ఒకటి సంకుచిత భావన... మరొకటి బహుముఖ అభివృద్ధి

ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి అభివృద్ధి ప్రణాళికా రచన ద్వారా సామాజిక ప్రయోజనాన్ని పెంచి, ఆర్థిక వృద్ధిని సాధించాలని ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకుంటాయి.

Published : 01 May 2024 00:24 IST

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి అభివృద్ధి ప్రణాళికా రచన ద్వారా సామాజిక ప్రయోజనాన్ని పెంచి, ఆర్థిక వృద్ధిని సాధించాలని ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకుంటాయి.
దీనికి అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు ఆర్థిక వృద్ధి రేటును త్వరితగతిలో పెంచడంపై దృష్టి సారిస్తాయి. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించి ఆర్థికాభివృద్ధిని పెంచడం దీనిలో భాగం. ఆర్థిక వృద్ధి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వృద్ధిరేటులోని హెచ్చుతగ్గుల ద్వారా అనేక నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. వీటన్నింటిపై పోటీ పరీక్ష అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలి.

ర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. ఆర్థికాభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందింది.

  • 1950 - 51, 1980 - 81 మధ్యనున్న 30 సంవత్సరాల ప్రణాళికా కాలంలో, 1970 - 71 స్థిర ధరల్లో జాతీయాదాయ దీర్ఘకాలిక వృద్ధిరేటును ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ అంచనా వేశారు.
  • ఈయన అభిప్రాయం ప్రకారం, ఈ ముఫ్పై ఏళ్లలో జాతీయాదాయ వార్షిక వృద్ధిరేటు 3.5%గా ఉంది. ఈ తక్కువ వృద్ధిరేటును ‘హిందూ ఆర్థిక వృద్ధిరేటు’గా పేర్కొన్నారు.
  • 1950 - 51, 2000 - 01 మధ్య జాతీయాదాయ దీర్ఘకాలిక వృద్ధిరేటు 4.2%గా ఉంది. హిందూ వృద్ధిరేటును అధిగమించడానికి ముఖ్యకారణం 1980 - 81,
  • 2000 - 01 మధ్యకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధిరేటును సాధించడమే.
  • భారత ఆర్థిక వ్యవస్థ సమీక్ష - జనవరి 2024 నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో మనదేశ వృద్ధిరేటు ముందస్తు అంచనా 7.3%

ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి భావనలు

ఆర్థిక వృద్ధి (Economic Growth)

ర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు చెందింది.

  • కిండల్‌ బర్గర్‌ ప్రకారం, ఆర్థిక వృద్ధి అనేది అధిక ఉత్పత్తిని సూచిస్తే, ఆర్థికాభివృద్ధి అనేది అధిక ఉత్పత్తులతో పాటు ఉత్పత్తికి, పంపిణీకి దోహదపడ్డ సాంకేతిక, సంస్థాపూర్వక మార్పులను సూచిస్తుంది.
  • ఆర్థిక వృద్ధి పరిమాణాత్మక ప్రాధాన్యతను సూచిస్తే, ఆర్థికాభివృద్ధి పరిమాణాత్మక, గుణాత్మక ప్రాధాన్యతను సూచిస్తుంది.
  • మైఖేల్‌ పి. తొడారో ప్రకారం, ఆర్థిక వృద్ధి అనే ఒక స్థిరమైన ప్రక్రియ ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం కొంతకాలంలో పెరుగుతుంది. దీంతో జాతీయోత్పత్తిలో, ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది.
  • సైమన్‌ కుజ్నెట్స్‌ ప్రకారం, ఆర్థిక వృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. ఇందులో మొత్తం జనాభాలో వాస్తవ జాతీయాదాయం, వాస్తవిక తలసరి ఆదాయంలో సుస్థిర పెరుగుదల చోటుచేసుకుంటుంది.
  • మహబూబ్‌-ఉల్‌-హక్‌ ప్రకారం, ఆర్థిక వృద్ధి నుంచి ఉపాధి కల్పన పొందడం కంటే ఉపాధి కల్పన నుంచి ఆర్థిక వృద్ధిని పొందే విధానాన్ని భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరించాలి.
  • మాడిసన్‌ అభిప్రాయం ప్రకారం, ధనిక దేశాల్లోని ఆదాయ స్థాయిలోని పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని, పేద దేశాల్లోని ఆదాయ స్థాయిలోని పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అని పిలుస్తారు.
  • వ్యవస్థ నిర్మితి మారకం ఒకటి లేదా ఎక్కువ కోణాల్లో విస్తరిస్తే వృద్ధి అని జాన్‌ ఫ్రీడ్‌మన్‌ నిర్వచించాడు.
  • ఆర్థిక వృద్ధి అనేది సంకుచితమైన భావన. వనరుల నాణ్యత పెరుగుదల (ఉదా: విద్య), వనరుల పరిమాణం పెరగడం, సాంకేతికత వృద్ధి చెందడం వల్ల ఒక దేశంలోని నిజ జాతీయోత్పత్తిలో సంభవించిన పెరుగుదలను ఆర్థికవృద్ధి సూచిస్తుంది.
  • ఆర్థిక వ్యవస్థకు చెందిన ప్రతి రంగంలోని వస్తు, సేవల ఉత్పత్తుల విలువ పెరుగుదలను సూచిస్తుంది.
  • వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే నిలకడైన వృద్ధిని ‘ఆర్థిక వృద్ధి’ అంటారు.
  • ఒక దేశ స్థూలదేశీయోత్పత్తిలోని (జీడీపీ) పెరుగుదలను ఆర్థికవృద్ధి అంచనా వేస్తుంది.
  • ఒక దేశంలో ఒక సంవత్సరం ఉత్పత్తయ్యే మొత్తం వస్తు, సేవలను వర్తమాన మార్కెట్‌ ధరల్లో లెక్కిస్తే వచ్చే మొత్తాన్ని స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు.
  • వస్తు, సేవల ఉత్పత్తి పెరగకుండా కేవలం ధరలు పెరగడం వల్ల కూడా స్థూలజాతీయోత్పత్తి పెరగవచ్చు. కాబట్టి దీన్ని వర్తమాన ధరల్లో కాకుండా స్థిరమైన ధరల్లో లెక్కించినట్లయితే వాస్తవ స్థూలజాతీయోత్పత్తి లభిస్తుంది.
  • స్థూల వస్తు, సేవలు పెరిగినప్పటికీ, దేశ జనాభా ఇంకా ఎక్కువగా పెరిగినట్లయితే తలసరి ఆదాయం తగ్గుతుంది.
  • దీర్ఘకాలంలో వస్తు, సేవల ఉత్పత్తి నిలకడగా పెరిగినట్లయితే దాన్ని వృద్ధిగా గుర్తిస్తాం. అందువల్ల వాస్తవ స్థూలజాతీయోత్పత్తిలోని దీర్ఘకాల పెరుగుదలను ఆర్థిక వృద్ధిగా చెప్పవచ్చు.

ఆర్థికాభివృద్ధి

మైఖేల్‌ పి.తొడారో అభిప్రాయం ప్రకారం, ఆర్థికాభివృద్ధి బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ. సామాజిక సంస్థల్లో చెప్పుకోదగిన మార్పులు ఈ ప్రక్రియలో భాగం. అంతేకాకుండా త్వరితగతిన ఆర్థిక వృద్ధి, అసమానతల తగ్గుదల, పేదరిక నిర్మూలన ప్రక్రియలు ఇందులో ఉంటాయి.

  • యునైటెడ్‌ నేషన్స్‌ నిపుణుల కమిటీ ప్రకారం, అభివృద్ధి అనేది కేవలం మానవుడి భౌతిక అవసరాలనే కాకుండా అతడి సామాజిక జీవనంలో పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటుంది. అందువల్ల అభివృద్ధి అనేది కేవలం ఆర్థిక వృద్ధినే కాకుండా వృద్ధితో పాటు సాంఘిక, సాంస్కృతిక, సంస్థాపక, ఆర్థికపరమైన మార్పులను సూచిస్తుంది.
  • జాన్‌ ఫ్రీడ్‌మన్‌ అభిప్రాయం ప్రకారం, సామాజిక వ్యవస్థ నిర్మాణాత్మక రూపాంతరం చెందడానికి దోహదపడే నవకల్పన ప్రక్రియే ఆర్థికాభివృద్ధి.
  • ఒక దేశంలోని ప్రజలు తమ దేశంలో లభించే వివిధ వనరులను వినియోగించుకుని వస్తు సేవల ఉత్పత్తిని అధికం చేసుకోవడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు.
  • ఆర్థికాభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన భావన, ఇది గుణాత్మకమైంది.
  • ఆర్థిక వృద్థితో పాటు ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు వచ్చినప్పుడు వాటిని ఆర్థికాభివృద్ధిగా గుర్తిస్తారు.

ఆర్థిక వృద్ధి - ప్రధానాంశాలు

నాభా పెరుగుదల రేటు కంటే వాస్తవిక తలసరి ఆదాయం పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటాన్ని ఆర్థిక వృద్ధి చూపుతుంది.

ర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి సామర్థ్యంలో ఎక్కువ స్థాయి పెరుగుదల నమోదు అయినప్పుడు ఆర్థిక వృద్ధి ఉంటుంది.

  • స్వల్పకాలంలో పొదుపురేటు, మూలధన ఉత్పత్తి నిష్పత్తుల సహాయంతో ఆర్థిక వృద్ధిని కొలుస్తారు.
  • దీర్ఘకాలంలో దీన్ని శ్రమశక్తి పెరుగుదల, సాంకేతిక వృద్ధి సహాయంతో కొలుస్తారు.

ఆర్థిక వృద్ధి నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఎ) ఆర్థిక వ్యవస్థ పొదుపు రేటు
బి) మూలధన - ఉత్పత్తి నిష్పత్తి (మూలధన విలువను ఉత్పత్తితో భాగించగా వచ్చేది)
సి) శ్రామికశక్తి వృద్ధిరేటు
డి) సాంకేతిక ప్రగతిలో వృద్ధిరేటు

ఆర్థిక వృద్ధి = జాతీయాదాయంలో, తలసరి ఆదాయంలో స్వయం పోషకంగా జరిగే వృద్ధి


ఆర్థికాభివృద్ధిలో నిర్మాణాత్మక మార్పులు

  • నిరుద్యోగిత, పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గడం
  • అక్షరాస్యత రేటు, విద్యా ప్రమాణాలు పెరిగి, ప్రజల ఆరోగ్యస్థితి మెరుగుపడటం
  • స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా తగ్గి, పరిశ్రమలు, సేవారంగాల వాటా పెరగడం.
  • సంప్రదాయ ఉత్పత్తి పద్ధతులను వదులుకొని ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఎంచుకోవడం
  • రవాణా, విద్యుత్‌, సమాచారం మొదలైన అవస్థాపన రంగాల అభివృద్ధి.
  • పట్టణీకరణ వ్యాపించడం
  • శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందడం
  • ఆర్థికాభివృద్ధి వల్ల ప్రాథమిక రంగంలో (వ్యవసాయం, చేపలు పట్టడం మొదలైనవి) శ్రామికశక్తి వాటా తగ్గి ద్వితీయ (పరిశ్రమలు, గనులు మొదలైనవి) రంగంలో కార్మిక శక్తి వాటా పెరుగుతుంది. అదే విధంగా సేవా రంగంలో కార్మిక వాటా పెరుగుతుంది.
  • జాతీయోత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా పడిపోయి ద్వితీయ, తృతీయ రంగాల వాటాలు క్రమంగా పెరుగుతాయి.
  • పారిశ్రామిక ఉత్పత్తి నిర్మాణంలో మార్పులు సంభవిస్తాయి. మూలధన వస్తువుల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు వినియోగ వస్తూత్పత్తిలో పెరుగుదల ఉంటుంది.
  • విదేశీ వాణిజ్యంలో మార్పులు వస్తాయి. ఎగుమతుల్లో ప్రాథమిక రంగ వస్తువుల వాటా తగ్గి, దిగుమతుల్లో మూలధన వస్తువుల వాటా పెరుగుతుంది.
  • తయారీ, తుది వస్తు సేవల ఎగుమతులు పెరిగి, వినియోగ వస్తువుల దిగుమతుల్లో తగ్గుదల ఏర్పడుతుంది.
  • ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ వ్యవసాయం, వాణిజ్యంలో పాల్గొంటూ వ్యవసాయ ఎగుమతులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అలాగే తక్కువ స్థాయిలో వినియోగ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాయి.
  • ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మార్పులను ఆర్థికాభివృద్ధి తెలియజేస్తుంది.
  • ప్రజల జీవన స్థాయిలో మెరుగుదల, ఆదాయ - సంపద అసమానతల తగ్గుదల, సామర్థ్యం పెరుగుదల, సాంకేతిక విధానంలో మెరుగుదల, పారిశ్రామిక రంగంలో వేగవంతమైన వృద్ధి, ప్రజల ధోరణుల్లో ధనాత్మక మార్పులు ఆర్థికాభివృద్ధిలో గుణాత్మక మార్పులను కలిగి ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని