మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్‌ కారు

మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్‌ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది.

Published : 27 Apr 2024 16:47 IST

Maruti Suzuki | ముంబయి: దేశంలో అందుబాటు ధరకే హైబ్రిడ్‌ కార్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ (Maruti Suzuki) కంపెనీ నుంచి ఈ కారు రాబోతోంది. ఇందుకోసం జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ చిన్నపాటి హైబ్రిడ్‌ కార్ల తయారీపై పని చేస్తోంది. ఈవిషయాన్ని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కార్ల కంటే ఎక్కువ మైలేజీతో ఇవి రానున్నాయని తెలిపారు. మారుతీ సుజుకీ త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు.

టయోటా హైబ్రిడ్‌ కార్లలో వినియోగిస్తున్న సాంకేతికత ఖర్చుతో కూడుకున్నదని ఆర్‌సీ భార్గవ ఈసందర్భంగా పేర్కొన్నారు. దీనివల్ల హైబ్రిడ్‌ కార్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పారు. దీంతో తక్కువ ఖర్చుతో నడిచే హైబ్రిడ్‌ కార్లను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఇందుకోసం చిన్నపాటి హైబ్రిడ్‌ కార్ల టెక్నాలజీపై సుజుకీ పని చేస్తోందని తెలిపారు. హైబ్రిడ్‌ కార్లపై జీఎస్టీని తగ్గించాలని కోరారు. అప్పుడే అందుబాటు ధరలో మెరుగైన హైబ్రిడ్‌ కార్లను దేశీయ రోడ్లపై చూడడం సాధ్యపడుతుందన్నారు.

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలపై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. హైబ్రిడ్‌ కార్లపై 43 శాతం ట్యాక్స్‌ పడుతోంది. హైబ్రిడ్‌ కార్లపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు. హైబ్రిడ్‌ వాహనాలపై 5 శాతం, ఫ్లెక్స్‌ ఇంజిన్‌ వాహనాలపై 12 శాతానికి తగ్గించాలని కోరారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పన్ను తగ్గించడం ద్వారానే హైబ్రిడ్‌ విస్తరణ ఆధారపడి ఉంటుందని భార్గవ పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్‌ కారును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని