కర్ర పుల్లను కాదు... చేపపిల్లనే!

హాయ్‌ ఫ్రెండ్స్‌... నన్ను చూసి మీరు ముళ్లున్న కర్రపుల్ల అనుకుంటున్నారు కదూ! అయితే మీరు తప్పులో కాలేసినట్లే. నిజానికి నేనో చేపపిల్లను.

Updated : 31 Dec 2023 05:46 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... నన్ను చూసి మీరు ముళ్లున్న కర్రపుల్ల అనుకుంటున్నారు కదూ! అయితే మీరు తప్పులో కాలేసినట్లే. నిజానికి నేనో చేపపిల్లను. నా పేరేంటో? తీరేంటో? తెలుసుకోవాలని ఉంది కదూ! ఆ సంగతులన్నీ చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. మరింకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి సరేనా!

 సముద్ర జీవినైన నా పేరు గోస్ట్‌ పైప్‌ ఫిష్‌. ట్యూబ్‌ మౌత్‌ ఫిష్‌ అనే మరో పేరు కూడా ఉంది. నాలో ఆరు రకాలున్నాయి. నేను సీ హార్స్‌ జాతికి చెందిన జీవిని. హిందూ, పసిఫిక్‌ మహా సముద్రాల్లో జీవిస్తుంటాను. దాదాపు 17 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. చాలా వరకు కదలికలు లేకుండా నీటిలో తేలుతుంటాను. నా గురించి తెలియని డైవర్లు నన్ను చూసి ఏదో కర్రపుల్ల అని పొరబడుతుంటారు. బాగా తెలిసిన వారు కూడా అంత తేలిగ్గా నన్ను గుర్తించలేరు. అంతలా పరిసరాల్లో కలిసిపోతుంటాను.

ఊసరవెల్లిలా..

మీకు ఊసరవెల్లి తెలుసుగా! అది పరిసరాలను బట్టి తన రంగుల్ని మార్చుకుంటూ ఉంటుంది. నేను కూడా అలాగే పగడపు దీవులు, బురదతో కూడిన అడుగుభాగాల్లో ఉన్నప్పుడు వాటికి తగ్గట్లు నా రంగును మార్చుకుంటాను. శత్రువులు తేలిగ్గా నా ఉనికిని గుర్తించకుండా ఉండేందుకే ఈ ఏర్పాటన్నమాట. నేను చిన్న చిన్న చేపల్ని, రొయ్యల్ని, ఇతర సముద్ర జీవుల్ని ఆహారంగా తీసుకుంటాను.

శీర్షాసనం వేస్తానోచ్‌!

నేస్తాలూ... మీకు శీర్షాసనం తెలుసా! తల కిందకు, కాళ్లు పైకి పెట్టి చేస్తారు! నేను కూడా సముద్రంలో శీర్షాసనం వేస్తాను. ‘ఎందుకబ్బా...!’ అనే అనుమానం మీకు ఈ పాటికే వచ్చి ఉంటుంది కదూ! నాకు దంతాలవీ ఉండవు కదా.. అందుకే నేను తలకిందులుగా తేలుతూ ఆహారాన్ని తీసుకుంటాను. నోటిద్వారా అమాంతం లోపలకు పీల్చుకుంటాను. అదన్నమాట సంగతి. మరో విషయం ఏంటంటే... నేను చాలా ప్రాంతాల్లో ఎప్పుడంటే అప్పుడు కనిపించను. కొన్ని సీజన్లలో మాత్రమే అగుపిస్తుంటాను. నాకు కాస్త వెచ్చని జలాలు అంటేనే ఇష్టం. మరీ చల్లగా ఉంటే నేను బతకలేను. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ! సరే మరి ఇక ఉంటా.. బై.. బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని