జ్ఞానులు ఆదర్శం

ఒక ముని రోజంతా ధ్యానం చేసి, సాయంత్రం కొలనుకెళ్లాడు. తామరపూల అందానికి ముచ్చటపడి ఓ పువ్వును తెంపాడు.

Published : 25 Jan 2024 00:03 IST

క ముని రోజంతా ధ్యానం చేసి, సాయంత్రం కొలనుకెళ్లాడు. తామరపూల అందానికి ముచ్చటపడి ఓ పువ్వును తెంపాడు. అంతలో అశరీరవాణి ‘మునీంద్రా! ఆ సుమాన్ని మొక్క నుంచి ఎందుకు వేరుచేశావు? తప్పు కదా!’ అంది. ముని తాను చేసిన పనికి చింతించి, అక్కడే గట్టు మీద కూర్చున్నాడు. కొంతసేపటికి ఒక వేటగాడు వచ్చాడు. కొలనులో అడ్డుగా ఉన్నాయని తామర మొక్కలను తెంపి గట్టు మీద పడేసి, ఈతకొట్టి వెళ్లిపోయాడు. అది చూసిన ముని ‘అమ్మా! ఒక పువ్వు కోసినందుకే మందలించావు. మరి అతడు అన్ని మొక్కల్నీ తెంపి పారేశాడు కదా! అతన్నెందుకు నిందించలేదు?’ అన్నాడు, ఆకాశం వంక చూస్తూ. సమాధానంగా అశరీరవాణి ‘మునీంద్రా! నువ్వు జ్ఞానివి, అతడు మూర్ఖుడు. జ్ఞానులు చేసే పనులను జనం ఆదర్శంగా తీసుకుని, ఆచరిస్తారు. సామాన్యుల పనులను ఎవరూ పట్టించుకోరు. కనుక నీ వంటి యోగులు దోషాలు, పాపాలకు తావీయకూడదు. లోకకల్యాణ కారకంగా నడచుకోవాలి’ అంది. మునికి జ్ఞానోదయం కలిగింది. ఆ తర్వాత పొరపాట్లు చేయని మనస్తత్వాన్ని అలవరచుకున్నాడు. 

ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని