రెసిన్‌ ఆర్ట్‌తో.. మెరిసేలా..!

హాయ్‌ నేస్తాలూ..! మనకు రకరకాల బొమ్మలు వేయడం, సొంతంగా చిన్ని చిన్ని బొమ్మలు తయారు చేయడం భలే సరదాగా ఉంటుంది కదా! స్కూల్లో చెప్పిన హోంవర్క్‌ చేయడానికి బద్ధకిస్తాం..

Published : 16 Mar 2024 00:16 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు రకరకాల బొమ్మలు వేయడం, సొంతంగా చిన్ని చిన్ని బొమ్మలు తయారు చేయడం భలే సరదాగా ఉంటుంది కదా! స్కూల్లో చెప్పిన హోంవర్క్‌ చేయడానికి బద్ధకిస్తాం.. కానీ, బొమ్మలు చేయడం లాంటి ప్రాజెక్టు వర్క్స్‌ మాత్రం ఆసక్తిగా చేసేస్తాం.. ఇంతకీ ఇదంతా ఎందుకూ అంటారా.. ఓ అన్నయ్య రెసిన్‌ ఆర్ట్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. మరి తన వివరాలేంటో తెలుసుకుందామా..!

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌కు చెందిన యతార్థ్‌ కుశ్వత్‌కు 14 సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అన్నా, కొత్తగా ఏదైనా తయారు చేయడం అన్నా చాలా ఇష్టమట. ఏవైనా పాడైపోయిన బొమ్మలు ఉంటే వాటిని మరోలా వాడటానికి ప్రయత్నించేవాడట. అలా తన ఆసక్తితో రెసిన్‌ ఆర్ట్‌ నేర్చుకోవడం ప్రారంభించాడట. ఇంతకీ ఈ రెసిన్‌ ఆర్ట్‌ ఏంటి అనుకుంటున్నారా? అదే నేస్తాలూ.. మనకు నచ్చిన వస్తువులను మరో రూపంలోకి మార్చుకోవడం.

 తక్కువ కాలంలోనే..

 ‘ఇలాంటి ఆర్ట్స్‌ అంటే పెద్దవాళ్లకు సంబంధించినది. పిల్లల వల్ల అసలు అవుతుందా?’ అని అనిపిస్తుంది. కానీ మన కుశ్వత్‌ చాలా తక్కువ సమయంలో ఈ ఆర్ట్‌ మీద పట్టు సాధించాడు. దీనికి తన తల్లిదండ్రుల సహకారమే కారణమట. రెసిన్‌ ఆర్ట్‌తో కీ-చైన్స్‌, ఫొటో ఫ్రేమ్స్‌, గ్రీటింగ్‌ కార్డులు వంటి రకరకాల వస్తువులు తయారు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడా అబ్బాయి. ఆన్‌లైన్‌ వేదికగా ఆ వస్తువులు అమ్ముతున్నాడు కూడా. ఇంత చిన్న వయసులో అంతటి ఘనత సాధించడం చాలా గ్రేట్‌ కదూ! తన సమయంతా దీనికే వెచ్చించి.. చదువుని నిర్లక్ష్యం చేస్తున్నాడేమో అనుకోకండి పిల్లలూ..! అటు చదువుకుంటూనే, ఇటు తనకు నచ్చిన పని చేస్తున్నాడు మన కుశ్వత్‌. తన ప్రతిభతో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సాధించాడు. ఇలాగే తను భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని