నేనో పూసరవెల్లినోచ్‌!!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా! ఏంటి అలా దిక్కులు చూస్తున్నారు. గొంతు వినిపిస్తోంది కానీ... నేను కనిపించడం లేదని వెతుకుతున్నారు కదూ! కాస్త జాగ్రత్తగా చూడండి... కనిపిస్తాను. ఎందుకంటే...

Updated : 07 Jan 2024 05:12 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా! ఏంటి అలా దిక్కులు చూస్తున్నారు. గొంతు వినిపిస్తోంది కానీ... నేను కనిపించడం లేదని వెతుకుతున్నారు కదూ! కాస్త జాగ్రత్తగా చూడండి... కనిపిస్తాను. ఎందుకంటే... చిన్న పూసంత ఉంటానంతే. ఇంతకీ నేనెవరో చెప్పనే లేదు కదూ! బుజ్జి ఊసరవెల్లిని. మీకు నా గురించి మరిన్ని సంగతులు తెలుసుకోవాలని ఉంది కదూ! అందుకే నా విశేషాలన్నీ మీకు చెప్పిపోదామనే ఇదిగో.. ఇలా వచ్చాను.

నా పేరు బ్రూకేసియా నానా! పలకాలంటే నోరు తిరగడం లేదు కదూ! నాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ముద్దుగా బుజ్జి ఊసరవెల్లి అని పిలిచేయండి సరేనా. మడగాస్కర్‌ నా స్వస్థలం. మరో విషయం ఏంటంటే.. నాలాంటి చాలా చిన్న చిన్న ఊసరవెల్లి జాతులకు ఇది నిలయం. ఎన్నో అరుదైన సరీసృపాలు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. నన్ను కొన్ని సంవత్సరాల క్రితం జర్మనీకి చెందిన పరిశోధకులు కనిపెట్టారు. అంతకు ముందు వరకు బ్రూకేసియా మైక్రో ప్రపంచంలోనే అతి చిన్న ఊసరవెల్లిగా ఉండేది. హి... హి.. హి.. దాని రికార్డును నేను బద్దలు కొట్టానన్నమాట.

 మిల్లీ మీటర్లే... 

మాలో మగవి గరిష్ఠంగా 13.5 మిల్లీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. అగ్గిపుల్ల మీద ఉన్న భాస్వరం బొడిపె మీద కూడా ఎంచక్కా నిలుచోగలవన్నమాట. ఆడ ఊసరవెల్లులు మాత్రం మగవాటికన్నా కాస్త పెద్దగా 29 మిల్లీ మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. మొత్తంగా మేం బ్రూకేసియా మైక్రో కన్నా 1.5 మిల్లీమీటర్లు చిన్నగా ఉంటాం. దాన్ని 2005లో పరిశోధకులు ఉత్తర మడగాస్కర్‌లో జనావాసాలు లేని ప్రాంతంలో గుర్తించారు.

ఎండుటాకులే మాకు గొడుగు!

పగలంతా ఎండుటాకుల చెత్త కింద తలదాచుకుంటాం. రాత్రైతే చిన్న చిన్న మొక్కల మీదకు చేరుకుంటాం. శత్రువుల బారి నుంచి మమ్మల్ని మేం రక్షించుకోవడానికే ఇలా చేస్తాం. చిన్న చిన్న పురుగులు, చీమల్ని ఆహారంగా తీసుకుంటాం. మేం దాదాపు పది సంవత్సరాల వరకు జీవిస్తాం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటా మరి బై.. బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని