కళాశాల విద్యార్థులకు కెరియర్‌ శిక్షణ

కెరియర్‌ ఎంపిక విషయంలో కాలేజీ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి.. సలహాలూ, సూచనలూ ఇవ్వడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుందని ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో అనుకునే ఉంటారు కదా.. సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే చక్కని కార్యక్రమం అందిస్తోంది ఇంటర్న్‌శాల.

Updated : 26 Dec 2023 05:47 IST

కెరియర్‌ ఎంపిక విషయంలో కాలేజీ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి.. సలహాలూ, సూచనలూ ఇవ్వడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుందని ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో అనుకునే ఉంటారు కదా.. సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే చక్కని కార్యక్రమం అందిస్తోంది ఇంటర్న్‌శాల. దీనిద్వారా కళాశాల విద్యార్థులకు కెరియర్‌  ఎంపికకు సంబంధించిన అంశాల్లో అవగాహన పెంచుకునే అవకాశం కలుగుతుంది.

మైక్రోసాఫ్ట్‌, ఇంటర్న్‌శాల సంయుక్తంగా ‘టేక్‌ లెసన్స్‌’ అనే ప్రోగ్రామ్‌ను రూపొందించాయి. దీని ద్వారా ఉద్యోగ సాధనకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని కళాశాల విద్యార్థులకు అందజేస్తారు. పరిశ్రమకు చెందిన నిపుణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. డిజిటల్‌ మార్కెటింగ్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంటర్న్‌షిప్స్‌, ఉద్యోగ సన్నద్ధత, ఎంఎస్‌-ఎక్సెల్‌లో శిక్షణనిస్తారు.

కొత్త సంవత్సరంలో జనవరి 5 నుంచి 20 వరకూ నిర్దిష్ట అంశాన్ని బట్టి వివిధ తేదీల్లో ఈ శిక్షణ ఆరంభమవుతుంది.  

ఈ సెషన్లలో ఉద్యోగ సాధనకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వడమే కాకుండా విద్యార్థుల సందేహాలకు సమాధానాలూ చెబుతారు. అలాగే కెరియర్‌ ఎంపికలో విద్యార్థులకు అవసరమైన సూచనలందిస్తూ వారికి అన్నివిధాలుగా సాయపడతారు. దీనికి హాజరయ్యే విద్యార్థులకు షార్ట్‌టర్మ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ కోర్సుల్లో 10 శాతం రాయితీ సదుపాయం కూడా ఉంటుంది. ప్రారంభ స్థాయిలో ఉండే 80కు పైగా కోర్సులకు ఈ సదుపాయం ఉంటుంది. వీటిల్లో ప్రోగ్రామింగ్‌, ఇంజినీరింగ్‌, కెరియర్‌ డెవలప్‌మెంట్‌, డిజైన్‌, మీడియా, డేటా సైన్స్‌, క్రియేటివ్‌ ఆర్ట్స్‌, బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైనవి ఉన్నాయి.

‘భారత్‌లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశంలో సాంకేతిక పురోగతి, సరికొత్త ఆవిష్కరణలు.. స్కిల్స్‌ ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి. నైపుణ్యాలున్న వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వడానికే పరిశ్రమలూ మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి వృత్తిని ఎంచుకుంటే విజయం సాధించవచ్చనే విషయంలో యువతకు కొన్ని సందేహాలూ తలెత్తుతుంటాయి. ఇలాంటివారికి ఈ కార్యక్రమం మార్గ నిర్దేశం చేస్తుంది. సరైన కెరియర్‌ను ఎంచుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో యువతకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తాం’ అని తెలిపారు ఇంటర్న్‌శాల శిక్షణాధిపతి షాదబ్‌ ఆలం.


ముఖ్యాంశాలు

  • ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా.. నిపుణులు, అనుభవజ్ఞులైన ట్యూటర్లు జాబ్‌ ఇంటర్వ్యూ నైపుణ్యాలను బోధిస్తారు.
  • ప్రోగ్రామ్‌కు ముందురోజుగానీ లేదా అదేరోజునగానీ కాలేజీ విద్యార్థులు తమ పేరును రిజిస్టర్‌ చేసుకోవచ్చు.
  • ఈ మార్గదర్శకాలను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
  • ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇతర ప్రోగ్రామ్‌లను కూడా నేర్చుకోవచ్చు.  
  • రిజిస్ట్రేషన్‌కు: https://takelessons.com/en-in/events/classifieds/internshala

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు