కరెంట్‌ అఫైర్స్‌

అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?(‘లీవరేజింగ్‌ వాటర్‌ ఫర్‌ పీస్‌’ అనే నినాదంతో 2024లో అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని నిర్వహించారు.

Published : 01 May 2024 00:23 IST

మాదిరి ప్రశ్నలు

అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?(‘లీవరేజింగ్‌ వాటర్‌ ఫర్‌ పీస్‌’ అనే నినాదంతో 2024లో అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని నిర్వహించారు.)

జ: మార్చి 22


ప్రపంచ దేశాల ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల గణాంకాలపై అమెరికా, జర్మనీ, ఫిన్లాండ్‌, చైనాకు చెందిన పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం ప్రకారం 21వ శతాబ్దం తొలి 15 ఏళ్లలో (2000-2015) ప్రపంచవ్యాప్తంగా సాగునీటి పారుదల ఎంత శాతం మేరకు విస్తరించింది? (2000-2015 మధ్యకాలంలో 29.7 కోట్ల హెక్టార్ల నుంచి 33 కోట్ల హెక్టార్లకు పెరిగింది. ఆహారోత్పత్తిలో స్వావలంబన సాధించే లక్ష్యంతో భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లు నిర్మించడం ద్వారా చైనా కోటి 28 లక్షల హెక్టార్లలో, భారత్‌ 85 లక్షల హెక్టార్లలో సాగుభూమికి ఈ 15 ఏళ్లలో అదనంగా నీటి పారుదల సదుపాయాన్ని విస్తరింపజేసుకోనున్నాయి.)

జ: 11 శాతం


భారత సంతతికి చెందిన ఏ అమెరికా వ్యోమగామి మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు? (ఈసారి ఆమెతో పాటు బట్చ్‌ విల్మోర్‌ కూడా వెళ్లనున్నారు. వారు వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉంటారు. వారిద్దరూ బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో మే 6న నింగిలోకి పయనం కానున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ - నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా ఆ వ్యోమనౌకలో నిర్వహిస్తున్న మొదటి మానవసహిత యాత్ర ఇది. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన రెండో మహిళగా ఈమె గుర్తింపు పొందారు.)          

జ: సునీతా విలియమ్స్‌


కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచ ఆర్చరీ సమాఖ్య 2024, ఏప్రిల్‌ 29న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్‌ సింగిల్స్‌లో వెన్నం జ్యోతి సురేఖ (299 పాయింట్లు) రెండో స్థానం పొందింది. ఈ విభాగంలో రెండో ర్యాంకు పొందిన భారత తొలి ఆర్చర్‌ జ్యోతినే. బ్రిటన్‌ ఆర్చర్‌ ఇల్లా గిబ్సన్‌ (325) అగ్రస్థానంలో కొనసాగుతోంది.


ఇండియన్‌ వ్యాక్సిన్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల 2024, ఏప్రిల్‌ 29న ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఈ పదవిలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ అదార్‌ పూనావాలా ఉన్నారు.


హిందూ మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 2020 నుంచి 2100 మధ్య 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరగొచ్చని ఒక అధ్యయనం పేర్కొంది. దీనివల్ల ఈ ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు దాదాపు శాశ్వతంగా ఉంటాయని తెలిపింది. తుపాన్లు తీవ్రం కావొచ్చని, రుతుపవనాల తీరుతెన్నులపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీ (ఐఐటీఎం)కి చెందిన రాక్సీ మాథ్యూ కాల్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది.


పాకిస్తాన్‌ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా గారీ కిర్‌స్టెన్‌ నియమితుడయ్యాడు. ఇతడు 2011 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌స్టర్‌ జేసన్‌ గిలెస్పీ; మాజీ ఆల్‌రౌండర్‌ అజహర్‌ మెహమూద్‌ అన్ని ఫార్మాట్లలోనూ పాక్‌ సహాయ కోచ్‌గా నియమితులయ్యారు.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని