కార్యాలయ భవనాలు చకచకా

కార్యాలయాల లీజింగ్‌లో వృద్ధి నమోదైంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 2 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కార్యాలయాల ఏర్పాటుకు లీజ్‌కు తీసుకున్నాయి. 2023 జనవరి నుంచి మార్చి వరకు 1.4 మిలియన్‌ చదరపు అడుగులతో పోలిస్తే ఈసారి ఎక్కువ కావడం విశేషం.

Updated : 06 Apr 2024 03:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: కార్యాలయాల లీజింగ్‌లో వృద్ధి నమోదైంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 2 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కార్యాలయాల ఏర్పాటుకు లీజ్‌కు తీసుకున్నాయి. 2023 జనవరి నుంచి మార్చి వరకు 1.4 మిలియన్‌ చదరపు అడుగులతో పోలిస్తే ఈసారి ఎక్కువ కావడం విశేషం. సరఫరా 2.1 మి.చ.అ.గా ఉన్నట్లు సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తుండటం, హైబ్రీడ్‌ మోడల్‌ పని విధానం, గ్లోబల్‌ కేపబులిటీ కేంద్రాల(జీసీసీ) ఏర్పాటుకు బహుళజాతి సంస్థలు ముందుకురావడంతో కార్యాలయాల లీజింగ్‌లో వృద్ధి నమోదైందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

హైదరాబాద్‌లో కార్యాలయ భవనాలను ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌, ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ ఆపరేటర్లు ఎక్కువగా లీజ్‌కు తీసుకుంటున్నాయి. ఇందులో టెక్నాలజీ సంస్థల వాటానే 43 శాతంగా ఉంది. జీవశాస్త్రాల కార్యాలయాల వాటా క్రమంగా పెరుగుతోంది. తొలి త్రైమాసికంలో వీటి వాటా 24 శాతంగా ఉంది. ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ ఆపరేటర్ల లీజింగ్‌ నిలకడగా సాగుతోంది. వీటి వాటా 18 శాతంగా ఉంది.

విశాలమైన ప్రాంగణాల కోసం..

  • పెద్ద సంస్థలు.. సకల సదుపాయాలు ఉండే గ్రేడ్‌ ఏ కార్యాలయాలను మొగ్గు చూపుతున్నాయి. వీటిలో విశాలమైన ప్రాంగణాలను ఎంపిక చేసుకుంటున్నాయి.
  • గడిచిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్‌ సంస్థ 3.30 లక్షల చ.అ. కామర్‌జోన్‌ వింగ్‌2 లీజ్‌కు తీసుకుంది.
  • మైండ్‌స్పేస్‌వెస్ట్‌లో 1.96 లక్షల చ.అ. విస్తీర్ణాన్ని టేబుల్‌స్పేస్‌ లీజ్‌కు తీసుకుంది.
  • లక్ష్మి ఇన్ఫోబాన్‌ టీ6లో అల్ట్రోమ్‌ 1.40 లక్షల చ.అ. విస్తీర్ణాన్ని లీజ్‌ ఒప్పందం చేసుకుంది.
  • 50వేలు అంతకంటే తక్కువ విస్తీర్ణం కల్గిన లావాదేవీలు సైతం పెద్ద ఎత్తున జరిగాయి.

దేశవ్యాప్తంగా చూస్తే..

మొదటి త్రైమాసికంలో దేశంలోని 9 ముఖ్యనగరాల్లో 14.4 మిలియన్‌ చ.అ. విస్తీర్ణంలో కార్యాలయాల లీజింగ్‌లు జరిగాయి. గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే 3 శాతం తగ్గాయి.

  • బెంగళూరు ముందు వరసలో ఉండగా.. దిల్లీ, హైదరాబాద్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు నగరాల్లోని కార్యాలయాల లీజింగ్‌ వాటానే 65 శాతం ఉంది.

పోకడలను గమనిస్తే..

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పర్యావవరణహితంగా చేపట్టిన కార్యాలయాలకు డిమాండ్‌ పెరగడంతో డెవలపర్లు గ్రీన్‌ సర్టిఫైడ్‌ కార్యాలయాల నిర్మాణాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఉత్పాదకత, ఉద్యోగుల సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లోనూ ఇది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

  • కార్యాలయాలను సాదాసీదాగా కాకుండా ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలుగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని