స్పిరోబ్రాంచస్‌ గిగాంటియస్‌!

హాయ్‌ నేస్తాలూ! ఇంతకీ మీరు శీర్షిక చదివారా! ఇంతకు ముందు ఎప్పుడూ దీన్ని విని కానీ, చదివి కానీ ఉండరు కదూ! హి..హి..హి.. నాకు తెలుసు. ఇంతకీ స్పిరోబ్రాంచస్‌ గిగాంటియస్‌ అంటే ఏంటో తెలుసా...!

Updated : 28 Dec 2023 02:12 IST

హాయ్‌ నేస్తాలూ! ఇంతకీ మీరు శీర్షిక చదివారా! ఇంతకు ముందు ఎప్పుడూ దీన్ని విని కానీ, చదివి కానీ ఉండరు కదూ! హి..హి..హి.. నాకు తెలుసు. ఇంతకీ స్పిరోబ్రాంచస్‌ గిగాంటియస్‌ అంటే ఏంటో తెలుసా...! ఆశ, దోశ, అప్పడం, వడ.. అన్నీ ఇక్కడే తెలుసుకుందామనే! అస్సలు కుదరదు... కచ్చితంగా మీరు కథనం చదవాల్సిందే!!

స్పిరోబ్రాంచస్‌ గిగాంటియస్‌.. అనేది నా పేరు. నేనో సముద్ర జీవిని. అయినా నా పేరు కాస్త కఠినంగా ఉంది కదూ! నన్ను క్రిస్మస్‌ ట్రీ పురుగు అని కూడా అంటారు. ఎంచక్కా మీరు ఇలా పిలిచేయండి సరేనా! నాకు క్రిస్మస్‌ ట్రీల ఆకారంలో రెండు కిరీటాలు ఉంటాయి. వాటివల్లే నాకు ఆ పేరు వచ్చింది. ఓ విధంగా నాకు అవి చేతుల్లాంటివన్నమాట. ఇందులో చిక్కుకున్న ఆహారాన్ని నా నోటికి చేరవేస్తాయవి. మరో విషయం ఏంటంటే ఈ కిరీటాలనే నా శ్వాసక్రియ కోసమూ ఉపయోగిస్తుంటాను. అందుకే వాటినే మొప్పలు అని కూడా పిలుస్తారు.

 అడుగు భాగంలో అడుగడుగునా...

 నేను కరేబియన్‌ సముద్ర జలాల నుంచి ఇండో- పసిఫిక్‌ వరకు విస్తరించి ఉన్నాను. సముద్రపు అడుగు భాగంలో 10 నుంచి 100 అడుగుల లోతుల్లో అడుగడుగునా ఉంటాను. ముఖ్యంగా పగడపు దిబ్బలకు దగ్గరగా జీవిస్తుంటాను. నేను నీటి నుంచి సూక్ష్మజీవులను ఫిల్టర్‌ చేస్తాను. అవి నేరుగా నా జీర్ణవ్యవస్థలోకి వెళ్లిపోతాయి. అవి జీర్ణమయ్యాక నాకు కావాల్సిన శక్తి లభిస్తుంది.

కుదిరితే కుదురుగా...

అన్నీ కుదిరితే నేను కుదురుగా ఉంటాను. అంటే నేను ఒకే చోట జీవిస్తాను. ఎక్కువగా అటూ ఇటూ కదలను. ఉన్న చోట నుంచే ఆహారాన్ని సంపాదించుకుంటాను. ఏదైనా ఆపద వస్తే వెంటనే నా కిరీటాలను గొట్టంలాంటి నా శరీరంలోకి లాక్కుంటాను. అంతా సురక్షితం అనుకున్నాకే మళ్లీ అవి బయటకు వస్తాయి. నా శత్రువుల నుంచి నన్ను నేను రక్షించుకోవడానికే ఈ ఏర్పాటన్నమాట.

రంగు రంగులుగా...

నాలో చాలా రకాలున్నాయి. ఒక్కో రకం ఒక్కో రంగులో ఉంటుంది. నేను మరీ పెద్ద జీవినేం కాదు. కేవలం 3.8 సెంటీమీటర్లు ఉంటానంతే. అంత పెద్ద సముద్రంలో ఇంత చిన్నగా ఉన్నా... నా రంగు, హంగు వల్లే నన్ను డైవర్లు, పరిశోధకులు తేలిగ్గా గుర్తించగలుగుతారు. నేను ఎంచక్కా దాదాపు 40 సంవత్సరాల వరకు జీవిస్తాను.

పగడాలపై మీ ఆగడాల వల్ల!

ప్రస్తుతం నా ఉనికికి అంతగా ప్రమాదం ఏమీ లేదు. కానీ వాతావరణ మార్పులు, కాలుష్యం నాకు ముప్పుగా మారుతున్నాయి. మీ మానవుల కార్యకలాపాల వల్ల పగడపు దిబ్బలు నాశనమవుతున్నాయి. వాటితోపాటే నాకూ కాస్త ఇబ్బంది కలుగుతోంది. మొత్తానికైతే నా పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇకనైనా మీరు ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేయడం ఆపండి సరేనా! నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని