pregnancy: గర్భిణి ఆందోళనకు కౌన్సెలింగ్‌ సాంత్వన

గర్భధారణ శారీరకంగానే కాదు, మానసికంగానూ ఒత్తిడికి గురిచేస్తుంది. దీని మూలంగా కొందరు ఆందోళనకూ గురవుతుంటారు.

Published : 21 May 2024 00:06 IST

ర్భధారణ శారీరకంగానే కాదు, మానసికంగానూ ఒత్తిడికి గురిచేస్తుంది. దీని మూలంగా కొందరు ఆందోళనకూ గురవుతుంటారు. నిజానికి గర్భిణులు మానసికంగా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఇది తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మీదా ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయంలో ఆందోళనకు గురైతే కాన్పు తర్వాత తల్లి కుంగుబాటు వంటి సమస్యల బారినపడే ప్రమాదముంది. ఇలాంటి గర్భిణులకు కౌన్సెలింగ్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ఇందులో భాగంగా ఆందోళన లక్షణాలతో బాధపడుతున్న 750 మంది గర్భిణులను ఎంచుకొని సగం మందికి ఎప్పటిలాంటి చికిత్సే చేశారు. మిగతావారికి ఆందోళనను తగ్గించే కౌన్సెలింగ్‌ను ఆరు సార్లు ఇచ్చారు. ఆందోళన కలిగించే ఆలోచనలు వచ్చినప్పుడు సానుకూలంగా ఆలోచించేలా, మంచిగా ప్రవర్తించేలా శిక్షణ ఇచ్చారు. కాన్పయ్యాక ఆరు వారాల తర్వాత పరిశీలించగా.. ఎప్పటిలాంటి మామూలు చికిత్స తీసుకున్నవారిలో 27% మందిలో ఆందోళన లక్షణాలు కనిపించాయి. వీరిలో 41% మంది తీవ్ర కుంగుబాటు బారిన పడ్డారు కూడా. అదే కౌన్సెలింగ్‌ తీసుకున్నవారిలోనైతే కేవలం 9% మందిలోనే ఆందోళన లక్షణాలు పొడసూపాయి. వీరిలో 12% మందే కుంగుబాటుకు గురయ్యారు. మానసిక నిపుణులే కానక్కర్లేదు.. మానసిక వైద్య విద్య అభ్యసిస్తున్నవారు కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఇలాంటి మంచి ఫలితం కనిపిస్తుండటం విశేషం. మానసిక చికిత్స వనరులు అంతగా అందుబాటులో లేని చోట్ల ఇది ఎంతగానో ఉపయోగపడగలదని పరిశోధకులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని