పప్పీలకూ ఓ పండగ!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పప్పీలంటే ఎంతో ఇష్టం కదూ! మనలాగే వాటి పుట్టినరోజులనూ ఘనంగా జరుపుతుంటాం. పండగ సందర్భాల్లోనూ అందంగా ముస్తాబు చేస్తాం. కొన్ని దేశాల్లో పెంపుడు జంతువులకూ ప్రత్యేక రోజులు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటిదే! ఆ వివరాలేంటో తెలుసుకుందామా..

Published : 15 Nov 2022 00:42 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పప్పీలంటే ఎంతో ఇష్టం కదూ! మనలాగే వాటి పుట్టినరోజులనూ ఘనంగా జరుపుతుంటాం. పండగ సందర్భాల్లోనూ అందంగా ముస్తాబు చేస్తాం. కొన్ని దేశాల్లో పెంపుడు జంతువులకూ ప్రత్యేక రోజులు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటిదే! ఆ వివరాలేంటో తెలుసుకుందామా..

నేపాల్‌ దేశంలో కుక్కల కోసం ప్రత్యేకంగా ఓ పండగ నిర్వహిస్తుంటారు. ‘కుకుర్‌ తిహార్‌’ అని పిలుచుకునే ఈ పండగను అక్కడ ఏటా దీపావళి సందర్భంగా అయిదు రోజుల పాటు నిర్వహిస్తుంటారు. పండగలో భాగంగా రెండో రోజు ఇళ్లలోని కుక్కలకు బంతి పూల దండలు వేసి, నుదుటన కుంకుమ బొట్టు పెట్టి అందంగా అలంకరిస్తారు.

వీధి కుక్కలకూ..

‘కుకుర్‌ తిహార్‌’ పండగ నేపథ్యంలో కేవలం పెంపుడు జీవాలనే కాకుండా వీధి కుక్కలనూ ముస్తాబు చేస్తారట. దేశవ్యాప్తంగా జరిగే ఈ పండగలో కుక్కలకు ఇష్టమైన ఆహారం తినిపిస్తారట. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల శరణాలయాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. స్థానికులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారట. పోలీసు జాగిలాలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తారు.

యముడి అనుగ్రహం కోసం..

నేపాల్‌ ప్రజలు కుక్కలను యమధర్మరాజు దూతలుగా భావిస్తుంటారు. అందుకే, అక్కడి ప్రజలు యముడి అనుగ్రహం కోసం ఏటా కుక్కల పండగను నిర్వహిస్తారని చెబుతుంటారు. అంతేకాదండోయ్‌.. ఈ పండగ సందర్భంగా పోలీసు జాగిలాలకు వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు. గెలిచిన వాటికి బహుమతులూ ఇస్తుంటారట. ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘పప్పీ’ అనే పేరున్న జాగిలానికి ‘డాగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అందించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆవులు, పిల్లులతోపాటు కాకులకూ ఈ పండగ నిర్వహిస్తుంటారు. పండగ ఏదైనా పండగే కదా.. అందుకే, నేపాల్‌ ప్రజలు ఈ ‘కుకుర్‌ తిహార్‌’ సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసుకోవడంతోపాటు రంగురంగుల దీపాలతో అలంకరిస్తారట. ఎంతో పవిత్రంగా భావించే ఆరోజు ప్రజలంతా సంప్రదాయ దుస్తులే ధరిస్తారు. నేస్తాలూ.. ఇవీ కుక్కల పండగ విశేషాలు..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని