గురుపత్నికి ఇచ్చేదీ గురుదక్షిణే!

వేదవ్యాసుడి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు. అతడు భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో గురుశుశ్రూష చేసి అష్టసిద్ధులు పొందాడు.

Updated : 14 Mar 2023 14:12 IST

వేదవ్యాసుడి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు. అతడు భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో గురుశుశ్రూష చేసి అష్టసిద్ధులు పొందాడు. గురుదక్షిణ ఇస్తానంటే పైలుడు తనకేమి వద్దన్నాడు. మరీమరీ అడిగితే తనభార్యకి ఏమైనా కావాలేమో అడగమన్నాడు. తల్లిలా ఆదరించిన గురుపత్ని పౌష్యమహారాణి కుండలాలు కావాలంది. గురుపత్నికి ఇచ్చేదీ గురుదక్షిణే అనుకుని ఉదంకుడు బయల్దేరాడు. దారిలో ఓ దివ్యపురుషుడు ఎద్దునెక్కి వస్తుంటే నమస్కరించాడు. ఆయన అనుగ్రహం పొంది పౌష్యరాజును దర్శించుకున్నాడు. తపస్సంపన్నుడైన ఉదంకుడి రాకకు సంతోషించి గౌరవించాడు రాజు. ఉదంకుడి కోరిక విని ఆమెనే అడగమన్నాడు రాజు. రాణి కుండలాలను ఇస్తూ తక్షకుడి కన్ను వాటిమీద ఉందని హెచ్చరించింది. పౌష్యరాజు భోజనం ఏర్పాటుచేయగా అందులో వెంట్రుక వచ్చింది. అలాంటి ఆహారం పెట్టినందుకు అంధుడివైపొమ్మని శపించాడు ఉదంకుడు. సంతాన హీనుడివౌతావని ప్రతిశాపం ఇచ్చాడు రాజు. ఉదంకుడు తనశాపాన్ని ఉపసంహరించుకున్నాడు కానీ రాజుకది సాధ్యం కాలేదు. అయినా బాధపడక కుండలాలకు సంతోషించాడు. దారిలో సంధ్యావందనం చేసేందుకు కుండలాలను శుభ్రమైన ప్రదేశంలో ఉంచి ఆచమనం చేస్తుండగా తక్షకుడు వాటిని తీసుకున్నాడు. ఉదంకుడు వెంటపడి అతడితోపాటు నాగలోకం చేరి, నాగశ్రేష్ఠులూ తదితరులను స్తుతించి, మెప్పించి కుండలాలతో తిరిగొచ్చాడు. గురుపత్ని సంతోషించి, వాటిని ధరించి వ్రతాన్ని పూర్తిచేసింది.

- డాక్టర్‌ అనంతలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని