కరెంట్‌ అఫైర్స్‌

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయి? (భారత్‌లో మంచు చిరుతల జనాభాను లెక్కించడం ఇదే తొలిసారి.

Published : 23 Mar 2024 00:41 IST

మాదిరి ప్రశ్నలు

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయి? (భారత్‌లో మంచు చిరుతల జనాభాను లెక్కించడం ఇదే తొలిసారి. ప్రకృతి పరిరక్షణ ఫౌండేషన్‌, ప్రపంచ వన్యప్రాణి నిధి సహకారంతో భారత వన్యప్రాణి సంస్థ 2019-23 మధ్య కాలంలో మంచు చిరుతల గణన చేపట్టింది. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో దేశంలోనే అత్యధికంగా 477 మంచు చిరుతలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లు ఆ తరువాత స్థానాల్లో నిలుస్తున్నాయి. రహస్యంగా తప్పించుకు తిరగడం, మంచులో కలిసిపోయి ఉండటం వల్ల మంచు చిరుతను ‘పర్వత దయ్యం’గా పిలుస్తారు.)

జ: 718


ఏ మూడు ఆసియా దేశాల్లో ఐటీ సిబ్బందిని అక్రమంగా వినియోగించి చైనా మాఫియా ముఠాలు అంతర్జాతీయ ఆన్‌లైన్‌ మోసాలు సాగిస్తున్నాయని ఐరాస మాదక ద్రవ్యాలు, నేరాల నిరోధక కార్యాలయం (యూఎన్‌ఓడీసీ) ఇటీవల వెల్లడించింది?

జ: మయన్మార్‌, కంబోడియా, లావోస్‌ (మయన్మార్‌లోని  ఆన్‌లైన్‌ కేంద్రాల్లో 1.2 లక్షల మంది, కంబోడియాలో లక్ష మంది ఐటీ సిబ్బంది కట్టు బానిసలుగా పని చేస్తున్నారని వెలుగులోకి వచ్చింది. వీరిలో అత్యధికులు చైనీయులే. భారత్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆఫ్రికా దేశాలవారు బాధితుల్లో ఉన్నారు.)


భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత ఛైర్‌పర్సన్‌గా డాక్టర్‌ ఆర్‌.నందిని బాధ్యతలు చేపట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆమె ఈ హోదాలో పనిచేస్తారు. చంద్ర టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఆమె ఎండీగా ఉన్నారు.


ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్‌ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశం అగ్రస్థానంలో నిలవడం ఇది ఏడోసారి. ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హ్యాపీనెస్‌ సందర్భంగా మార్చి 20న యూఎన్‌ ఆధారిత సంస్థ వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌ 2024ను విడుదల చేసింది. ప్రపంచంలోని 143 దేశాల ప్రజల మనోభావాల ఆధారంగా దీన్ని రూపొందించారు.

  • సంతోష సూచీల్లో నార్డిక్‌ దేశాలైన ఫిన్లాండ్‌ (1), డెన్మార్క్‌ (2), ఐస్‌లాండ్‌ (3) వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్‌ 126వ స్థానంలో నిలిచింది.
  • ఆఫ్గనిస్థాన్‌ ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది.

ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఏబీఏ) ఛైర్మన్‌గా ఎంవీ రావు ఎన్నికయ్యారు. 2024, మార్చి 21న జరిగిన ఐబీఏ మేనేజింగ్‌ కమిటీ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎంవీ రావు ప్రస్తుతం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈఓగా ఉన్నారు.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌, ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎస్‌ఎల్‌ జైన్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎన్‌.కమకోడిల వైస్‌ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ అండ్‌ కువైట్‌ కంట్రీ హెడ్‌, సీఈఓ మాధవ్‌ నాయర్‌ గౌరవ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

మరింత సమాచారం కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని