Paralysis: పక్షవాతాన్ని తప్పించుకోండి

పక్షవాతం పెద్ద సమస్య. దీని మూలంగా అవయవాలు చచ్చుబడితే పూర్తిస్థాయిలో కోలుకోవటం కష్టం.

Updated : 21 May 2024 08:26 IST

పక్షవాతం పెద్ద సమస్య. దీని మూలంగా అవయవాలు చచ్చుబడితే పూర్తిస్థాయిలో కోలుకోవటం కష్టం. జీవితాంతం వైకల్యంతో బాధపడాల్సి వస్తుంది. అందువల్ల దీన్ని నివారించుకోవటమే అత్యుత్తమమైన మార్గం. వయసు, లింగ భేదం, సన్నిహిత కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పక్షవాతం వచ్చి ఉండటం వంటి ముప్పు కారకాల విషయంలో మనం పెద్దగా చేయగలిగిందేమీ లేదు. కానీ కొన్ని కారకాలను మార్చుకోవచ్చు.

క్షవాతానికి అధిక రక్తపోటు అతిపెద్ద ముప్పు కారకం. అధిక రక్తపోటు గలవారికి 80 ఏళ్లకు ముందు పక్షవాతం వచ్చే అవకాశం 2 నుంచి 4 రెట్లు ఎక్కువ. కాబట్టి మందులు వేసుకోవటం.. ఆహార, విహార మార్పులతో రక్తపోటును కచ్చితంగా అదుపులో ఉండేలా చూసుకోవాలి.

  • కొలెస్ట్రాల్‌ మితి మీరకుండా చూసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్‌ రక్తనాళాల్లో పోగుపడుతుంది. ఇది రక్తనాళాల మార్గం సన్నబడటానికి, పూడికలకు దారితీస్తుంది. పూడిక మరీ పెరిగితే రక్తనాళం మూసుకుపోవచ్చు. ఆ భాగం చిట్లిపోయి రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. మెదడు రక్తనాళాల్లో ఇవి ఏర్పడితే పక్షవాతానికి దారితీస్తుంది.
  • మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మధుమేహంతో మెదడులోని రక్తనాళాలు దెబ్బతినొచ్చు. ఇది పక్షవాతం ముప్పు పెంచుతుంది. మధుమేహం గలవారిలో అధిక రక్తపోటూ కనిపిస్తుంటుంది. ఇవి రెండూ కలిస్తే ముప్పు మరింత పెరుగుతుంది.
  • పొగ తాగటం చాలా ప్రమాదకరం. ఇతర ముప్పు కారకాలేవీ లేకపోయినా ఒక్క దీంతోనే పక్షవాతం ముప్పు పెరుగుతుంది. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. మానేసిన రెండేళ్ల తర్వాత పక్షవాతం ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ఐదేళ్ల తర్వాత అయితే పొగ తాగనివారి స్థాయికి ముప్పు పడిపోతుంది.
  • మాదక ద్రవ్యాలతో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. వీటిని తీసుకున్న ప్రతీసారీ ముప్పు పెరుగుతూ వస్తుంది. దీనికి ఇతర ముప్పు కారకాలూ తోడైతే మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి.
  • కొందరికి రక్తనాళాల గోడ బలహీనంగా ఉన్నచోట బుడగలా ఉబ్బుతుంది (అన్యూరిజమ్‌). ఇవి చిట్లిపోయి రక్తస్రావం కావొచ్చు. ఇది మెదడు చుట్టుపక్కల చేరుకొని లోపల పీడనం పెరగొచ్చు. ఫలితంగా వాపు, కొన్నిసార్లు పక్షవాతమూ సంభవించొచ్చు. చిన్న చిన్నవి.. 3 మి.మీ. కన్నా తక్కువ వ్యాసం గల రక్తనాళ ఉబ్బులతో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ 7 మి.మీ. కన్నా పెద్దగా ఉంటే రక్తస్రావమయ్యే అవకాశం ఎక్కువ. ఇలాంటి సమస్య గలవారు శస్త్రచికిత్స లేదా ఇతర పద్ధతులతో మరమ్మతు చేయించుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని