Prajwal Revanna: డిప్లొమాటిక్‌ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్‌.. విదేశాంగ శాఖ వెల్లడి

లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ రేవణ్ణ డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

Published : 03 May 2024 00:05 IST

దిల్లీ: ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఎమ్మెల్యే రేవణ్ణపై లైంగిక దౌర్జన్యం అంశం కర్ణాటకను కుదిపేస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే.. ప్రజ్వల్‌ రేవణ్ణ దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు జర్మనీలో ఉంటున్నట్లు తేలింది. దౌత్యపరమైన (డిప్లొమాటిక్‌) పాస్‌పోర్టుతో దేశం దాటి వెళ్లినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతే తప్ప ఆయన విదేశాలకు వెళ్లేందుకు రాజకీయంగా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, తాము కూడా ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు వారాంతపు ప్రెస్‌మీట్‌లో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిది రంధిర్‌ జైశ్వాల్‌ మీడియాతో మాట్లాడారు.

ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారంటూ వచ్చిన వార్తలపై మీడియా ప్రస్తావించగా.. ఈ విషయంలో తమకు రాజకీయంగా అలాంటి ఆదేశాలు రాలేదన్నారు. తాము కూడా ఎలాంటి వీసా జారీ చేయలేదన్నారు. దౌత్యపరమైన పాస్‌పోర్టుతో దేశం దాటారని, జర్మనీకి వెళ్లడానికి ఎలాంటి వీసా అవసరం లేదన్నారు. ఏ ఇతర దేశానికి వెళ్లేందుకూ తాము వీసా జారీ చేయలేదని చెప్పారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాస్‌పోర్టును రద్దు చేస్తారా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. దానికి నేరుగా జైశ్వాల్‌ సమాధానం చెప్పలేదు. పాస్‌పోర్టు రద్దుకు నియామావళి ఉందని, అయినా ఏ కోర్టు నుంచీ తమకు సంబంధిత ఆదేశాలు రాలేదన్నారు.

‘400 మంది మహిళలపై ప్రజ్వల్‌ అఘాయిత్యం’ - రాహుల్‌ సంచలన ఆరోపణ

ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఎమ్మెల్యే రేవణ్ణపై లైంగిక ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణకు హాజరుకావాలని వీరిద్దరికీ సిట్‌ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందుకు వారం రోజుల సమయం కావాలని ప్రజ్వల్‌ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన దర్యాప్తు బృందం.. ఆయనపై తాజాగా లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసింది. దీంతో ప్రజ్వల్‌ దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలు ఉంటుంది. మరోవైపు విచారణకు సహకరిస్తానని తండ్రి హెచ్‌డీ రేవణ్ణ ఇప్పటికే వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు