Speech: మాట పదిలం!

ఎవరి మాట వారిదే! అది వారికే ప్రత్యేకం. అందుకే మనిషి కనిపించకపోయినా వారి గొంతుతో ఇట్టే గుర్తు పట్టేస్తాం. రోజువారీ వ్యవహారాల్లో మాట కీలక భూమిక పోషిస్తుంది.

Updated : 21 May 2024 00:19 IST

ఎవరి మాట వారిదే! అది వారికే ప్రత్యేకం. అందుకే మనిషి కనిపించకపోయినా వారి గొంతుతో ఇట్టే గుర్తు పట్టేస్తాం. రోజువారీ వ్యవహారాల్లో మాట కీలక భూమిక పోషిస్తుంది. మన ఇష్టాయిష్టాలను, భావాలను దీంతోనే వెలిబుచ్చుతాం. ఉపాధ్యాయుల వంటి కొన్ని ఉద్యోగాలు, వృత్తులు ప్రధానంగా మాట మీదే ఆధారపడి ఉంటాయి. అయితే ఏదైనా తేడా వస్తే తప్ప చాలామంది దీని మీద అంత శ్రద్ధ పెట్టరు. నిజానికి దీన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం.

గొంతు బొంగురు పోవటం, నొప్పి పుట్టటం, సరిగా మాట్లాడలేకపోవటం వంటివి ఎప్పుడో అప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం. కొన్నిసార్లు హఠాత్తుగా మాట పీలగా మారిపోవచ్చు. తరచూ గొంతు సవరించుకుంటూ ఉండొచ్చు. పాటలు పాడుతున్నప్పుడు పై స్వరాలు అందుకోలేకపోవచ్చు కూడా. ఇవన్నీ గొంతు సమస్యలకు సంకేతాలే. ఎక్కువగా, బిగ్గరగా మాట్లాడటం వీటికి దారితీయొచ్చు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు ముప్పు ఎక్కువ. శ్వాస తీసుకోవటాన్ని ప్రభావితం చేసే జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్లూ గొంతు సమస్యలను తెచ్చిపెట్టొచ్చు. జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొని రావటం కూడా కొన్నిసార్లు ఇబ్బందులు కలిగించొచ్చు. అన్నింటికన్నా ప్రమాదకరమైంది గొంతు క్యాన్సర్‌. ముఖ్యంగా స్వరపేటిక క్యాన్సర్‌తో మాట తీరు పూర్తిగా మారిపోతుంది. జలుబు వంటి లక్షణాలేవీ లేకపోయినా వారాల తరబడీ గొంతు బొంగురు తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. పొగ తాగే అలవాటు గలవారికిది మరింత ముఖ్యం.

శ్రద్ధ పెట్టాలి

చాలావరకూ కొన్నిరోజుల్లోనే గొంతు తిరిగి మామూలుగా అవుతుంది. ఆయా జబ్బులు తగ్గిపోతే మాటా కుదురుకుంటుంది. కానీ కొన్నిసార్లు బొంగురు పోవటం తగ్గకపోవచ్చు. దీంతో మాట సన్నగా, గుసగుసలాడినట్టుగా వస్తుంది. ఇది చివరికి స్వరతంత్రులు దెబ్బతినేలా చేయొచ్చు కూడా. మంచి విషయం ఏంటంటే- కొన్ని జాగ్రత్తలతో మాటను కాపాడుకోవటానికి, సమస్యలను నివారించుకోవటానికి వీలుండటం.

తగినంత నీరు తాగాలి: ఎక్కువగా, బిగ్గరగా మాట్లాడటం వల్లనో.. జలుబు మూలంగానో గొంతు బొంగురు పోయినా, నస పెడుతున్నట్టు అనిపించినా వీలైనంత వరకూ మాట్లాడకుండా చూసుకోవటం మంచిది. అలాగే తగినంత నీరు తాగాలి. ఇది స్వరతంత్రులను తడిగా ఉంచుతూ మాట సాఫీగా వచ్చేలా చేస్తుంది.

పొగ తాగొద్దు: పొగాకు, నికొటిన్, రసాయనాలు, లోపలికి పీల్చుకునే వేడి మూలంగా వాపు, ఉబ్బు తలెత్తుతాయి. నోరు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతాయి. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగటం.. పొగాకు నమలటం మానెయ్యాలి. ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి.

మద్యంతో జాగ్రత్త: మద్యం జోలికి వెళ్లొద్దు. ఒకవేళ అలవాటుంటే పరిమితం చేసుకోవాలి. మద్యంతో ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. ఇది స్వరతంత్రుల మీదా విపరీత ప్రభావం చూపుతుంది. కాఫీ విషయంలోనూ అతి పనికిరాదు. వీటిని తాగిన ప్రతీసారీ తప్పనిసరిగా నీళ్లు కూడా తాగాలి.

స్థాయి తగ్గించుకొని: గట్టిగా అరవటం, బిగ్గరగా మాట్లాడటం వంటివి స్వరతంత్రుల మీద అనవసర ఒత్తిడి కలగజేస్తాయి. కొన్నిసార్లు గొంతునూ దెబ్బతీయొచ్చు. కాబట్టి నెమ్మదిగా, తక్కువగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితుల్లో మందు కాస్త గొంతు పెంచి, నెమ్మదిగా స్థాయి తగ్గించుకుంటూ రావాలి.

ఒకింత సన్నద్ధం: పాఠాలు చెప్పటం, ఉపన్యాసాలు ఇవ్వటం, పాటలు పాడటం వంటివి చేయటానికి ముందు మెడ, భుజాలను సాగదీసే వ్యాయామాలు చేయాలి. కాసేపు కూనిరాగం తీయటమూ మంచిదే. వేర్వేరు అచ్చులను పలుకుతూ కింది, పై స్థాయి స్వరాలను సాధన చేయాలి.

ఛాతీమంట తగ్గించుకోవాలి: గొంతులోకి ఆమ్లం ఎగదన్నుకు రావటం వల్ల ఛాతీమంటతో బాధపడేవారు నిపుణులను కలిసి తగు వైద్యం చేయించుకోవాలి.

మాటిమాటికీ సవరించుకోవద్దు: జలుబు, అలర్జీ వంటివి వచ్చినప్పుడు తరచూ గొంతు సవరించుకోవద్దు, గట్టిగా దగ్గొద్దు. కొద్ది కొద్దిగా నీరు తాగాలి. కావాలంటే దగ్గు తగ్గించే బిళ్లలు చప్పరించాలి.

విశ్రాంతి ఇవ్వాలి: గట్టిగా, ఎక్కువసేపు మాట్లాడి నప్పుడు ఆరోజుకు గొంతుకు కాస్త విశ్రాంతి ఇవ్వటం మంచిది. దీంతో గొంతు బొంగురుపోవటం తగ్గుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు