అష్టకష్టాలు అంటే..

జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటినీ కలిపి మన సనాతన ధర్మం ఎనిమిది విధాలుగా విభజించింది. దానికి శ్లోకరూపం ఇచ్చి ‘రుణం, యాచ్యాచ, వృద్ధత్వం, జార, చోర, దరిద్రతా, రోగశ్చ, బుక్త శేషశ్చా, హ్యష్ట కష్టాః ప్రకీర్తితాః’ అని విస్పష్టం చేసింది.

Published : 28 Apr 2024 15:32 IST

జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటినీ కలిపి మన సనాతన ధర్మం ఎనిమిది విధాలుగా విభజించింది. దానికి శ్లోకరూపం ఇచ్చి ‘రుణం, యాచ్యాచ, వృద్ధత్వం, జార, చోర, దరిద్రతా, రోగశ్చ, బుక్త శేషశ్చా, హ్యష్ట కష్టాః ప్రకీర్తితాః’ అని విస్పష్టం చేసింది. అంటే బతుకుతెరువు కోసం అప్పులు చేయడం, జీవనయాత్ర సాగించేందుకు భిక్షాటన చేయాల్సిరావటం, ముసలితనం వల్ల అన్నిటికీ ఇతరులపై ఆధారపడాల్సిన అగత్యం, దిగజారుడుతనం వల్ల అవమానాలు ఎదుర్కోవటం, దొంగతనంతో అపవాదులు, దారిద్య్ర బాధ, రోగ పీడ, ఒకరి ఎంగిలి తిని ప్రాణాలు నిలబెట్టుకోవాల్సి రావటం- ఇవన్నీ ప్రారబ్ధవశాత్తూ మనుషులు అనుభవించే ఎనిమిది రకాల బాధలని భావం.

నిజానికి వీటిలో చాలావరకూ బలహీనతల వల్ల కొనితెచ్చుకునేవే! మరికొన్ని నిర్లక్ష్య వైఖరి వల్ల, సరైన ప్రణాళిక లేకపోవటం వల్ల సంభవించేవి. అందుకే ‘వ్యాధి, వియోగం, బాధ, బంధం, దురదృష్టం- ఇవి పాపకర్మ ఫలితాలు’ అనేవారు రామకృష్ణ పరమహంస. ఈ అష్టకష్టాలు కూడా ఆ కోవకు చెందినవే! అయితే.. తమ బాధలకు తామే కారణమంటే కొందరు అంగీకరించరు. తాము అనుభవిస్తున్న కష్టాలకు వేరెవరో కారణమని నిందలు వేస్తుంటారు. వాటిని నిబ్బరంగా అనుభవించకుండా ఈసురోమంటూ బతుకును ఈడుస్తుంటారు.

ఎవరికీ లేని కష్టాలు మనకే వచ్చాయంటే, అవి మనకు తెలియని మన పూర్వ కర్మల ఫలితాలేనని అర్థం చేసుకోవాలి. కష్టం రావటం, రాకపోవటం, వ్యాధులు సోకటం, సోకకపోవటం మన అధీనంలో లేకపోవచ్చు. కానీ బాధపడటం, దుఃఖించకపోవటం మాత్రం మన అధీనంలోనే ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని