రెవెన్యూ లోటు తగ్గింపు.. బడ్జెట్‌ మిగులు పెంపే వాటి లక్ష్యం

కేంద్ర ప్రభుత్వం పలు పన్నులు విధించి, వసూలు చేస్తుంటుంది. వచ్చిన రాబడి నుంచిరాష్ట్రాలకు వాటాను నిర్ణయించి పంపిణీచేస్తారు. ఏయే రాష్ట్రాలకు ఎంత వాటా కేటాయించాలనే అంశాలను ఆర్థిక సంఘంపర్యవేక్షిస్తుంటుంది.

Updated : 24 Apr 2024 04:03 IST

భారత విత్త సంఘం - కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు
టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

కేంద్ర ప్రభుత్వం పలు పన్నులు విధించి, వసూలు చేస్తుంటుంది. వచ్చిన రాబడి నుంచిరాష్ట్రాలకు వాటాను నిర్ణయించి పంపిణీచేస్తారు. ఏయే రాష్ట్రాలకు ఎంత వాటా కేటాయించాలనే అంశాలను ఆర్థిక సంఘంపర్యవేక్షిస్తుంటుంది. పలు ఆర్థిక సంఘాలురాష్ట్రాలకు కేటాయించాల్సిన వాటా గురించితమ నివేదికల ద్వారా వెల్లడించాయి. సాధారణంగా ఇవి జనాభా, విస్తీర్ణం, రాబడుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటాయి.

కేంద్ర, రాష్ట్రాల మధ్య విత్త సంబంధ విభేదాలు

కేంద్ర, రాష్ట్రాల సంబంధాల్లో కీలక అంశం రాజకీయ విత్త స్వయంప్రతిపత్తి. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు వేర్వేరుగా ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో విభేదాలు బహిర్గతమవుతాయి.

  • 1969లో తమిళనాడు ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై పి.వి. రాజమన్నార్‌ అధ్యక్షతన ఒక కమిటీని, 1983లో ఇదే అంశంపై సర్కారియా కమిషన్‌ను నియమించింది.
  • కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు చేసే ఆదాయ పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా 77.5 శాతంగా ఉండాలని 10వ ఆర్థిక సంఘం నిర్ణయించింది. అయితే 11వ ఆర్థిక సంఘం ఆదాయ పన్ను రాబడిలో రాష్ట్రాల వాటాను 80 శాతానికి పెంచింది.
  • ఎక్సైజ్‌ సుంకం రాబడిలో రాష్ట్రాలకు మొదట 20% వాటాగా నిర్ణయించారు.
  • కేంద్రం విధించి, వసూలు చేసుకునే కార్పొరేషన్‌ పన్ను రాబడిలో రాష్ట్రాలకు వాటా కల్పించే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని, పన్ను చట్టాల్లో సంస్కరణలు చేసి కేంద్ర, రాష్ట్ర విత్త సంబంధాలను సజావుగా ఉండేలా చూడాలని 12వ ఆర్థిక  సంఘం సూచించింది.

13వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు

  • పదమూడో ఆర్థిక సంఘం కాలం: 2010 - 15.
  • ఒకే దేశం - ఒకే పన్ను నినాదంతో పరోక్ష పన్నుల స్థానంలో వస్తు సేవల పన్ను(GST)అమలు గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు Grand Bargain పూర్తి చేసి, జీఎస్‌టీ అమలు చేయడానికి 50000 కోట్ల గ్రాంటు కేటాయించాలని సిఫార్సు చేసింది.
  • రెవెన్యూ లోటు తగ్గించాలని నిర్ణయించారు.
  • బడ్జెట్‌ మిగులు సాధించడంపై దృష్టి సారించారు.
  • ఈ సంఘం కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటా 32%కి పెంచడమే కాకుండా సహాయక విరాళాల మొత్తాలనూ పెంచింది.

14వ ఆర్థిక సంఘం నివేదికలోని ముఖ్యాంశాలు

14వ ఆర్థిక సంఘం కాలపరిమితి: 2015 - 20

  • ఈ సంఘం 2015 ఫిబ్రవరి 24న పార్లమెంటుకు నివేదికను సమర్పించింది.
  • ఈ నివేదికలో భాగంగా రాష్ట్రాలకు వనరుల బదిలీలో పన్నుల రాబడి బదిలీ ప్రధాన మార్గంగా ఉండాలని తెలిపింది. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విత్త వనరుల బదిలీ విరాళాల కంటే పన్నుల రాబడి బదిలీ సరైందని, ఇది గతంలో అమల్లో ఉన్న పద్ధతి కంటే మెరుగైందని చెప్పవచ్చు.
  • రాష్ట్రాల వాటా వనరులను పంపిణీ చేయడానికి సూచించిన నియమ సూత్రాలు:

ఎ) 1971 జనాభాకు 17.5%, 2011 జనాభాకు 10%
బి) చిన్న రాష్ట్రాలకు విస్తీర్ణానికి 2%, పెద్ద రాష్ట్రాల విస్తీర్ణానికి 15%
సి) అడవుల విస్తీర్ణానికి 7.5%
డి) తలసరి ఆదాయాల మధ్య అంతరానికి 50%

14వ ఆర్థిక సంఘం సిఫార్సులు

కేంద్ర పన్నుల నికర రాబడిలో రాష్ట్రాల వాటా 42% గా ఉండాలి.

  • 13వ ఆర్థిక సంఘం నిర్ణయించిన 32% కంటే ఇది 10% ఎక్కువ.
  • రాష్ట్రాల రెవెన్యూ లోటు తగ్గించి, మిగులు ఏర్పర్చాలి.
  • 2015 - 16లో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి రూ.1,94,821 కోట్లు సిఫార్సు చేసింది.
  • 2017 - 18 నాటికి రాష్ట్ర ప్రభుత్వాల కోశలోటు రాష్ట్ర జాతీయోత్పత్తిలో 3% కి మించకూడదు. అలాంటి రాష్ట్రాలకు 0.25% వెసులుబాటు కల్పించాలి.
  • గత సంవత్సరపు రుణ స్థూల జాతీయోత్పత్తి నిష్పత్తి కంటే ప్రస్తుత సంవత్సరం నిష్పత్తి 25% తక్కువగా ఉండే రాష్ట్రాలకు, రెవెన్యూ రాబడిలో 10% కంటే వడ్డీ చెల్లింపులు తక్కువగా ఉండే రాష్ట్రాలకు కూడా ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రుణం స్థూల జాతీయోత్పత్తిలో 62% కి మించకూడదు.
  • FRBM (Fiscal Responsibility and Budget Management) చట్టం 2003ను సవరించాలి.
  • కేంద్ర ప్రభుత్వం చేపట్టే పథకాల సంఖ్య తగ్గించి, అమలు చేసే పథకాల విధానంలో మార్పు చేయాలి.
  • నిర్ణీత కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ విద్యుత్‌ రంగ నష్టాలను పూర్తిగా తగ్గించాలి.
  • రాష్ట్ర అదనపు బడ్జెట్‌ అవసరాలను సహాయక విరాళాలతో భర్తీ చేయాలి.
  • 2015 - 20 కాలానికి మొత్తం సహాయక విరాళాలు రూ. 2,87,436 కోట్లు (రూ.2,00,292 కోట్లు పంచాయతీలకు, రూ.87,144 కోట్లు మున్సిపాలిటీలకు) సిఫార్సు చేసింది.
  • ఈ విరాళాలు స్థానిక ప్రభుత్వాలకు 2011 జనాభా ప్రాతిపదికపై 90%, విస్తీర్ణం ప్రాతిపదికపై 10% గా నిర్ణయించారు.
  • పంచాయతీలకు ఒక గ్రాంటు, మున్సిపాలిటీలకు ఒక గ్రాంటు మంజూరు చేయాలి. అయితే ఈ గ్రాంటులను రెండు విభాగాలుగా విభజించారు.

ఎ) బేసిక్‌ గ్రాంటు: పంచాయతీలకు మంజూరు చేసే మొత్తం గ్రాంటులో 90 శాతాన్ని, మున్సిపాలిటీలకు మంజూరు చేసే మొత్తం గ్రాంటులో 80 శాతాన్ని బేసిక్‌ గ్రాంటుగా నిర్ణయించారు.

బి) పనితీరు (Performance)  గ్రాంటు: పంచాయతీల మొత్తం గ్రాంటులో 10%, మున్సిపాలిటీ మొత్తం గ్రాంటులో 20%గా పనితీరు గ్రాంటును వర్గీకరించారు.

  • రాష్ట్ర ప్రభుత్వం సొంత పన్ను రాబడిని పెంచడానికి పనితీరు గ్రాంట్‌ను ప్రవేశపెట్టింది.
  • గతంలో సహాయక విరాళాలు మంజూరు చేసే పద్ధతికి భిన్నంగా 14వ ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్ల మంజూరు నిర్ణయించింది.
  • ఈ విషయంలో విత్త సంఘం రాష్ట్రాల మొత్తం రెవెన్యూ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంది. కాబట్టి ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం తేడాలను పరిగణించలేదు.

15వ ఆర్థిక సంఘం సిఫార్సులు

2020 - 21లో 15వ ఆర్థిక సంఘం తాత్కాలిక నివేదికను సమర్పించింది. కేంద్ర పన్నుల రాబడిలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభజనను 14వ ఆర్థిక సంఘం 42%గా సిఫార్సు చేసింది.
జమ్మూకశ్మీర్‌ విషయంలో ఈ శాతాన్ని 41%కి మార్చి, మిగతా ఒక శాతాన్ని లద్ధఖ్‌ ప్రాంతానికి కేటాయించాలని ఈ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాబడి విభజన ప్రాతిపదిక: ఆదాయం ప్రాతిపదికన 45%, విస్తీర్ణం ఆధారంగా 15%, జనాభా ప్రాతిపదికన 15%, అడవులు 10%, పన్నుల ఆదాయంపై 5% చొప్పున రాబడిని విభజించారు.
రాష్ట్రాలకు రెవెన్యూలోటు ఆధారంగా విరాళాలు: రెవెన్యూ లోటు ఏర్పడిన తర్వాత 3 ట్రిలియన్లను 2026 వరకు రాష్ట్రాలకు విరాళాల రూపంలో ప్రకటించింది.

  • ఈ గ్రాంట్లు పొందే 17 రాష్ట్రాల సంఖ్యను 2022లో 7 రాష్ట్రాలకు తగ్గించారు.

రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, విరాళాలు: పనితీరు ప్రాతిపదికన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, విరాళాలు ఇస్తారు. కింద ఇచ్చిన వాటి ఆధారంగా వీటిని అందిస్తారు.
1) విద్య, వైద్యంతో కూడిన సాంఘిక రంగం ఆధారంగా
2) వ్యవసాయం, రోడ్లతో కూడిన గ్రామీణ వ్యవస్థ ఆధారంగా
3) పరిపాలన సామర్థ్యం, సంస్కరణలు
4) విద్యుత్‌ రంగం పనితీరుపరంగా
కేంద్ర ప్రభుత్వానికి కోశసంబంధ రాబడి బదలాయింపు: కేంద్రం ప్రాధాన్యతలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి మొత్తం విరాళాల్లో 34% కేటాయించారు.
స్థానిక సంస్థలకు విరాళాలు: నూతన నగరాల వృద్ధికి, వైద్య సౌకర్యాల కల్పనకు మున్సిపల్‌ సేవలు విస్తరింపజేయడానికి స్థానిక సంస్థలకు గ్రాంట్లు అందిస్తారు.

  • పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థల్లో ఒక మిలియన్‌ జనాభా కంటే తక్కువ గల వాటికి మూల విరాళాలు, ఒక మిలియన్‌ కంటే ఎక్కువ జనాభా నగరాలకు 100% విరాళాలు ఇస్తారు.
  • నగరాలు ఈ గ్రాంట్లను స్వచ్ఛమైన గాలి, నీటి సరఫరా, పారిశుద్ధ్యం మొదలైన వాటికి ఉపయోగించాలి.

రాష్ట్రాల మధ్య విరాళాల వనరుల బదిలీ:

  1) జనాభా 2) విస్తీర్ణం 3) ఆదాయాల మధ్య వ్యత్యాసం 4) తలసరి ఆదాయం ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య విరాళాల వనరుల బదిలీ జరుగుతుంది.

జనాభా ప్రాతిపదికలో ముఖ్యాంశాలు: జనాభా నియంత్రణ, ఫలదీకరణ రేటు, పన్నుల రాబడి, వసూలు రేటు తలసరి రాష్ట్ర బిదీశి  లు ఈ ప్రాతిపదికలోని ముఖ్యమైన అంశాలు.

రచయిత
బండారి ధనుంజయ
విషయ నిపుణులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని