పరీక్షల్లో గుర్తుంటున్నాయా.. మీ పాఠ్యాంశాలు?

సిలబస్‌లోని పాఠాలను పరీక్షల ముందో లేదా సమయం చిక్కినప్పుడో   పునశ్చరణ చేసుకుంటాం. చదివినవి మర్చిపోకుండా ఉండాలని ఇలా చేస్తుంటాం. అయితే ఆయా అంశాలను అర్థం చేసుకుంటూ చదవడం చాలా ముఖ్యం.

Updated : 19 Dec 2023 07:06 IST

సిలబస్‌లోని పాఠాలను పరీక్షల ముందో లేదా సమయం చిక్కినప్పుడో   పునశ్చరణ చేసుకుంటాం. చదివినవి మర్చిపోకుండా ఉండాలని ఇలా చేస్తుంటాం. అయితే ఆయా అంశాలను అర్థం చేసుకుంటూ చదవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఓసారి పునశ్చరణ చేసుకుంటే.. ఎప్పటికీ మర్చిపోయే ప్రమాదం ఉండదు.


అర్థం చేసుకుంటూ చదివితే.. విషయం మీద పూర్తిగా పట్టు వస్తుంది. దాంతో అవసరమైనప్పుడల్లా ఆ సమాచారాన్ని చక్కగా రాయగలుగుతారు.

చాలామంది విద్యార్థులు అవకాశం ఉన్నప్పుడల్లా పాఠ్యాంశాలను యాంత్రికంగా మననం చేసుకుంటూ ఉంటారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఇదే సరైన పద్ధతని భావిస్తుంటారు కూడా. సాధారణంగా మొదటిసారి చదివినప్పుడే విషయం చాలావరకూ అర్థమవుతుంది. రెండోసారి ‘ఇది నాకు తెలుసు’ అనే ఉద్దేశంతోనే చదువుతారు. దాంతో విషయాన్ని లోతుగాకానీ, అదనంగా ఇంకా ఏమైనా సమాచారం తెలుసుకోవాలనే ఆసక్తిగానీ ఉండదు. కేవలం జ్ఞాపకం పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే చదువుతారు. ఇలా చేయడం వల్ల కొంతకాలానికి ఆ సమాచారాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలాకాకుండా అర్థం చేసుకుంటూ చదివితే.. విషయం మీద పూర్తిగా పట్టువస్తుంది. దాంతో అవసరమైనప్పుడల్లా ఆ సమాచారాన్ని చక్కగా రాయగలుగుతారు. కాబట్టి చదివింది గుర్తుంచుకోవడమే ప్రధానం కాకూడదు. అది ఎంతవరకూ అర్థమైందనే దానికీ ప్రాముఖ్యమివ్వాలి.

సొంతంగా కొన్ని ప్రశ్నలు

చదివేటప్పుడు మీకు మీరే కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సమాధానాలు రాబట్టాలి. పాఠ్యాంశం చివర ఉండే ప్రశ్నలకూ సమాధానాలు తెలుసుకోవచ్చు. లేదా మీరే సొంతంగా కొన్ని ప్రశ్నలు తయారుచేసుకుని సమాధానాలను రాబట్టవచ్చు. ఇలా చేస్తే విషయం చక్కగా అర్థంకావడం వల్ల త్వరగా మర్చిపోలేరు. ఉదాహరణకు ప్రపంచ చరిత్రలో రెండు దేశాలవారు భాగస్వాములుగా మారి ప్రపంచ వ్యాపారం చేశారనుకుందాం. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదువుకుంటూ ముందుకు వెళ్లకూడదు. ప్రత్యేకంగా ఆ రెండు దేశాలకు చెందినవారే ఎందుకు భాగస్వాములయ్యారు? వాళ్లను కలిపిన అంశాలేమిటి? వాళ్లకు నౌకా నిర్మాణం తెలుసా? సముద్రయానానికి అవసరమైన పరిజ్ఞానం వాళ్ల దగ్గర ఉందా?.. ఇలాంటి ప్రశ్నలు వేసుకుని సమాధానాలు రాబట్టడం వల్ల విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మర్చిపోయి మళ్లీ చదవాల్సిన అవసరం రాదు.

అదనపు సమాచారం జోడించాలి

ఒక అంశాన్ని గతంలో మీరు చదివి ఉండొచ్చు. రెండోసారి చదివే సమయానికి దాంట్లో మరి కొన్ని పరిణామాలు చోటుచేసుకునీ ఉండొచ్చు. అప్పుడు ప్రాథమిక విషయానికి అదనపు సమాచారాన్ని జోడిస్తే విషయం సమగ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వర్తమానాంశాలను చదివేటప్పుడు ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను జోడించడం అలవాటు చేసుకోవాలి. ఈ నైపుణ్యంతో పరీక్షలు బాగా రాయగలుగుతారు. అంతేకాదు ఉద్యోగ నియామక పోటీ పరీక్షలు రాసినప్పుడూ.. ఇంటర్వ్యూల సమయంలోనూ మంచి ఫలితాలను పొందగలుగుతారు.

దృశ్య రూపంలో..

కేవలం టెక్స్‌ట్‌పై ఆధారపడే కంటే.. డయాగ్రమ్‌, ఫ్లోచార్ట్‌ల రూపంలో సమాచారాన్ని భద్రపరుచుకుంటే ఎక్కువ కాలంపాటు గుర్తుంటుంది. కళ్లతో చూసిన వాటిని త్వరగా మర్చిపోలేం. ఉదాహరణకు ఒక జీవి పరిణామక్రమాన్ని డయాగ్రమ్‌ వేసుకుంటే.. ఏ దశ తర్వాత ఏది వస్తుందనేది కంటి ముందు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే విషయాన్ని ఫ్లాష్‌కార్డ్‌ల రూపంలో భద్రపరిచినా ఎక్కువ కాలంపాటు గుర్తుంటుంది.

నిద్ర లేకుండా చదివితే...

కొందరు విద్యార్థులు చివరి నిమిషం వరకూ చదవడాన్ని వాయిదా వేస్తారు. మర్నాడు పరీక్ష రాయాల్సి ఉండగా.. రాత్రంతా కూర్చుని చదివేస్తారు. నిద్ర లేకుండా హడావుడిగా చదవటం వల్ల అంతా గందరగోళంగా ఉండి, పరీక్ష సవ్యంగా రాయటంలో వెనకబడతారు. ఒకవేళ తర్వాతి సంవత్సరం కూడా ఇదే పాఠ్యాంశం కొనసాగితే.. ప్రాథమిక సమాచారం కూడా గుర్తుండకపోవచ్చు. అందుకే ఏ రోజు పాఠ్యాంశాలను ఆ రోజే చదువుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదు. తగిన వ్యవధితో పునశ్చరణ చేసుకుంటే సరిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని