దేవుడు అనుగ్రహించాడు

కబీర్‌దాస్‌ తాను నేసిన పొడవైన వస్త్రాన్ని అమ్మడానికి పొరుగూరు వెళ్లాడు. దారిలో ఎదురైన వ్యక్తి తన పేదరికాన్ని వివరించి, ఆ వస్త్రాన్ని తనకిమ్మన్నాడు.

Updated : 16 Feb 2023 00:27 IST

బీర్‌దాస్‌ తాను నేసిన పొడవైన వస్త్రాన్ని అమ్మడానికి పొరుగూరు వెళ్లాడు. దారిలో ఎదురైన వ్యక్తి తన పేదరికాన్ని వివరించి, ఆ వస్త్రాన్ని తనకిమ్మన్నాడు. దాన్ని కత్తిరించి కొంత ఇస్తానంటే కాదు, పూర్తిగా కావాలన్నాడు. అతడి పేదరికానికి జాలిపడి కబీర్‌ మొత్తం ఇచ్చేశాడు. నిజానికి వస్త్రాన్ని అమ్మిన పైకంతో ఇంటికి సరుకులు తీసుకెళ్లాలి. కానీ దాన్ని ఉచితంగా ఇచ్చేయడంతో చేతిలో పైసా లేదు. కుటుంబమంతా పస్తులుండాల్సిందే. తన పరిస్థితి తనకే అగమ్యగోచరంగా అనిపించింది. ఇంటికి వెళ్లి వాళ్ల దీన ముఖాలు చూడ లేక వీధి లోనే అరుగు మీద పడుకుని దేవుణ్ణి స్మరించ సాగాడు.

సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి ఎడ్ల బండి నిండా సరుకులు తీసుకుని కబీరు ఇంటికి వచ్చాడు. తమ కొడుకు అప్పు చేయడు, దానధర్మాలను స్వీకరించడు. మరి ఇవన్నీ ఎలా వచ్చాయని- కబీరు తల్లిదండ్రులు నీమా, నీలూ ఆశ్చర్యపోయారు. ‘అయ్యా! దైవదర్శనం కోసం రాజావారు వచ్చారు. ఆయన మీ అబ్బాయిలో మంచీ మానవత్వాలు చూసి ముచ్చటపడ్డారు. ఉదారంగా సంపదలు ఇస్తానంటే కబీరు వద్దన్నాడు. ఎంతో బతిమాలిన మీదట ఈ సరుకులు స్వీకరించడానికి ఒప్పుకున్నాడు’ అని చెప్పి అక్కణ్ణించి వెళ్లిపోయాడు. కాసేపటికి కబీరు ఇంటికి వచ్చాడు. జరిగింది విన్నాక.. అది దైవలీల అని అర్థమైంది. పరమాత్ముడు తనను అనుగ్రహించాడని సంతోషించాడు. కాలమంతా దైవచింతనకు, సంకీర్తనలకు వినియోగించాడు.

వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని