Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Apr 2024 17:03 IST

1. పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్‌దే బాధ్యత: ఎన్డీయే కూటమి

పింఛన్ల పంపిణీలో సీఎస్‌ జవహర్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎన్డీయే కూటమి నేతలు సచివాలయంలో ఆకస్మిక ధర్నాకు దిగారు. సీఎం, సీఎస్‌ కార్యాలయాలు ఉండే మొదటి బ్లాక్‌ వద్ద మెట్లపై బైఠాయించి ఆందోళన చేశారు. సీఎం జగన్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎస్‌కు ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా నేతలు సీఎస్‌ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్‌-5 కంపెనీల్లో 69 వేల మంది!

దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికీ క్షీణిస్తోంది. సాధారణంగా ఐటీలో ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అరుదు. అలాంటిది ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మినహా మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 69 వేల మేరకు ఉద్యోగుల సంఖ్య క్షీణించింది. ఇటీవల ఆయా కంపెనీలు వెలువరించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈవిషయం వెల్లడైంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ట్విటర్‌ (ఎక్స్‌)లో అడుగుపెట్టిన కేసీఆర్‌

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ట్విటర్‌ (ఎక్స్‌)లో ఖాతా తెరిచి.. సామాజిక మాధ్యమం ద్వారా మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు భారాస పార్టీ పేరుతో ట్విటర్‌ ఖాతా ఉంది. తాజాగా KCRBRSPresident పేరుతో ‘ఎక్స్‌’ ఖాతా ప్రారంభించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.  జైల్లో కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు..!

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Policy Scam Case)లో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. టైప్‌-2 డయాబెటీస్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. హెలికాప్టర్‌లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కిన ఆమె అదుపుతప్పి తూలి కింద పడిపోయారు. ఈ మధ్యాహ్నం పశ్చిమ బర్ధమాన్‌ జిల్లాలోని దుర్గాపుర్‌ నుంచి దీదీ అసన్‌సోల్‌ వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కారు. లోపలికి వెళ్లి సీట్లో కూర్చునే సమయంలో ఆమె బ్యాలెన్స్‌ కోల్పోయి కిందపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

సీఎం జగన్‌ ఏలుబడిలో బడుగు బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అధ్వానంగా మారాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ మేరకు జగన్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. నిధులు దారి మళ్లించి బడ్జెట్‌ పరంగా ఉపప్రణాళికను మంటగలిపారని దుయ్యబట్టారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ‘మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!’ అమేఠీ, రాయ్‌బరేలీ అభ్యర్థిత్వాలపై ఖర్గే

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ (Congress) కంచుకోటలుగా పేరొందిన రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం పోటీదారుల పేర్లు ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. దీనికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి

 అమెరికా(USA)లోని సౌత్‌ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలయ్యారు. వారంతా గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల పేర్లు రేఖాబెన్ పటేల్‌, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. బ్యాండేజ్‌ తీసేసిన సీఎం జగన్‌.. వైకాపా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఎట్టకేలకు నుదుటిపై ఉన్న బ్యాండేజ్‌ను తీసేశారు. గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13 సీఎం జగన్‌ నుదుటికి గాయమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బ్యాండేజ్‌ సైజును పెంచుకుంటూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలకు సైతం పెద్ద సైజు బ్యాండేజ్‌తో రావడంతో సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్‌

‘తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన ఎక్స్(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీ అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని