్టులేనివాటికి ప్రాధాన్యం

ఇది విద్యార్థులను బట్టి మారుతుంది. ముఖ్యంగా అందరూ స్టేట్‌మెంట్‌-1, స్టేట్‌మెంట్‌-2 లేదా అసర్షన్స్‌ అండ్‌ రీజన్స్‌ తరహా ప్రశ్నల్లో తప్పు చేస్తున్నారు. అంతే కాదు, ప్రతి సబ్జెక్టులో కొన్ని ముఖ్యమైన స్టాండర్డ్‌ ఫార్ములాలుంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం ఎంతైనా అవసరం. పరీక్ష హాల్లో వాటిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే సమయం వృథా అవుతుంది. మీ బలమైన అంశాలపై అంటే మీకు బాగా పట్టున్న అంశాలపై ప్రశ్నలు వస్తే తప్పు చేయవద్దు.

రెగ్యులర్‌ ప్రాక్టీస్‌, పాత ప్రశ్నపత్రాలు

ప్రశ్నపత్రాల విశ్లేషణను బట్టి- ప్రతి సబ్జెక్టులో 40 శాతం ప్రశ్నలు డైరెక్టుగా ఫార్ములా బేస్డ్‌, 40 శాతం ప్రశ్నలు పాత ప్రశ్నపత్రాల నుంచి, 10 శాతం ప్రశ్నలు పాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోని స్ట్ర్టెయిట్‌ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, 5 శాతం ప్రశ్నలు కాస్త ఎక్కువ సమయం పట్టేవి, మిగిలిన 5 శాతం ప్రశ్నలు కాస్త కొత్త పదాలను ఉపయోగించి అడిగే ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి క్రమం తప్పకుండా పాత ప్రశ్న  పత్రాలన్నీ సాధన చేయడం ఎంతైనా మంచిది.

మాక్‌ టెస్ట్‌లు

ఇవి ఎన్ని రాస్తే అంత మంచిది. దీనివల్ల టైమ్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన పెరుగుతుంది. మీరు తరచూ చేసే తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడటానికి దోహదం చేస్తాయి. ఇప్పటినుంచీ కనీసం రెండు రోజులకు ఒక మాక్‌ టెస్ట్‌ సాధన చేయడం మేలు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఈ మాక్‌ టెస్టులను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

ఆరోగ్య సంరక్షణ

అన్నిటికన్నా ఇది చాలా ముఖ్యం. సమయానికి సరైన పోషకాహారం తీసుకోవడంతోపాటు తగినంత వ్యాయామం, నిద్ర మిమ్మల్ని చాలా చురుగ్గా ఆలోచించేలా చేస్తాయి. వీటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు.
 

జేఈఈ మెయిన్‌ 2023 ఆలిండియా ర్యాంక్స్‌  vs (  పర్సంటైల్‌ స్కోర్స్‌

జేఈఈ మెయిన్‌ 2023లో రెండు సెషన్లు నిర్వహించిన అనంతరం వాటిని క్రోడీకరించి ప్రకటించిన ఆల్‌ ఇండియా ర్యాంకులూ, సాధించినవారి పర్సంటైల్స్‌ కింది పట్టికలో ఉన్నాయి. సుమారుగా ఇదేవిధంగా జేఈఈ మెయిన్‌-2024 చివరి ఫలితాలు ఉండొచ్చు. ప్రాథమికంగా ఒక అంచనా కోసం ఈ పట్టికను  ఉపయోగించుకోవచ్చు.

సలహాలు - సందేహ నివృత్తి

ఏ సబ్జెక్టు ప్రిపేర్‌ అయినా అందులోని అంశాలను పద్ధతి ప్రకారం సన్నద్ధం కావాలి. పూర్తి అవగాహన రాకపోతే అధ్యాపకుల సలహాలతో సందేహ నివృత్తి చేసుకోండి. మీ సన్నద్ధత అంతటా సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. ప్రేరణ కోల్పోకుండా మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోండి.

పరీక్ష రోజు

పరీక్ష రోజున మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత బాగా రాస్తారు. ఎంత చదివారన్నది కాదు.. ఎంత బాగా రాశారన్నదే ముఖ్యం. మీ ప్రిపరేషన్‌లో నిజాయతీ ఉంటే 90 శాతం ప్రశ్నలు మీరనుకున్నవే ప్రతి పేపర్లో ఉంటారయని నమ్మండి. ఎటువంటి పరిస్థితిలోనూ తెలిసిన ప్రశ్నను తప్పు చేయొద్దు.
జేఈఈ మెయిన్‌ ప్రిపరేషన్‌, ఇతర పరీక్షల అధ్యయనాల మధ్య సమతుల్యతను పాటించండి. నిలకడ కలిగిన స్మార్ట్‌ ప్రిపరేషన్‌ ముఖ్యమని గుర్తించండి. ఇవన్నీ పాటిస్తే ఇక అంతిమ విజయం మీదే.
 

గమనించండి!

  • మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో జేఈఈ మెయిన్‌-2024 కోసం ప్రత్యేకంగా తొలగించిన అంశాలన్నీ ఏపీ, టీఎస్‌ ఇంటర్మీడియట్‌ సిలబస్‌లో ఉన్నాయి.  
  • అందులోనూ తొలగించిన ఆ భాగాల నుంచి ప్రశ్నలు కూడా ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షల్లో తప్పకుండా వస్తాయి. అందువల్ల జేఈఈ-మెయిన్‌ కోసం మాత్రమే సన్నద్ధమయ్యే విద్యార్థులు, తొలగించిన ఆయా అంశాలను బోర్డు పరీక్షల స్థాయిలో సన్నద్ధం కావడం మంచిది.
  • జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు కూడా జేఈఈ-మెయిన్‌లో తొలగించిన అంశాలపై పట్టు సాధించాలి. మరీ ముఖ్యంగా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లలో జేఈఈ-మెయిన్‌లో తొలగించిన అంశాల ప్రభావం జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఎంతమాత్రం చూపించదు.
  • జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2024 సిలబస్‌ కూడా ప్రకటించిన తర్వాత మనకు పూర్తిగా అర్థమవుతుంది. అంతవరకు జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2023ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు