పాత ఇంటికీ క్రేజ్‌!

నగరంలో జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. నివాస స్థాయులు మారుతున్నాయి. ఒకప్పుడు బస్తీలో ఉండే కుటుంబాలు కాస్త మెరుగైన సౌకర్యాలున్న కాలనీలకు మారాలనుకొంటున్నాయి.

Updated : 10 Feb 2024 06:52 IST

అన్ని ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్‌

కొత్త నివాసంతో పోల్చుకొని కొంటున్న జనం

ఈనాడు, హైదరాబాద్‌:  నగరంలో జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. నివాస స్థాయులు మారుతున్నాయి. ఒకప్పుడు బస్తీలో ఉండే కుటుంబాలు కాస్త మెరుగైన సౌకర్యాలున్న కాలనీలకు మారాలనుకొంటున్నాయి. కాలనీల్లో నివాసం ఉంటున్న వారు ఇప్పుడు గేటెడ్‌ కమ్యూనిటీలకు తరలుతున్నారు.  ఆర్థిక స్థితిగతులు పెరుగుతున్న కొద్దీ అనుకూలమైన, అన్ని వసతులున్న ఇళ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలో పాత ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది.
ఉద్యోగ, వృత్తి జీవితం ప్రారంభించినప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి గతంలో చాలామంది సింగిల్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను తీసుకున్నారు. ఇప్పుడు మూడు పడక గదుల ఇళ్లను కొనాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత ఇళ్ల లభ్యత పెరిగింది. మరికొందరు 100 అడుగులు, 50 అడుగుల వెడల్పు రోడ్డులోని అపార్టుమెంట్‌ శిథిలావస్థలో ఉన్నా కొంటున్నారు. ఆ   స్థలాన్ని వాణిజ్యపరంగా వినియోగించుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు.

కొత్తవాటితో దీటుగా అమ్మకాలు..

కొత్తగా కడుతున్న అపార్టుమెంట్లతో దీటుగా పాతవీ ధరలో పోటీ పడుతున్నాయి. అడుగు ధరను పోల్చుకుంటే ప్రాంతాన్ని బట్టి కొంచెం అటూఇటూగా ఉంటున్నాయి. పాతవి కొనేవారు కార్పస్‌ ఫండ్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే కారు పార్కింగ్‌ తదితర సౌకర్యాలకు సంబంధించి కొత్త అపార్ట్‌మెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలతో పోల్చుకుంటే కొంత లాభదాయకమని భావిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలో కొత్త ఫ్లాట్‌ రూ.కోటి వరకు అవుతుంటే.. పదేళ్లు దాటిన అపార్ట్‌మెంట్‌ రూ.70-75 లక్షల్లో వచ్చేస్తోంది. కొన్ని ఇళ్లకు ఇంటీరియర్‌ కాస్త మార్చినా.. అన్నీ కలిపి వారి బడ్జెట్‌లోనే ఉంటుంది. పాత కమ్యూనిటీల్లో కాస్త విశాలంగా రహదారులు, సౌకర్యాలు ఉండటంతో వెనక్కి తగ్గకుండా కొత్తవాటితో సమానంగా కొంటున్నారు.

కొనే ముందు జాగ్రత్తలు..

  •  పాత ఇళ్లను పైమెరుగులు చూసి కాకుండా జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి. అనుభవజ్ఞుల సాయం తీసుకోవాలి.
  •  భవనానికి పగుళ్లు, లీకేజీలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. చిన్నవైతే మరమ్మతులు చేయించుకోవచ్చు.
  •  నివాసం ఉన్న ప్రాంతాలు వరద నీట మునుగుతున్నాయా.., వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులున్నాయి అనేది వాకబు చేయాలి.
  •  ఇంటి పత్రాలు సరైనవేనా అనేది నిర్ధారించుకోవాలి.  అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ను సంప్రదిస్తే ఇబ్బందులు తప్పుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని